Telugu Global
Sports

అనారోగ్యాన్ని జయించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా.....!

ఐపీఎల్ లో షోమాస్టర్లు మాత్రమే కాదు...ఆస్పత్రి బెడ్ మీద నుంచి ఫీల్డ్ లోకి వచ్చి హీరోలుగా నిలిచే ఆటగాళ్లు సైతం ఉంటారనడానికి నిదర్శనమే రాజస్థాన్ రాయల్స్ యువసంచలనం రియాన్ పరాగ్.

అనారోగ్యాన్ని జయించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా.....!
X

ఐపీఎల్ లో షోమాస్టర్లు మాత్రమే కాదు...ఆస్పత్రి బెడ్ మీద నుంచి ఫీల్డ్ లోకి వచ్చి హీరోలుగా నిలిచే ఆటగాళ్లు సైతం ఉంటారనడానికి నిదర్శనమే రాజస్థాన్ రాయల్స్ యువసంచలనం రియాన్ పరాగ్.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తురుపుముక్క, మిడిలార్డర్లో కీలక బ్యాటర్ రియాన్ పరాగ్ సత్తా చాటుకొన్నాడు. తీవ్రఅనారోగ్యంతో గత కొద్దిరోజులగా ఆస్పత్రి మంచానికే పరిమితమైన 22 ఏళ్ల రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రెండోరౌండ్ మ్యాచ్ లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం ద్వారా సంచలనం సృష్టించాడు.

అసోం నుంచి భారత దేశవాళీ క్రికెట్లోకి దూసుకొచ్చిన రియాన్ కు అండర్ -19 ప్రపంచకప్ లో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించిన రికార్డు సైతం ఉంది.

దేశవాళీ క్రికెట్లో అసోం జట్టు తరపున రాణించడం ద్వారా జైపూర్ ఫ్రాంచైజీ దృష్టిలో పడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాడిగా మారాడు.

45 బంతుల్లో 84 పరుగుల నాటౌట్....

2023-24 సీజన్ దేశవాళీ క్రికెట్ టోర్నీలలో వరుసగా హాఫ్ సెంచరీలు బాదుతూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన రియాన్ ఐపీఎల్- 17వ సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే తీవ్రఅస్వస్థతకు గురయ్యాడు. లేవలేని పరిస్థితిలో ఆస్పత్రి బెడ్ కే పరిమిత మయ్యాడు.

మాజీ చాంపియన్ రాయల్స్ తన తొలిమ్యాచ్ ఆడటానికి మూడురోజుల ముందే రియాన్ నెట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. నీరసం, నిసత్తువతోనే తన సాధన కొనసాగించాడు.

లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన ప్రారంభమ్యాచ్ లో పరవాలేదని పించిన రియాన్..ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రెండోరౌండ్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

తనజట్టు 30 పరుగులకే మూడు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన రియాన్ ఎనలేని ఓర్పుతో ఆడి 84 పరుగుల స్కోరుతో అజేయంగా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగుల స్కోరు సాధించగలిగింది.

రియాన్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను అధిగమించడం ద్వారా వరుసగా రెండో విజయం నమోదు చేయగలిగింది.

గత మూడురోజులుగా ఫిట్ నెస్ కోసం తాను తీవ్రంగా శ్రమించానని, ఆస్పత్రి మంచమీద ఉన్న సమయంలో తన తల్లి ఎంతగానో కష్టపడిందని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

అందుకొంటూ రియాన్ పట్టలేని భావోద్వేగానికి గురయ్యాడు. రెండోడౌన్ బ్యాటర్ గా ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కు రియాన్ వెన్నెముకగా నిలిచాడు.

వరుస హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు!

