Telugu Global
Sports

సరికొత్తహంగులతో ఐపీఎల్ - 2023!

ఐపీఎల్ 16వ సీజన్ పోటీలకు సరికొత్త హంగులతో తెరలేవనుంది. గత 15 సీజన్లుగా లేని పలు సరికొత్త నిబంధనలతో ప్రసుత 16వ సీజన్ పోటీలలో మరింత ఉత్కంఠను నింపనున్నారు.

సరికొత్తహంగులతో ఐపీఎల్ - 2023!
X

ఐపీఎల్ 16వ సీజన్ పోటీలకు సరికొత్త హంగులతో తెరలేవనుంది. గత 15 సీజన్లుగా లేని పలు సరికొత్త నిబంధనలతో ప్రసుత 16వ సీజన్ పోటీలలో మరింత ఉత్కంఠను నింపనున్నారు.....

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తున్న ఐపీఎల్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ, పండుగలాంటి ఓ సంబరం. 2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి గత ఏడాది ముగిసిన 15వ సీజన్ పోటీల వరకూ పలురకాల మార్పులు చేర్పులతో సాగిన ఈ పోటీలకు ప్రస్తుత 16వ సీజన్ నుంచి సరికొత్త నిబంధనలతో సస్పెన్స్ మోతాదును పెంచారు.

ర‌ష్మిక‌, త‌మ‌న్నల ఆట...అర్జిత్ సింగ్ పాటతో....

గత మూడేళ్లుగా వెంటాడిన కోవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో..ప్రస్తుత సీజన్ నుంచి గతంలో మాదిరిగా దేశంలోని పలు వేదికల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. లీగ్ దశలో భాగంగా మొత్తం 10 జట్లు..ఇంటా..బయటా ఫార్మాట్లో 70 మ్యాచ్ లు ఆడనున్నాయి. క్వాలిఫైయర్, ఎలిమినేటర్, టైటిల్ ఫైట్ తో కలుపుకొని నాకౌట్ దశలో మూడుమ్యాచ్ లు జరుగనున్నాయి.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ప్రస్తుత సీజన్ ప్రారంభ వేడుకల్లో ర‌ష్మిక మందన, తమన్నా తమ నృత్యాలతోనూ.. విఖ్యాత గాయకుడు అర్జిత్ సింగ్ త‌న గానంతోనూ అలరించనున్నారు.



ప్రారంభవేడుకల్లో బీసీసీఐ అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్ని, కార్య‌ద‌ర్శి జై షాతో పాటు ప‌లువురు ప్రముఖులు, సెలబ్రిటీలు, అధికారులు హాజరుకానున్నారు. ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పదిజట్ల కెప్టెన్లు పాల్గొంటారు.


కొత్త నిబంధనలతో సరికొత్త మజా! తమ ఆటతీరుతో ఆట స్వరూపాన్ని కొద్ది బంతుల్లోనే మార్చివేయగల ప్రభావశీలక ( ఇంపాక్ట్ ప్లేయర్ల) నిబంధనను తొలిసారిగా అమలు చేయనున్నారు. ముందుగా బ్యాటింగ్‌ కు దిగిన జట్టు.. మొదటి 11 మందిలో ఓ ఆటగాడిని తప్పించి అదనపు బ్యాటర్ ను..అలాగే ఫీల్డింగ్‌కు దిగిన జట్టు ఓ అదనపు బౌలర్‌ ను తీసుకొనే వెసలు బాటును ఈ సరికొత్త నిబంధనతో కల్పించారు. కెప్టెన్ మినహా జట్టులోని ఏ ఆటగాడి స్థానంలోనైనా ఇంపాక్ట్ ప్లేయర్ ను చేర్చుకోవచ్చు. అంటే 11 మంది సభ్యులతో ఆడే మ్యాచ్ ను..12 మందితో ఆడే అవకాశం కల్పించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే నలుగురు సభ్యులతో ఒక్కోజట్టు తన ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను అందచేయాలి.

వైడ్, నోబాల్స్ కు డీఆర్ఎస్...

ఈ ఐపీఎల్‌ నుంచి వైడ్‌, నోబాల్స్‌కు కూడా డీఆర్ఎస్ ద్వారా రివ్యూ చేసుకునే అవకాశం ఉంది.

గతంలో టాస్‌కు ముందు జట్టు సారథులు ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటిస్తూ వస్తుండగా.. ఈ సారి నుంచి టాస్‌ ముగిసిన తర్వాత తుది పదకొండు మందిని ఎంపిక చేసుకోవచ్చు.

కప్పుకొడితే 20 కోట్ల ప్రైజ్ మనీ....

రెండుమాసాలపాటు సాగే ఐపీఎల్ లో నిలకడగా రాణించడం ద్వారా విజేతగా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందచేయనున్నారు.

ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలలో చాంపియన్లకు ఇస్తున్న ప్రైజ్ మనీ కంటే ఇది చాలా ఎక్కువ.

గత సీజన్లో విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 20 కోట్లు, రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ 13 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా అందుకొన్నాయి.

