దుబాయ్ వేదికగా ఐపీఎల్- 2024 సీజన్ వేలం!
వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్-17 సీజన్ వేలాన్ని దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. వేలం మొత్తాన్ని సైతం 100 కోట్లకు పెంచారు.
వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్-17 సీజన్ వేలాన్ని దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. వేలం మొత్తాన్ని సైతం 100 కోట్లకు పెంచారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 17వ సీజన్ వేలం కార్యక్రమాన్ని దుబాయ్ వేదికగా నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహక మండలి నిర్ణయించింది.
తొలిసారిగా విదేశీగడ్డపై....
గత 16 సీజన్లుగా భారత్ వేదికగానే ఐపీఎల్ వేలం కార్యక్రమం నిర్వహించిన బీసీసీఐ..వచ్చే సీజన్ ( 2024 ) వేలాన్ని మాత్రం తొలిసారిగా దేశం వెలుపల నిర్వహించాలని నిర్ణయించింది.
డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ వేలం కార్యక్రమం నిర్వహించడానికి ఐపీఎల్ నిర్వాహక మండలి నిర్ణయించింది. వివిధ ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను కొనసాగిస్తూ..వద్దనుకొన్న ఆటగాళ్లను వదులుకోడానికి నవంబర్ 26ను గడువుగా నిర్ణయించారు.
ఐపీఎల్ వేలం నిర్వహించడానికి వేదిక అందుబాటులో లేకుండా పోయిందని, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో వేదికలు అందుబాటులో లేకపోడంతోనే దుబాయ్ వేదికగా నిర్వహించనున్నట్లు ఐపీఎల్ బోర్డు వివరణ ఇచ్చింది.
100 కోట్లకు పెరిగిన వేలం మొత్తం...
గత సీజన్ వరకూ ఐపీఎల్ వేలం కోసం 95 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తూ వచ్చిన బోర్డు..17వ సీజన్ నుంచి ఆ మొత్తాన్ని 100 కోట్ల రూపాయలకు పెంచింది.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్ ను లక్నో నుంచి ముంబై దక్కించుకొంది.
గత సీజన్లో కేవలం 50 లక్షల రూపాయల ధరకే లక్నో ఫ్రాంచైజీకి ఆడిన రొమారియో షెఫర్డ్ ను ముంబై మరింత ఎక్కువ ధరకు ఖాయం చేసుకొంది.
ఐపీఎల్ 2022 సీజన్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ రొమారియో షెఫర్డ్ ను 7 కోట్ల 75 లక్షల రూపాయల రికార్డు ధరకు వేలం ద్వారా దక్కించుకొంది. అయితే ..సన్ రైజర్స్ తరపున రొమారియోకు కేవలం మూడుమ్యాచ్ లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది.
దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ 17వ సీజన్ వేలం కార్యక్రమంలో మొత్తం 10 ఫ్రాంచైజీల ప్రతినిధి బృందాలు పాల్గోనున్నాయి. వన్డే ప్రపంచకప్ లో రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లకు వచ్చే ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికే అవకాశం ఉంది.