Telugu Global
Sports

టీ-20 ప్రపంచకప్ లో ఐరిష్ పేసర్ హ్యాట్రిక్!

అడిలైడ్ ఓవల్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సూపర్ -12 గ్రూప్ -1 నాలుగోరౌండ్ పోరులో ఐర్లాండ్ పేస్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా సంచలనం సృష్టించాడు.

టీ-20 ప్రపంచకప్ లో ఐరిష్ పేసర్ హ్యాట్రిక్!
X

ఆస్ట్ర్రేలియాలోని ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపై జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో రెండో హ్యాట్రిక్ నమోదయ్యింది. అడిలైడ్ ఓవల్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సూపర్ -12 గ్రూప్ -1 నాలుగోరౌండ్ పోరులో ఐర్లాండ్ పేస్ బౌలర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా సంచలనం సృష్టించాడు.

బౌండ్రీల హోరు, సిక్సర్లజోరుతో సాగిపోతున్న టీ-20 ప్రపంచకప్ లో బౌలర్లు సైతం అడపాదడపా సత్తా చాటు కొంటూ రికార్డుల మోత మోగిస్తున్నారు. సూపర్ -12 రౌండ్లో ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికా యువహిట్టర్ రూసో, న్యూజిలాండ్ సంచలన హిట్టర్ గ్లెన్ ఫిలిప్ సెంచరీల హీరోలుగా నిలిస్తే..బౌలింగ్ లో మాత్రం చిరుజట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఐర్లాండ్ కు చెందిన బౌలర్లు హ్యాట్రిక్ లతో వారేవ్వా అనిపించుకొన్నారు.

క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన పోరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన లెగ్ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ తొలి హ్యాట్రిక్ నమోదు చేస్తే...సూపర్ -12 రౌండ్లో ఐర్లాండ్ పేస్ బౌలర్ జోషువా లిటిల్ అదే ఘనతను సొంతం చేసుకోడం ద్వారా ప్రస్తుత ప్రపంచకప్ హ్యాట్రిక్ ల సంఖ్యను రెండుకు పెంచాడు.

అడిలైడ్ ఓవల్ లో లిటిల్ షో...

అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రపంచ రన్నరప్ న్యూజిలాండ్ తో జరిగిన నాలుగోరౌండ్ పోరులో ఐర్లాండ్ పేసర్ జోషువా లిటిల్ ఆట 19వ ఓవర్లో మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు సాధించడం ద్వారా హ్యాట్రిక్ వీరుడిగా నిలిచాడు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసే దశలో డెత్ ఓవర్లలో బౌలింగ్ స్పెషలిస్ట్ గా ఆట 19వ ఓవర్లో బౌలింగ్ కు దిగిన లిటిల్ వరుస బంతుల్లో కేన్ విలియమ్స్ సన్, జిమ్మీ నీషమ్, మైకేల్ సాంట్నర్ లను పెవీలియన్ దారి పట్టించాడు.

కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ ..లిటిల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా...నీషమ్, సాంట్నర్ లు వికెట్ల ముందు దొరికిపోయి అవుటయ్యారు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఐర్లాండ్ బౌలర్ గా జోషువా లిటిల్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.

గత ప్రపంచకప్ లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా ఐరిష్ తొలిబౌలర్ గా కర్టిస్ కాంఫెర్ నిలిస్తే...ప్రస్తుత ప్రపంచకప్ ద్వారా కాంఫర్ సరసన జోషువా లిటిల్ నిలిచాడు.

తొలి హ్యాట్రిక్ వీరుడు కార్తీక్...

2022 టీ-20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ గ్రూప్ రెండోరౌండ్లో భాగంగా శ్రీలంకతో జరిగిన పోటీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లెగ్ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్...హ్యాట్రిక్ సాధించడం ద్వారా తొలిబౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

ప్రపంచ మాజీ చాంపియన్ శ్రీలంకపై ఆట 15వ ఓవర్లో బౌలింగ్ కు దిగిన కార్తీక్ 4, 5, 6 బంతుల్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక, 5వ బంతికి భానుక రాజపక్స, 6వ బంతికి చరిత అసలంకలను పెవీలియన్ దారి పట్టించడం ద్వారా హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో ..మూడుబంతుల్లో మూడు వికెట్లు పడగొట్టిన తొలిబౌలర్ గా కార్తీక్ నిలిచాడు.

చెన్నైలో జన్మించి..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న కార్తీక్..తనజట్టు తరపున తొలిహ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ గా రికార్డు సాధించాడు. టెస్టుహోదా పొందిన ఓ జట్టుపై హ్యాట్రిక్ సాధించిన...టెస్టు హోదాలేని ఓ జట్టు బౌలర్ గా కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు.

ప్రపంచకప్ చరిత్రలో 6వ హ్యాట్రిక్...

2007 నుంచి 2021 వరకూ జరిగిన ప్రపంచకప్ టోర్నీలలో కేవలం నాలుగు హ్యాట్రిక్ లు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ జరిగి మ్యాచ్ ల్లో రెండు హ్యాట్రిక్ లు నమోదయ్యాయి.

2007 ప్రారంభ ప్రపంచకప్ లో ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తొలి హ్యాట్రిక్ నమోదు చేస్తే...గత ఏడాది గల్ఫ్ దేశాలు వేదికగా జరిగిన 2021 ప్రపంచకప్ లో మరో మూడు హ్యాట్రిక్ లు నమోదయ్యాయి.

ఐర్లాండ్ బౌలర్ కర్టీస్ కాంఫెయిర్, శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ, సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ..హ్యాట్రిక్ లు సాధించిన బౌలర్లుగా నిలిచారు.

ప్రస్తుత ప్రపంచకప్ లో కార్తీక్ మెయప్పన్ తొలి హ్యాట్రిక్, జోషువా లిటిల్ రెండో హ్యాట్రిక్ నమోదు చేయడం ద్వారా మిగిలిన నలుగురు మేటి బౌలర్ల సరసన చోటు సంపాదించారు.

మరి..మిగిలిన మ్యాచ్ ల్లో మరెన్ని హ్యాట్రిక్ లు నమోదు కాగలవో వేచిచూడాల్సిందే.

First Published:  4 Nov 2022 12:25 PM IST
Next Story