సాకర్ అభిమానిని కాల్చిచంపిన ఇరాన్ మతరక్షక దళాలు!
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లో సాకర్ ముసలం ప్రారంభమయ్యింది
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లో సాకర్ ముసలం ప్రారంభమయ్యింది. ప్రపంచకప్ గ్రూపులీగ్ నుంచి తమజట్టు నిష్క్ర్రమించడంతో ఇరాన్ అభిమానులు సంబరాలు చేసుకొన్న ఘటనలో ఓ అభిమానిని మతరక్షక దళ సభ్యులు కాల్చి చంపారు...
ఖతర్ వేదికగా 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు ఏ క్షణంలో ప్రారంభమయ్యాయో కానీ..తీవ్రఅణిచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలు, సాకర్ అభిమానులు తమ అసంతృప్తిని, నిరసనను తెలపడానికి ఫుట్ బాల్ ను అస్త్రంగా చేసుకొన్నారు. తమ జట్టు ఆడిన ప్రపంచకప్ స్టేడియాలను వేదికలుగా చేసుకొని ప్లకార్డులతో ఇరాన్ అభిమానులు మౌనంగా నిరసన తెలుపుతూ రావడం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ ఓటమితో సంబరాలు..
ప్రపంచకప్ ఫుట్ బాల్ లో తమ జాతీయజట్టు పరాజయం పాలైతే అభిమానులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపడం, ప్రదర్శనల్లో పాల్గొనడం మనకు తెలుసు.
అయితే...దానికి భిన్నంగా ప్రస్తుతం ఇరాన్ లో ప్రజలు, అభిమానులు తమ జట్టు ఓటమితో సంబరాలు జరుపుకొంటూ నిరసన తెలుపుతున్నారు.
ప్రపంచకప్ గ్రూప్- బీ లీగ్ లో భాగంగా అమెరికాతో జరిగిన కీలక పోటీలో ఇరాన్ 1-0తో ఓటమి పొంది..లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. సాధారణంగా అమెరికా అంటే ద్వేషించే ఇరాన్ అభిమానులు...తమ జాతీయజట్టును ఒకే ఒక్కగోలుతో అమెరికానే ఓడించడంతో పట్టలేని ఆనందంతో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు.
తీవ్రఅణచివేత విధానాలు అవలంభిస్తున్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
వీధుల్లోకి వచ్చి మరీ డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఇరాన్ సిటీ కామ్యారన్ లో జనం సంతోషంతో డ్యాన్స్ చేస్తున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.
ప్రజల అభిష్టానికి విరుద్ధంగా..
ఇరాన్ ప్రజల వింత సంబరాల వెనుక ప్రత్యేక కారణమే ఉంది. ఈ సీజన్ లో తమ సాకర్ జట్టు ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనడం ఇరానీయులకు అసలు ఇష్టంలేదట. హిజాబ్ ధరించబోమంటూ అక్కడి మహిళలు సెప్టెంబర్ నుంచి ఇరాన్‌లో ఆందోళనలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆందోళనల్లో వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పాయారు. దేశంలో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతుం.. ఫిఫా వరల్డ్ కప్ కోసం ఇరాన్ జట్టు ఖతార్ వెళ్లడం అవసరమా అన్నది జనం అభిప్రాయం. ప్రజల ఆందోళనలకు మద్దతుగా ఫిఫా వరల్డ్ కప్ పోటీలను బహిష్కరించాలని ఇరాన్ ప్రజలు కోరుకున్నారు. అయితే, ఫుట్ బాల్ జట్టు మాత్రం ఖతార్ వెళ్లి పోటీల్లో పాల్గొని అమెరికా చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో చిర్రెత్తిపోయిన ఇరానీయులు జట్టు ఓడిపోగానే ఇలా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుని తమ నిరసన తెలిపారు.
బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించకుండా తిరుగుతున్న ఓ యువతిని ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కొన్ని రోజులకే కస్టడీలో ఆ యువతి అనుమానాస్పదంగా మృతిచెందడం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమయ్యాయి. ఇరాన్ లో మోరల్ పోలీసింగ్ పై దేశవ్యాప్త ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటి వరకు సుమారు 300 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు.
27 ఏళ్ల అభిమాని కాల్చివేత...
అమెరికాచేతిలో ఓటమి పొందడం ద్వారా తమజట్టు ప్రపంచకప్ లీగ్ దశ నుంచే నిష్క్ర్రమించిందన్న వార్త విన్న ఓ అభిమాని తన కారుపై నిలబడి కేరింతలు కొడుతూ సంబరాలుచేసుకోడంతో మతరక్షక పోలీసు దళం కాల్చి చంపింది.
ఈ సంఘటన కాస్పియన్ సముద్రతీర నగరం బందర్ అంజాలీలో చోటు చేసుకొంది. మెహ్రాన్ సమాక్ అనే 27 సంవత్సరాల యువకుడిని కాల్చి చంపినట్లుగా ఇరాన్ మానవ హక్కుల సంఘానికి ఓ ఫిర్యాదు చేరింది.
ఇరాన్ లో ప్రస్తుతం మతం పేరుతో మానవహక్కుల హననం జరుగుతోందంటూ ప్రపంచ మానవహక్కుల సంఘం మండిపడుతోంది.
ప్రపంచకప్ ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడటానికి ముందు తమ జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఇరాన్ సాకర్ జట్టు సభ్యులు గీతాలాపాన చేయకుండా మౌనంగా ఉండిపోడం ద్వారా తమ నిరసనను తెలుపుతూ వచ్చారు. తమదేశంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంఘీభావంగానే తాము జాతీయగీతాలాపానకు దూరంగా ఉన్నట్లు ఇరాన్ జట్టు కెప్టెన్ సైతం ప్రకటించాడు.
ఇరాన్ మతరక్షక దళాలు ఇప్పటి వరకూ నిరసనలకు దిగిన 448 మందిని వధించాయని, వీరిలో 18 నుంచి 29 సంవత్సరాల లోపు యువతులతో పాటు పిల్లలు సైతం ఉన్నారని మానవహక్కుల సంఘం ప్రకటించింది.
అమెరికా చేతిలో ఇరాన్ జట్టు ఓడి పోయిన రోజు నిర్వహించిన నిరసన ప్రదర్శనల సమయంలో 300 మందిని కాల్చి చంపినట్లు ఓ ఇరానీ పోలీసు అధికారి ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.