Telugu Global
Sports

ఐపీఎల్ లో కుర్రాళ్ళోయ్..కుర్రాళ్ళు!

ఐపీఎల్ తో భారత క్రికెట్ కు ఎంతో మేలు జరుగుతోంది. ప్రతిభావంతులైన పలువురు యువఆటగాళ్లు ఐపీఎల్ ను వేదికగా చేసుకొని వెలుగులోకి వస్తున్నారు.

ఐపీఎల్ లో కుర్రాళ్ళోయ్..కుర్రాళ్ళు!
X

ఐపీఎల్ తో భారత క్రికెట్ కు ఎంతో మేలు జరుగుతోంది. ప్రతిభావంతులైన పలువురు యువఆటగాళ్లు ఐపీఎల్ ను వేదికగా చేసుకొని వెలుగులోకి వస్తున్నారు. రేపటితరం సూపర్ స్టార్లు తామేనంటూ చెప్పకనే చెబుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో భారత క్రికెట్ ముఖచిత్రమే మారిపోయింది. దేశ, విదేశాలకు చెందిన ప్రతిభావంతులైన ఎందరో యువక్రికెటర్లు తమ సత్తాను చాటుకోడానికి వేదికగా నిలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ ద్వారా పలువురు కత్తిలాంటి కుర్రోళ్ళు తమ ప్రతిభను నిరూపించుకోడం ద్వారా భారతజట్టు తలుపులు తడుతున్నారు. వచ్చే వన్డే, టీ-20 ప్రపంచకప్ జట్లలో చోటు కోసం సీనియర్ స్టార్లకు గట్టి సవాలు విసురుతున్నారు.

విరాట్, రోహిత్ కు తగిన వారసులు...

భారత క్రికెట్ అంటే విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి సూపర్ స్టార్ ఆటగాళ్లు మాత్రమే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. విరాట్, రోహిత్ రిటైర్మెంట్ కు సిద్ధంకాక మనుపే తామున్నామంటూ అరడజనుకు పైగా యువక్రికెటర్లు ప్రస్తుత ఐపీఎల్ ద్వారా తెరమీదకు వచ్చారు.

వచ్చే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు ఓపెనర్ల స్థానాలు ప్రస్తుత ఐపీఎల్ తోనే దాదాపుగా భర్తీ అయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్, 21 సంవత్సరాల యశస్వి జైశ్వాల్, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ , 23 ఏళ్ల శుభ్ మన్ గిల్ ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లీగ్ దశలో విశ్వరూపమే ప్రదర్శించారు.

వండర్ యశస్వి- థండర్ శుభ్ మన్...

ఐపీఎల్ మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రపంచ మేటి ఓపెనర్ జోస్ బట్లర్ తో సహఓపెనర్ గా ఆడుతున్న యశస్వి జైశ్వాల్ లీగ్ దశ 14 మ్యాచ్ ల్లో ఓ శతకం, 5 అర్థశతకాలతో పాటు 625 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 16 సీజన్ల చరిత్రలోనే 600కు పైగా పరుగులు సాధించిన తొలి అన్ క్యాప్డ్‌ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

ఇప్పటికే భారత అండర్ -19 జట్టుకు ఆడిన యశస్వి సీనియర్ జట్టులో చేరటానికి ఎంతో సమయం పట్టదని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. రోహిత్ శర్మకు తగిన వారసుడు యశస్వినే అంటూ కితాబిస్తున్నారు.

పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ రిటైర్ కావటానికి ముందే..కొహ్లీకి తగిన వారసుడు తానేనంటూ శుభ్ మన్ గిల్ తన ఆటతీరుతో చాటుకొన్నాడు. కేవలం 23 సంవత్సరాల చిరుప్రాయంలోనే టెస్టు, వన్డే, టీ-20లతో పాటు ఐపీఎల్ లో సైతం సెంచరీలు సాధించడం ద్వారా శుభ్ మన్ రేపటితరం సూపర్ స్టార్ గా ప్రశంసలు అందుకొంటున్నాడు.

ఐపీఎల్ చివరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో శతకాలు బాదడం ద్వారా శుభ్ మన్..భారతజట్లలో తన స్థానం మరింత పటిష్టం చేసుకోగలిగాడు. మొత్తం 14 మ్యాచ్ ల్లో శుభ్ మన్ 4 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలతో సహా 680 పరుగులతో 56. 66 సగటు నమోదు చేశాడు.


