ఐపీఎల్ సెంచరీల' కింగ్ ' విరాట్ కొహ్లీ!
భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ ఐపీఎల్ లో సైతం పరుగుల హోరు, రికార్డుల జోరుతో అదరగొట్టాడు. 7వ సెంచరీతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ ఐపీఎల్ లో సైతం పరుగుల హోరు, రికార్డుల జోరుతో అదరగొట్టాడు. 7వ సెంచరీతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు...
ఐపీఎల్ -16వ సీజన్లో విరాట్ కొహ్లీ పరిస్థితి ..వ్రతం చెడినా ఫలితం దక్కిందన్నట్లుగా తయారయ్యింది. తన జట్టును ప్లే-ఆఫ్ రౌండ్ చేర్చడంలో విఫలమైనా..వ్యక్తిగతంగా మాత్రం బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఐపీఎల్ శతక సామ్రాట్ గా నిలిచాడు.
హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో విరాట్ 101 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు.
టైటాన్స్ పవర్ ఫుల్ బౌలింగ్ ఎటాక్ ను అలవోకగా ఎదుర్కొన్న విరాట్ 61 బంతుల్లో 13 బౌండ్రీలు, ఒ సిక్సర్ తో 101 పరుగులు చేయటంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగలిగింది.
క్రిస్ గేల్ ను మించిన విరాట్ కొహ్లీ..
ఐపీఎల్ గత 15 సీజన్లుగా క్రిస్ గేల్ పేరుతో ఉన్న అత్యధిక సెంచరీల( 6 ) రికార్డును విరాట్ ప్రస్తుత 16వ సీజన్లో అధిగమించగలిగాడు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో ముగిసిన 13వ రౌండ్ పోరులో తన 6వ శతకం సాధించడం ద్వారా...క్రిస్ గేల్ సరసన నిలిచాడు.
ఆ తర్వాత..రెండురోజుల విరామంలోనే బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరిరౌండ్ మ్యాచ్ లో సైతం విరాట్ 7వ సెంచరీ సాధించడం ద్వారా ఐపీఎల్ సెంచరీల కింగ్ గా నిలిచాడు.
2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 16వ సీజన్ ఐపీఎల్ వరకూ 237 మ్యాచ్ లు ఆడిన విరాట్ కొహ్లీ మొత్తం 7 శతకాలతో నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు.
ఐపీఎల్ లో తన చివరి సెంచరీని 2019 సీజన్లో సాధించిన విరాట్..ఆ తర్వాతి శతకం కోసం నాలుగేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
2016 సీజన్లోనే అత్యధికంగా నాలుగు సెంచరీలు సాధించిన విరాట్ ..ఆ తర్వాత మూడేళ్లకు 2019 సీజన్లో 5వ శతకం బాదాడు. ప్రస్తుత సీజన్ 13వ రౌండ్ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు సాధించడం ద్వారా తన 6వ శతకాన్ని నమోదు చేశాడు.
గతంలోనే క్రిస్ గేల్ పేరుతో ఉన్న ఆరు సెంచరీల రికార్డును ఈ సెంచరీతో విరాట్ కొహ్లీ సమం చేయగలిగాడు.
ఐపీఎల్ మొత్తం 16 సీజన్లలో విరాట్ కొహ్లీ ఒక్కడే ఆరు వేర్వేరు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన బ్యాటర్ ఘనతను సొంతంచేసుకొన్నాడు.
ప్రస్తుత 16వ సీజన్ లీగ్ లో బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఆడిన 14వ రౌండ్ మ్యాచ్ వరకూ విరాట్ 639 పరుగులు సాధించాడు.
రెండోస్థానంలో కరీబియన్ సునామీ..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన ఆల్ టైమ్ గ్రేట్ బ్యాటర్ల వరుసలో కరీబియన్ థండర్ క్రిస్ గేల్ 6 శతకాలతో రెండోస్థానంలో ఉన్నాడు. గేల్ కేవలం 142 మ్యాచ్ ల్లోనే ఆరుశతకాలు బాదేయటం విశేషం.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 5 సెంచరీలతో మూడు, డేవిడ్ వార్నర్, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్ నాలుగేసి సెంచరీలతో నాలుగు, ఏబీ డివిలియర్స్, సంజు శాంసన్ చెరో మూడు శతకాలతో ఐదు, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శుభ్ మన్ గిల్ తలో రెండు సెంచరీలతో ఆరు స్థానాలలో కొనసాగుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ సెంచరీల రికార్డు...
ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుశతకాలు బాదిన బ్యాటర్లలో మూడోవాడిగా విరాట్ కొహ్లీ నిలిచాడు. హైదరాబాద్, బెంగళూరు వేదికలుగా జరిగిన 13, 14వ రౌండ్ మ్యాచ్ ల్లో విరాట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించడం ద్వారా గతంలోనే ఇదే ఘనత సాధించిన శిఖర్ ధావన్ ( 2020, డీసీ ), జోస్ బట్లర్ ( 2022- రాజస్థాన్ రాయల్స్ ) సరసన నిలిచాడు.
యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ సైతం..వరుసగా రెండు శతకాలు సాధించిన నాలుగో బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.
వెయ్యి మ్యాచ్ ల్లో నాలుగుసార్లే...
ఒకే మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేయటం గత 16 సంవత్సరాలలో నాలుగుసార్లు మాత్రమే చోటు చేసుకొంది. 2016 సీజన్లో బెంగళూరు వేదికగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు బ్యాటర్లు విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్ సెంచరీలు బాదారు. ఆ తర్వాత 2019 సీజన్లో హైదరాబాద్ వేదికగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో శతకాలు సాధించారు.
ప్రస్తుత 2023 సీజన్లో మాత్రం రెండుమ్యాచ్ ల్లో ఇద్దరేసి బ్యాటర్లు శతకాలు నమోదు చేయటం విశేషం. హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ముగిసిన పోరులో సన్ రైజర్స్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్, బెంగళూరు ఆటగాడు విరాట్ కొహ్లీ చెరో శతకం బాదారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన ప్రస్తుత సీజన్ లీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ తరపున విరాట్ కొహ్లీ, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సెంచరీలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించారు.
70 మ్యాచ్ ల్లో 11 శతకాలు...
గతంలో ఎన్నడూలేని విధంగా ప్రస్తుత సీజన్ లీగ్ మొత్తం 70 మ్యాచ్ ల్లో అత్యధికంగా 11 శతకాలు నమోదయ్యాయి. హైదరాబాద్ సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు రెండేసి సెంచరీలు సాధిస్తే..కోల్ కతా నైట్ రైడర్స్,పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు ఒక్కో శతకం నమోదు చేయగలిగారు.
గత 8 వారాలుగా సాగిన 70 మ్యాచ్ ల లీగ్ సమరంలో తొలిశతకం బాదిన బ్యాటర్ ఘనతను హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ సొంతం చేసుకొన్నాడు.
సెంచరీలు బాదిన ఇతర బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైశ్వాల్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, హెన్రిచ్ క్లాసెన్, విరాట్ కొహ్లీ ( 2 ), కమెరూన్ గ్రీన్, శుభ్ మన్ గిల్ ( 2 ) ఉన్నారు.