Telugu Global
Sports

చెన్నై కెప్టెన్ గా చెపాక్ లో నేడు ధోనీ 200వ మ్యాచ్!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ నేడు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియంలో తన జట్టుకు 200వ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

చెన్నై కెప్టెన్ గా చెపాక్ లో నేడు ధోనీ 200వ మ్యాచ్!
X

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ నేడు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియంలో తన జట్టుకు 200వ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.....

ఐపీఎల్ లో నాలుగుసార్లు విజేత చెన్నై ఫ్రాంచైజీకి మరోపేరు మహేంద్రసింగ్ ధోనీ. 2008 ప్రారంభ సీజన్ నుంచి ప్రస్తుత 2023 సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ ఎవర్ గ్రీన్ కెప్టెన్ గా 40 సంవత్సరాల ధోనీ తన ప్రత్యేకతను నిలబెట్టుకొంటూ వస్తున్నాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ఇప్పటికే పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన ధోనీ..చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే లీగ్ మ్యాచ్ ద్వారా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నాడు.

చెన్నై ఫ్రాంచైజీ తరపున ఇప్పటికే 200కు పైగా మ్యాచ్ లు ఆడేసిన ధోనీ..హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా 200వ సారి తనజట్టుకు సారథ్యం వహించనున్నాడు.

గత 15 సీజన్లుగా...

గత 15 సీజన్లలో 13సీజన్లపాటు చెన్నైజట్టుకు ఆడుతూ వచ్చిన ధోనీ..ప్రస్తుత 16వ సీజన్ లో సైతం జట్టు పగ్గాలు చేపట్టాడు. రెండేళ్ల నిషేధం కారణంగా పూణే సూపర్ జెయింట్స్ కు గతంలో ధోనీ రెండు సీజన్లపాటు సారథ్యం వహించాడు.

రెండేళ్ల నిషేధం తొలగడంతో తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు అందుకొన్నాడు. కరోనా పుణ్యమా అంటూ నాలుగేళ్ల విరామం తర్వాత చెపాక్ స్టేడియం వేదికగా తిరిగి పూర్తిస్థాయిలో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.

గత సీజన్లో చెన్నై ఫ్రాంచైజీకి రవీంద్ర జడేజా నాయకత్వం వహించాడు. ప్రస్తుత సీజన్ తొలిరౌండ్ నుంచే ధోనీ తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకొన్నాడు.

కెప్టెన్ గా అత్యధిక పరుగుల మహీ...

ఐపీఎల్ చరిత్రలో ఓ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా ధోనీ నిలిచాడు. 199 మ్యాచ్ ల్లో 4,568 పరుగులు సాధించాడు. ఇందులో

23 అర్థశతకాలతో సహా 84 పరుగుల నాటౌట్ అత్యధిక స్కోరుగా ఉంది. 137.67 స్ట్ర్రయిక్ రేట్ సైతం నమోదు చేశాడు.

సిక్సర్ల బాదుడులో మూడో అత్యుత్తమ బ్యాటర్ గా ధోనీ కొనసాగుతున్నాడు.

క్రిస్ గేల్ 333 సిక్సర్లతో ఐపీఎల్ టాపర్ గా నిలిస్తే..231 సిక్సర్లతో ఏబీ డివిలియర్స్ రెండోస్థానంలో నిలిచాడు. ధోనీ 220కి పైగా సిక్సర్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

టీ-20 ఫార్మాట్లో 300కు పైగా మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన అరుదైన రికార్డు ధోని పేరుతోనే ఉంది. ధోని సారధ్యంలోనే చెన్నై ఫ్రాంచైజీ గత 15 సీజన్లలో నాలుగు సార్లు(2010, 2011, 2018, 2021)లో విజేతగా నిలిచింది. అంతేకాదు..2022 సీజన్ వరకూ సీఎస్‌కేను తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేర్చిన అసాధారణ రికార్డు కేవలం ధోనీకి మాత్రమే దక్కుతుంది.