మిడిలార్డర్ మొనగాళ్లు...

టీ-20 లేదా వన్డే క్రికెట్లో నమ్మదగిన తమ ఆటతీరుతో మ్యాచ్ ను ముగించే సత్తా ఉన్న బ్యాటర్ల కోసం ఎదురుచూస్తున్న భారత క్రికెట్ కు ప్రస్తుత ఐపీఎల్ ద్వారా

ఆణిముత్యాల లాంటి ఇద్దరు యువక్రికెటర్లు దొరికారు.

ముంబై ఇండియన్స్ తరపున పలు కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ, కోల్ కతా నైట్ రైడర్స్ కు వంటిచేత్తో కళ్లు చెదిరే విజయాలు అందించిన రింకూ సింగ్ తమ ఆటతీరుతో క్రికెట్ పండితుల మనసు దోచుకొన్నారు.

హైదరాబాద్ నుంచి ఐపీఎల్ లో ముంబైకి ఆడుతున్న తిలక్ వర్మ ఎనలేని పరిణతితో ఆడుతూ వారేవ్వా అనిపించుకొన్నాడు. పరిస్థితికి తగ్గట్టుగా ఆడుతూ ముంబై మిడిలార్డర్ కే కీలకంగా నిలిచాడు.



కోల్ కతా డైనమైట్ రింకూ సింగ్....

రాజస్థాన్ రాయల్స్ తో ముగిసిన ఓ మ్యాచ్ లో కేవలం 23 బంతుల్లోనే 6 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 42 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచిన రింకూ సింగ్..ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్‌పై రింకూ సింగ్‌ సునామీ బ్యాటింగ్ చేశాడు. పేసర్ య‌శ్ ద‌యాల్ వేసిన‌ ఆఖ‌రి ఓవ‌ర్లో ఐదు బంతుల‌కు ఐదు సిక్స్‌లు బాదాడు. 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం రింకూ బ్యాటింగ్ తోనే ఓట‌మి అంచుల నుంచి కోల్ కతా బయటపడి వికెట్ తేడాతో అనూహ్యం విజ‌యం సొంతం చేసుకోగలిగింది.

రింకూ సింగ్ ప్రస్తుత సీజన్లో ఆడిన ఏడుమ్యాచ్ ల్లో 4 హాఫ్ సెంచరీలతో 305 పరుగులతో 152. 50 సగటు నమోదు చేశాడు. 20 ఫోర్లు, 22 సిక్సర్లు బాదటం ద్వారా రింకూ తన బ్యాట్ పవర్ ఏంటో చాటి చెప్పాడు.



ముంబై పేస్ సంచలనం ఆకాశ్ మథ్వాల్..

లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఎలిమినేటర్ రౌండ్లో ముంబై యువపేసర్ ఆకాశ్ మద్వాల్ కేవలం 5 పరుగులకే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. లీగ్ దశ ఆఖరి మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ ఆ తర్వాతి నాకౌట్ రౌండ్ మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ముంబైని క్వాలిఫైయర్ -2 రౌండ్ కు చేర్చగలిగాడు.

లక్నో సూపర్ జెయింట్స్ లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్, ముంబై యువఫాస్ట్ బౌలర్ ఆకాశ్ మద్వాల్ సైతం భారత సీనియర్ జట్టులో చోటుకు తాము అర్హులమేనని తెలియచెప్పారు.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్ లాంటి పలువురు నవతరం ఆటగాళ్లతో టీ-20 ప్రపంచకప్ వేటకు దిగటం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రతిభావంతులైన యువక్రికెటర్లకు ఆర్థికంగా, కెరియర్ పరంగా ఎంతోమేలు చేస్తున్న ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ సైతం ఎందరో ప్రతిభావంతులైన ఆటగాళ్లను అక్కున చేర్చుకోగలుగుతోంది.

సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్ ,రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ తమ వారసులను చూస్తూ సంతృప్తిగా రిటైర్మెంట్ తీసుకొనే రోజు ఎంతో దూరంలో లేదు.




First Published:  25 May 2023 1:20 PM IST
Next Story