ఐపీఎల్ విజేతకు 20 కోట్లు!
20 crores for IPL winner: ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్- 16వ సీజన్ తుది సమరంలో విజేతగా నిలిచిన జట్టు కోసం భారీమొత్తంలో ప్రైజ్ మనీ ఎదురు చూస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్- 16వ సీజన్ తుది సమరంలో విజేతగా నిలిచిన జట్టు కోసం భారీమొత్తంలో ప్రైజ్ మనీ ఎదురు చూస్తోంది.
ఐపీఎల్-16వ సీజన్ ఆఖరాటకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. ఈరోజు జరిగే టైటిల్ పోరులో గతేడాది విజేత గుజరాత్ టైటాన్స్ తో నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్ ఢీ కొనబోతోంది.
హాటుకేకుల్లా లక్షల టికెట్లు...
ఐపీఎల్ ఫైనల్స్ కు వరుసగా రెండో ఏడాది ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ స్టేడియానికి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా పేరుంది. లక్షా 13వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో ఈరోజు జరిగే టైటిల్ పోరుకు అభిమానులు భారీసంఖ్యలో తరలి రావడం ఖాయమైపోయింది. మొత్తం టికెట్లన్నీ హాటుకేకుల్లా అమ్ముడు కావడంతో నరేంద్ర మోడీ స్టేడియం లక్షమంది అభిమానులతో కిటకిటలాడనుంది.
ఫైనల్లోనూ ఆ రెండుజట్లే...
మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ ల లీగ్ దశలో అత్యధిక పాయింట్లతో మొదటి రెండుస్థానాలలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లే..టైటిల్ సమరంలో సైతం తలపడనున్నాయి.
మొత్తం 14 రౌండ్ల లీగ్ లో గుజరాత్ టైటాన్స్ అత్యధికంగా 10 విజయాలు, 20 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 17 పాయింట్లతో రెండో అత్యుత్తమజట్టుగా ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరుకోగలిగింది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన క్వాలిఫైయర్ -1లో గుజరాత్ టైటాన్స్ ను చెన్నై 15 పరుగులతో అధిగమించడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సాధిస్తే...హోంగ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో క్వాలిఫైయర్ లో ముంబై ఇండియన్స్ ను 65 పరుగులతో చిత్తు చేయడం ద్వారా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.
విజేతకు భారీ ప్రైజ్ మనీ... ఈరోజు జరిగే టైటిల్ సమరంలో నెగ్గినజట్టుకు ట్రోఫీతో పాటు..20 కోట్ల రూపాయల ప్ర్రైజ్ మనీ అందచేయనున్నారు. ఫైనల్లో ఓడిన జట్టు మాత్రం 13 కోట్ల రూపాయల ప్ర్రైజ్ మనీతో సరిపెట్టుకోవాల్సి ఉంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్ల కోసమూ ఫ్రైజ్ మనీ సిద్ధంగా ఉంది. అత్యుత్తమ బ్యాటర్ కు ఆరెంజ్ క్యాప్ తో పాటు 15 లక్షల రూపాయలు, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ తో పాటు 15 లక్షల రూపాయలు అందచేయనున్నారు.
శుభ్ మన్ గిల్ కే ఆరెంజ్ క్యాప్...
అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ అవార్డులు రెండూ గుజరాత్ టైటాన్స్ కు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్వాలిఫైయర్ -2వ మ్యాచ్ వరకూ ఆడిన మొత్తం 16 మ్యాచ్ ల్లో గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ 3 శతకాలు, 4 అర్థశతకాలతో సహా 900 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ ఖాయం చేసుకొన్నాడు. బౌలింగ్ లో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 28 వికెట్లతో టాపర్ గా నిలిచాడు. 16 మ్యాచ్ ల్లో 28 వికెట్లు పడగొట్టడం ద్వారా...పర్పుల్ క్యాప్ ముంగిట నిలిచాడు.
ఫైనల్లో గిల్, షమీ ఆడనున్న కారణంగా ఈ ఇద్దరికే అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ అవార్డులు దక్కడం తథ్యమనిపిస్తోంది.
ముంబై పాంచ్ పటాకా...
ఐపీఎల్ గత 15 సీజన్లలో అత్యధికంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గినజట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు ( 2013, 2015, 2017, 2019, 2020 ) విజేతగా నిలిచింది.
ఆ తర్వాతి స్థానంలో చెన్నై ( 2010, 2011, 2018, 2021 ) నాలుగు టైటిల్స్ తో రెండో అత్యంత విజయవంతమైన జట్టుగా రికార్డుల్లో చేరింది. ఈరోజు జరిగే ఫైనల్లో చెన్నై నెగ్గితే..ఐదో టైటిల్ తో ముంబై రికార్డును సమం చేయనుంది.
గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014 సీజన్లలోనూ, 2008లో రాజస్థాన్ రాయల్స్, 2009లో హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్, 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్ చాంపియన్లు కాగలిగాయి.
గత సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ...తొలి ప్రయత్నంలోనే ట్రోఫీ నెగ్గి సంచలనం సృష్టించింది. వరుసగా రెండో ఏడాది ఫైనల్స్ చేరడం ద్వారా బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ కు గురి పెట్టింది.
ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలలో విజేతజట్లకు ఇచ్చే ప్రైజ్ మనీ కంటే..ఐపీఎల్ లో చాంపియన్ జట్లకు ఇస్తున్న ప్రైజ్ మనీనే ఎక్కువ కావడం విశేషం.