బుమ్రా బ్యాక్, భారత టీ-20 జట్టుకు నాయకత్వం!
వెన్నెముకగాయంతో భారతజట్టుకు దూరమైన మెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు.
వెన్నెముకగాయంతో భారతజట్టుకు దూరమైన మెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. ఐర్లాండ్ తో జరిగే టీ-20 సిరీస్ లో భారతజట్టుకు నాయకత్వం వహించనున్నాడు...
యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ ఎటాక్ కు వెన్నెముక లాంటి వాడు. వెన్నెముక గాయంతో గత ఏడాదికాలంగా బుమ్రా అందుబాటులో లేని కారణంగానే భారతజట్టు టీ-20 ప్రపంచకప్ తో పాటు ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్స్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.
అయితే..న్యూజిలాండ్ లో వెన్నెముక శస్త్ర్రచికిత్స చేయించుకొని, తగిన విశ్రాంతి, వ్యాయామాలతో పూర్తిగా కోలుకొని నూటికి నూరుశాతం ఫిట్ నెస్ సాధించడం ద్వారా తిరిగి భారతజట్టుకు అందుబాటులోకి రాగలిగాడు.
ఐర్లాండ్ తో సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ....
వెన్నముక శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని ఫిట్ నెస్ నిరూపించుకొన్న బుమ్రా చేతికి భారత టీ-20 జట్టు పగ్గాలను ఎంపిక సంఘం చేతికి అందించింది.
ఐర్లాండ్ తో ఈ నెల 18 నుంచి 23 వరకు డబ్లిన్ వేదికగా జరిగే మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా నాయకత్వంలోని మొత్తం 15 మంది సభ్యులజట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో గత కొద్దివారాలుగా సాధన చేస్తున్న బుమ్రా తిరిగి పూర్తిస్థాయి ఫిట్ నెస్ ను అందుకోగలిగాడు.
బుమ్రా గాయం భారత్ కు శాపం..
భారతజట్టుకు బుమ్రా కీలక సిరీస్ లు, టోర్నీలలో అందుబాటులో లేకపోడంతో భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ప్రపంచక్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ జస్ ప్రీత్ బుమ్రా కు నాణ్యమైన పేస్ బౌలర్ గా పేరుంది. సాంప్రదాయ టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్...ఫార్మాట్ ఏదైనా ఒకేతీరుగా రాణించడం, ప్రభావశీలమైన ఫాస్ట్ బౌలర్ గా బుమ్రాకు తిరుగులేని రికార్డే ఉంది. యార్కర్లు సంధించడంలో బుమ్రా తర్వాతే ఎవరైనా.
అయితే..గత మూడేళ్లుగా బుమ్రా ఎడాపెడా క్రికెట్ మ్యాచ్ లు ఆడేస్తూ తరచూ గాయాలకు గురికావడం భారతజట్టు విజయావకాశాలను దెబ్బతీస్తూ వస్తోంది. కీలక సిరీస్ లు, టోర్నీల సమయంలో బుమ్రా భారతజట్టుకు అందుబాటులో లేకుండా పోడం తీవ్రప్రభావాన్ని చూపుతోంది.
2022 సెప్టెంబర్లో చివరిసారిగా..
జస్ ప్రీత్ బుమ్రాను వెన్నెముక గాయం వెంటాడుతూనే ఉంది. చికిత్స తీసుకొన్నా, శస్త్ర్రచికిత్స చేయించుకొన్నా ఫిట్ నెస్ ఏమాత్రం మెరుగుపడకపోగా..సమస్య మరింత జఠిలంగా మారింది.
ఆస్ట్ర్రేలియా వేదికగా గతేడాది ముగిసిన టీ-20 ప్రపంచకప్ కు మాత్రమే కాదు..టెస్టు లీగ్ లో భాగంగా జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నుంచి టెస్టు లీగ్ ఫైనల్స్ వరకూ బుమ్రా భారతజట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. చివరకు 2023 ఐపీఎల్ సీజన్ కు సైతం దూరం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
బుమ్రా వెన్నెముక గాయానికి న్యూజిలాండ్ లోని విఖ్యాత వైద్యుడు రోవన్ షౌటర్ శస్త్రచికిత్స నిర్వహించారు.
బుమ్రా పూర్తి కోలుకొని భారతజట్టుకు అందుబాటులోకి రావడానికి 24 వారాలసమయం పట్టింది.
ప్రపంచకప్, టెస్టులీగ్ లకు దూరం...
గత ఏడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా మైదానంలోకి బుమ్రా దిగాడు. వెన్నెముక భాగంలో నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు ఎన్‌సీఏలో స్కాన్ తీయిస్తే సమస్య తీవ్రంగా ఉందని తెలిసింది. దాంతో, టీ20 వరల్డ్ కప్‌లో సైతం ఆడలేదు. అయితే.. ఈమధ్యే అతడిని శ్రీలంక వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన బీసీసీఐ వెంటనే పక్కన పెట్టింది. అతను పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం ఇవ్వాలనుకుంది. అయితే.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ వరకైనా అతను ఫిట్‌నెస్ సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, బుమ్రాకు ఎన్‌సీఏ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ దక్కలేదు.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు ద్వారా ఏడాదికి 7 కోట్ల రూపాయలు అందుకొంటున్న బుమ్రా..ఐపీఎల్ కాంట్రాక్టుపై ముంబై ఫ్రాంచైజీ నుంచి సీజన్ కు 7 కోట్ల రూపాయల చొప్పున ఆర్జిస్తున్నాడు.
29 సంవత్సరాల బుమ్రా భారత్ తరపున 72 వన్డేలు, 60 టీ-20 మ్యాచ్ లు, 30కి పైగా టెస్టులు , ఐపీఎల్ లో ముంబై తరపున 120 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది.
ఐపీఎల్ లో గత సీజన్ వరకూ 145 వికెట్లు పడగొ్ట్టాడు.
టెస్టుల్లో 128 వికెట్లు, వన్డేలలో 121 వికెట్లు, టీ-20ల్లో 70 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం బుమ్రా కు ఉంది.
బుమ్రా కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్...
బుమ్రా నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడని బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా ప్రకటించిన కొద్దిరోజులకే ఎంపిక సంఘం..ఐర్లాండ్ తో జరిగే టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టు పగ్గాలు అప్పజెప్పింది.
బుమ్రా నాయకత్వంలోని భారతజట్టులో పలువురు ప్రతిభావంతులైన యువక్రికెటర్లకు చోటు కల్పించారు. హైదరాబాదీ వండర్ బ్యాటర్ తిలక్ వర్మకు సైతం జట్టులో చోటు దక్కింది.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు : జస్ ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేశ్ కుమార్, అవేశ్ ఖాన్.