2023 సీజన్ భారత దేశవాళీ టీ-20 క్రికెట్లో రియాన్ పరాగ్ వరుసగా 7 హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

భారత దేశవాళీ టీ-20 క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే సయ్యద్ ముస్తాక్ అలీ -2023 టోర్నీలో భాగంగా ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్ వేదికగా కేరళ- అసోంజట్ల నడుమ జరిగిన లీగ్ పోరులో అరుదైన ప్రపంచ రికార్డు వచ్చి చేరింది.

అసోం యువబ్యాటర్ రియాన్ పరాగ్ 33 బంతుల్లోనే 57 పరుగుల అజేయ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా...టీ-20 ఫార్మాట్లో వరుసగా ఆరుమ్యాచ్ ల్లో అరడజను అర్థశతకాలు బాదిన భారత తొలిబ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతూ వస్తున్న రియాన్ పరాగ్ కు..భారతజట్టులో సభ్యుడిగా అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న అనుభవంసైతం ఉంది.

7 మ్యాచ్ ల్లో 440 పరుగులు..

2023- టీ-20 సీజన్ ను రియాన్ పరాగ్ జోరుగా మొదలు పెట్టాడు. అసోం జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్న రియాన్ స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ తన జట్టు విజయాలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడు.

గ్రూప్ లీగ్ దశలో రియాన్ పరాగ్ ఆడిన ఏడుమ్యాచ్ ల్లో ఏకంగా 440 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. గత ఆరుమ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీలతో అరుదైన ఘనత సాధించాడు. కేరళతో హోరాహోరీగా సాగిన పోరులో అసోం 2 వికెట్ల విజయం సాధించడంలో రియాన్ కీలక పాత్ర వహించాడు.

ఒడిషాతో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ లో 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించిన రియాన్..ఆ తర్వాతి ఆరు మ్యాచ్ ల్లోనూ మరి వెనుదిరిగి చూసింది లేదు.

బీహార్ పై 34 బంతుల్లో 61 పరుగులు, సర్వీసెస్ పై 37 బంతుల్లో 76 పరుగుల నాటౌట్ స్కోరు సాధించిన రియాన్..సిక్కింపైన 29 బంతుల్లో 53 నాటౌట్, చండీగఢ్ పైన 39 బంతుల్లో 76 పరుగులు, హిమాచల్ ప్రదేశ్ పైన 37 బంతుల్లో 72 పరుగుల స్కోర్లునమోదు చేశాడు. ఇక..పవర్ ఫుల్ కేరళతో జరిగిన కీలక మ్యాచ్ లో రియాన్ 33 బంతుల్లోనే 57 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

దిగ్గజాలను మించిన రియాన్..

టీ-20 క్రికెట్ ఓ టోర్నమెంట్ లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో గతంలో ఏడుగురుక్రికెటర్లు నెలకొల్పిన రికార్డును రియాన్ పరాగ్ అధిగమించాడు.

2012 ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. జింబాబ్వే బ్యాటర్ హామిల్టన్ మసకడ్జ 2012 సీజన్లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదితే..పాక్ క్రికెటర్ కమ్రన్ అక్మల్ 2017లో లాహోర్ వైట్స్ తరపున 5 హాఫ్ సెంచరీలు సాధించాడు.

2018 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, 2019 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, 2021 సీజన్లో న్యూజిలాండ్ కు చెందిన స్టార్ హిట్టర్ డేవన్ కాన్వే , 2023 సీజన్లో డెర్బీషైర్ ఆటగాడు వెయిన్ మాడ్సెన్ వరుసగా ఐదేసి హాఫ్ సెంచరీలతో దక్కించుకొన్న ఘనతను రియాన్ పరాగ్ ఆరు వరుస హాఫ్ సెంచరీలతో తెరమరుగు చేయగలిగాడు. 7వ హాఫ్ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్ లో జైపూర్ ఫ్రాంచైజీకి ఆడుతున్న రియాన్ పరాగ్ సీజన్ కు 3 కోట్ల 80 లక్షల రూపాయలు వేతనంగా అందుకొంటున్నాడు.

First Published:  29 March 2024 9:02 AM GMT
Next Story