ఇరాన్ లో బతకలేమంటూ అభిమానుల నిరసన!
ఇరాన్ లో మహిళలు బతికే పరిస్థితులు లేవంటూ ప్రపంచకప్ ఫుట్ బాల్ వేదికగా అభిమానులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనంగా తమ బాధను వెళ్లగక్కారు.
ఇరాన్ లో మహిళలు బతికే పరిస్థితులు లేవంటూ ప్రపంచకప్ ఫుట్ బాల్ వేదికగా అభిమానులు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనంగా తమ బాధను వెళ్లగక్కారు..
గల్ఫ్ గడ్డ ఖతర్ వేదికగా తొలిసారిగా జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు ఇరాన్ పౌరుల నిరసనకు వేదికగా నిలిచాయి. దోహా వేదికగా జరుగుతున్న 2022ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్- ఇరాన్ జట్ల మధ్య దోహా వేదికగా మ్యాచ్ జరిగిన సమయంలో పలువురు ఇరాన్ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
జాతీయగీతాలాపనకు తిరస్కృతి...
తమదేశంలో మహిళల పై ప్రభుత్వ జులుం పట్ల నిరసనగా ఇరాన్ సాకర్ జట్టు సభ్యులు సైతం తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.తమ ప్రారంభమ్యాచ్ ప్రారంభసమయంలో జాతీయగీతాలాపన చేయకుండా నిరసన తెలిపారు. స్టేడియం స్టాండ్స్ లోని ఇరాన్ అభిమానులు సైతం జాతీయ గీతాన్ని ఆలపించకుండా మౌనంగా ఉండిపోయారు.
మానవహక్కుల హననం..మహిళలపై జులుం..
తమదేశం లో స్వేచ్ఛగా బతికే పరిస్థితే లేదంటూ ఇరాన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహిళలను ప్రభుత్వ పోలీసులు కిరాతకంగా వేధిస్తున్నారంటూ, హిజబ్ నియమాలు పాటించకుండా ఉండేవారిని వధించడానికి వెనుకాడడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ ప్రభుత్వం పలు విధాలుగా కట్టుదిట్టమైన నిబంధనలతో పౌరహక్కులను అత్యంత కఠినంగా అణచివేస్తోందని ఇరాన్ అభిమానులు చెబుతున్నారు. కొద్దిపాటి స్వేచ్ఛను ప్రదర్శించే పౌరులు, మహిళలను ఇస్లాం మతపోలీసు దళాలు భయపెడుతున్నాయని, వారిపట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని, ఇప్పటికే కొన్నివందల మంది మహిళలను వధించినట్లుగా వార్తలు వచ్చాయి.
గత సెప్టెంబర్లో టెహ్రాన్ కు చెందిన 22 సంవత్సరాల యువతి మాషా అమీనీ..హిజాబ్ నిబంధనలను తూచ తప్పక పాటించలేదంటూ మతపోలీసుల దళం అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టి చంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మానవహక్కుల సంఘాల అంచనా ప్రకారం ..నిరసనకారుల్లో 378 మందిని మట్టుబెట్టడంతో పాటు 14వేల మందిని అదుపులోకి తీసుకొన్నట్లు ఐక్యరాజ్య సమతికి ఫిర్యాదు చేరింది.
ఇరాన్ సాకర్ కెప్టెన్ విచారం...
ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలలో పాల్గొనటానికి వచ్చిన ఇరాన్ సాకర్ జట్టు కెప్టెన్ ఎహ్ సాన్ హజ్ సఫీ తనవంతుగా నిరసన తెలిపాడు. తమ దేశంలో హింసను ఎదుర్కొంటున్న కుటుంబాలు, వ్యక్తులకు తాము అండగా ఉంటామని, తమజట్టు సభ్యులు సంఘీభావం తెలుపుతున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించాడు.
ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు చెప్పాడు. పోటీ ప్రారంభానికి ముందు జరిగిన జాతీయ గీతాలాపాన కార్యక్రమంలో మౌనంగా నిలబడడం ద్వారా తమ ఆవేదనను తెలియచెప్పాడు.
మరోవైపు..ప్రపంచకప్ ఫుట్ బాల్ మ్యాచ్ లు జరిగే సమయంలో ఆటగాళ్లు, జట్లు కేవలం ఆటకే పరిమితం కావాలని, నిరసన తెలిపే ఎలాంటి చర్యలు తీసుకొన్నా కఠినచర్యలు తీసుకొంటామని ఫిఫా ప్రకటించింది.
ఎల్లో కార్టు ఇవ్వాలంటూ ఆదేశం...
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆర్మ్ బ్యాండ్లు ధరించినా..ఆయాజట్ల ఆటగాళ్లు, కెప్టెన్లకు ఎల్లోకార్డు శిక్ష విధించాలంటూ రిఫరీలను ఫిఫా అధికారికంగా ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ లు, స్టేడియాలు నిరసనలకు, రాజకీయాలకు వేదికలు కావని స్పష్టం చేసింది. రెండుసార్లు ఎల్లోకార్డు శిక్ష పడిన ఆటగాడు తదుపరి రౌండ్ మ్యాచ్ కు దూరమయ్యే ప్రమాదం ఉండడంతో..ఆర్మ్, రిష్ట్ బ్యాండ్లు ధరించడం ద్వారా నిరసన తెలపాలన్న క్రీడాకారుల వ్యూహం బెడిసికొట్టినట్లయ్యింది.