ఐదు టైటిల్స్ తో ముంబై టాప్...

2008 నుంచి 2022 వరకూ గత 15 సీజన్లుగా సాగిన ఐపీఎల్ పోరులో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు విజేతలుగా నిలిచాయి.

.ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్, దక్కన్ చార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచి విజేతగా నిలిచాయి.మిగిలిన జట్లు ట్రోఫీని ఇప్పటి వరకూ అందుకోలేకపోయాయి.

గత 15 సీజన్లలో విన్నర్, రన్నరప్ స్థానాలు సాధించిన జట్ల వివరాలు....

2008 ఐపీఎల్ - 1

తొలి ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్‌కు వెళ్లాయి. ఇందులో చెన్నైను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌ తొలి టైటిల్ గెలుచుకుంది.‌

2009 ఐపీఎల్- 2

ఇక రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్కన్ చార్జర్స్ ఫైనల్‌కు వెళ్లగా.. దక్కన్ చార్జర్స్ టైటిల్ దక్కించుకుంది.

‌2010 ఐపీఎల్- 3

తొలి సీజన్‌లో కొద్దిలో కప్ మిస్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌.. ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఆడి గెలిచింది. ముంబయి ఇండియన్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది.

2011 ఐపీఎల్- 4

గత సీజన్‌లో కప్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది. 2011లో ఫైనల్‌కు చేరిన చెన్నై.. రాయల్ చాలెంజర్స్‌ను మట్టికరిపించింది.

2012 ఐపీఎల్- 5

వరుసగా మూడోసారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కొడదామని ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. చెన్నైను ఓడించి తొలిసారి కప్ గెలుచుకుంది.

‌2013 ఐపీఎల్ -6

హ్యాట్రిక్ మిస్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో ఆడి ఫైనల్‌కు చేరింది. కానీ ఈ సీజన్‌తో రెండోసారి కూడా చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. ఆరో సీజన్ తుది పోరులో చెన్నైని ఓడించి ముంబై ఇండియన్స్ తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది.

2014 ఐపీఎల్ -7

తొలిసారి కప్ గెలవాలని అనుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆశలను కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడియాశలు చేసింది. ఏడో సీజన్ తుదిపోరులో పంజాబ్‌కు చుక్కలు చూపించి రెండోసారి కప్ చేజిక్కించుకుంది.

2015 ఐపీఎల్- 8

ఈ సీజన్‌లో ఎలాగైనా కప్ గెలవాలని కష్టపడి ఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ముంబై ఇండియన్స్ రెండోసారి కూడా షాకిచ్చింది. చెన్నైని ఓడించి రెండోసారి టైటిల్ గెలుచుకుంది.‌

2016 ఐపీఎల్- 9

ఈ సీజన్‌తో తొలిసారి టైటిల్‌ను గెలవాలని ఆశపడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు సన్ రైజర్స్ షాకిచ్చింది. వార్నర్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ హైదరాబాద్‌.. బెంగళూరును ఓడించి తొలి టైటిల్‌ను ముద్దాడింది.‌

2017 ఐపీఎల్ -10

ఈ సీజన్‌తో ముంబై ఇండియన్స్ మూడోసారి టైటిల్ గెలిచింది. ఆ సీజన్ ఫైనల్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో హోరాహోరీ పోరులో విజేతగా నిలిచింది.

2018 ఐపీఎల్- 11

రెండోసారి టైటిల్ కొట్టాలన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెన్నై సూపర్ కింగ్స్ షాకిచ్చింది. ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి ముచ్చటగా మూడోసారి కప్ గెలుచుకుంది.

2019 ఐపీఎల్ -12

చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ముంబై పైచేయి సాధించింది. ఈ సీజన్‌తో నాలుగోసారి ముంబై ఇండియన్స్ కప్ గెలుచుకుంది.

2020 ఐపీఎల్ -13

కరోనా కారణంగా దుబాయిలో జరిగిన ఈ సీజన్‌లో గెలిచి ముంబై ఇండియన్స్ ఐదోసారి కప్ గెలుచుకుంది. తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను అలవోకగా ఓడించి విజేతగా నిలిచింది.

2021 ఐపీఎల్ -14

కరోనా దెబ్బతో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించడం ద్వారా నాలుగోసారి టైటిల్ అందుకొంది. ముంబై తర్వాత అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

2022 ఐపీఎల్ -15

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా 10 జట్లతో నిర్వహించిన ఐపీఎల్ 15 టైటిల్ ను హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ గెలుచుకొంది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ పై అలవోక విజయంతో చాంపియన్ గా అవతరించింది.

మరి..ఈ 16వ సీజన్లో గత సీజన్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ నిలుపుకొంటుందా? లేక...సరికొత్త చాంపియన్ తెరమీదకు వస్తుందా? తెలుసుకోవాలంటే మరో 50 రోజులపాటు వేచి చూడక తప్పదు.

First Published:  31 March 2023 8:02 PM IST
Next Story