Telugu Global
Sports

సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో చోటు లేనట్లేనా?

అపార ప్రతిభ ఉన్నా అరకొర అవకాశాలతో తన ఉనికిని కాపాడుకొంటూ వస్తున్న డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో అవకాశం అంతంత మాత్రమేనని చెబుతున్నారు.

సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో చోటు లేనట్లేనా?
X

అపార ప్రతిభ ఉన్నా అరకొర అవకాశాలతో తన ఉనికిని కాపాడుకొంటూ వస్తున్న డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు వచ్చే ప్రపంచకప్ లో అవకాశం అంతంత మాత్రమేనని చెబుతున్నారు.

భారత క్రికెట్లో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. జాతీయజట్టులోని ఒక్కో స్థానం కోసం నలుగురేసి ప్రతిభావంతులైన ఆటగాళ్లు తలపడే పరిస్థితి నెలకొని ఉంది.

ప్రధానంగా..వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా అరడజనుమంది పోటీపడటంతో సంజు శాంసన్ లాంటి వారి పరిస్థితి అయోమయంగా తయారయ్యింది.

తొమ్మిదేళ్లుగా ఎదురుచూపులు...

జూనియర్ స్థాయి నుంచే అత్యంత ప్రతిభావంతుడైన వికెట్ కీపర్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకొన్న కేరళ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్..సీనియర్ స్థాయిలోనూ సత్తా చాటుకొంటూ వస్తున్నాడు. భారత వన్డే, టీ-20 జట్లలో కీలక ఆటగాడుగా ఉంటూనే తగిన అవకాశాలు లేక సతమతవుతున్నాడు.

ఏటా జరిగే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా, వికెట్ కీపర్ బ్యాటర్ గా నిలకడగా రాణిస్తూ..భారతజట్లలో తన స్థానం కాపాడుకొంటూ వస్తున్నాడు. అయితే..భారత వన్డేజట్టులో స్థానం కోసం కెఎల్ రాహుల్, రిషభ్ పంత్ ల నుంచి, టీ-20 జట్టులో స్థానం కోసం పంత్, ధృవ్ జురెల్, జితేశ్ శర్మ లాంటి నవతరం వికెట్ కీపర్ బ్యాటర్లతో పోటీపడాల్సి వస్తోంది.

రాహుల్ ద్రావిడ్ శిక్షణలో....

రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటుదేలిన సంజు శాంసన్ కు వీరబాదుడు బ్యాటర్ గా, నమ్మదగిన వికెట్ కీపర్ గా పేరుంది. బంతిని గ్రౌండ్ నలుమూలలకూ భారీషాట్లతో పంపగల నేర్పు, సుదూసిక్సర్ల బాదుడులో నైపుణ్యం సంజుకు మాత్రమే సొంతం.

రాహుల్ లేదా పంత్ అందుబాటులో లేని సమయంలో మాత్రమే భారతజట్లలో తనకు లభించిన అవకాశాలను సంజు సద్వినియోగం చేసుకొంటూ వచ్చినా ప్రతిభకు తగ్గ నాయ్యం మాత్రం జరగడం లేదు.

గత సీజన్ ఐపీఎల్ లో అత్యుత్తమంగా రాణించడం ద్వారా 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొన్న 15 మంది సభ్యుల భారతజట్టులో 29 సంవత్సరాల సంజు చోటు సంపాదించినా..కనీసం ఒక్కమ్యాచ్ లోనూ పాల్గొనలేకపోయాడు. నంబర్ వన్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ లీగ్ దశ నుంచి నాకౌట్ ఫైనల్స్ వరకూ మ్యాచ్ లు ఆడుతూ రావడంతో సంజుకు అవకాశం లేకుండాపోయింది.

ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడకపోయినా..విశ్వవిజేత జట్టు సభ్యులకు ఇచ్చే బంగారు పతకంతో పాటు..5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సైతం సంజుకు దక్కాయి.

వచ్చే ప్రపంచకప్ లో మరింత పోటీ...

2026 టీ-20 ప్రపంచకప్ జరిగే నాటికి సంజు శాంసన్ వయసు 31 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే..జితేశ్ శర్మ, ధృవ్ జురెల్ లాంటి యువ వికెట్ కీపర్లతో పాటు..సీనియర్ వికెట్ కీపర్లు రిషభ్ పంత్, రాహుల్ ల నుంచి సైతం సంజుకు గట్టి పోటీ ఎదురుకానుంది.

భారతజట్టులో చోటు దక్కించుకోవాలంటే సంజు దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ లోనూ అసాధారణంగా రాణించితీరాల్సి ఉంది.

మరోవైపు..వయసు రీత్యా చూస్తే..2026 టీ-20 ప్రపంచకప్ జట్టులో 31 సంవత్సరాల సంజు కంటే తక్కువ వయసున్న ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, జితేశ్ శర్మల వైపు టీమ్ మనేజ్ మెంట్ మొగ్గుచూపినా ఆశ్చర్యపోనక్కరలేదని భారత మాజీ క్రికెటర్ , వ్యాఖ్యాత అమిత్ మిశ్రా అంటున్నాడు. సంజుకు భారత టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు అంతతేలిక కాదని తేల్చి చెప్పాడు.

అయితే..రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా లాంటి అసాధారణ ఆటగాళ్లు 35 సంవత్సరాల వయసు దాటిన తరువాత సైతం ప్రపంచకప్ లో పాల్గొని భారత్ ను విజేతగా నిలిపిన వాస్తవాన్ని మరువరాదని, సంజు అసాధారణంగా రాణిస్తే..వయసు ఏమాత్రం అడ్డుకాబోదని చెప్పుకొచ్చాడు.

2015లో భారత్ తరపున తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంజుశాంసన్ కు 16 వన్డేలు, 24 టీ-20 మ్యాచ్ ల్లో ఆడిన రికార్డు ఉంది. జింబాబ్వేతో ఇటీవలే ముగిసిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్ లో సంజు మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా తన జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

రోహిత్, విరాట్ ల రిటైర్మెంట్ తో సంజు శాంసన్ భారత కీలక ఆటగాళ్లలో ఒకడుగా మారాడని కొందరు భావిస్తుంటే..వచ్చే ప్రపంచకప్ వరకూ భారతజట్టులో తన స్థానం కాపాడుకోడం కోసం సంజు నిత్యం పోరాడక తప్పదని మరికొందరు హెచ్చరిస్తున్నారు.

First Published:  18 July 2024 5:06 AM GMT
Next Story