2017లో రైజింగ్‌ పుణే సూపర్ జెయింట్‌ సారథిగా తనజట్టును ఫైనల్‌ చేర్చాడు. దీంతోపాటు టి-20ల్లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న కెప్టెన్‌గా కూడా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో స్వదేశం, విదేశీ వేదికలుగా జరిగిన వివిధ ఐపీఎల్ టోర్నీలలో 216మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ధోని 132 విజయాలు సాధించాడు. ధోని తర్వాత ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు అందుకున్న వారిలో రోహిత్‌ శర్మ రెండు, విరాట్ కొహ్లీ మూడు స్థానాలలో ఉన్నారు.

డెత్ ఓవర్లలో అత్యధిక పరుగుల కెప్టెన్..

ఐపీఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ ల్లో డెత్ ఓవర్లలో 2500 కు పైగా పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌ ధోని మాత్రమే.గత 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతను మరే ఆటగాడూ సాధించలేకపోడం విశేషం.

ఐపీఎల్ లో 200 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా కూడా ధోనీ మరో రికార్డు సాధించాడు.గత సీజన్లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్‌ సాధించాడు. ఫలితంగా రెండొంద మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు అత్యధిక మ్యాచ్‌ల రికార్డు సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనా పేరిట ఉంది. అయితే ఈ సీజన్‌ నుంచి రైనా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో రైనా వైదొలగడంతో రెండొందల మ్యాచ్‌ల ఆడిన తొలి ప్లేయర్‌ రికార్డును కోల్పోయాడు. ఐపీఎల్‌లో రైనా 193 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ధోని తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఉన్నాడు. రోహిత్‌ శర్మ 200 మ్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, కేకేఆర్‌ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ 194 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.

చెన్నై గుండె చప్పుడు ధోనీ...

భారత జట్టుకు కెప్టెన్ గా టీ-20, వన్డే, ఐసీసీ మినీ ప్రపంచకప్ ట్రోఫీలతో పాటు...టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ స్థానం అందించిన మొనగాడు ధోనీ. అంతేకాదు ఐపీఎల్ లోనూ తనజట్టు చెన్నైని అత్యంత విజయవంతమైన జట్టుగా నిలపడంలోనూ ప్రధానపాత్ర వహించాడు.

2008 ప్రారంభ ఐపీఎల్ లో చెన్నైజట్టు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన నాటినుంచి ధోనీ మరి వెనుదిరిగి చూసింది లేదు.మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై ఫ్రాంచైజీ రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నా ధోనీ ఆ జట్టును వీడలేదు. ధోనీపట్ల చెన్నై ఫ్రాంచైజీ సైతం అదే విశ్వాసం చూపింది.

2008 సీజన్ నుంచి ప్రస్తుత 2023 సీజన్ మొదటి మూడురౌండ్ల మ్యాచ్ ల వరకూ ధోనీ.. చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం ఓ ప్రపంచ రికార్డుగా నిలిచిపోతుంది.

పంజాబ్ కింగ్స్ తో ముగిసిన రెండోరౌండ్ మ్యాచ్ ద్వారా 200 చెన్నై క్యాప్ లు అందుకొన్న ఘనత సాధించిన కొద్దిరోజుల విరామం లోనే 200 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన మైలురాయిని సైతం ధోనీ చేరుకోగలిగాడు. ఇప్పుడు హోంగ్రౌండ్ చెపాక్ లో 200వ సారి జట్టుకు నాయకత్వం వహిస్తున్న రికార్డుకు సైతం చేరువయ్యాడు.

మూడు టైటిల్స్, 9 రన్నరప్ స్థానాలు

ఐపీఎల్ గత 15 సీజన్ల చరిత్రలోనే రెండు అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఓ జట్టుగా నిలవడం వేనుక ధోనీ నాయకత్వ ప్రతిభ, చాతుర్యం ఎంతగానో ఉన్నాయి.

2016- 2017 సీజన్లు మినహా..మిగిలిన 13సీజన్లలోనూ ధోనీ నాయకత్వంలో చెన్నై నాలుగుసార్లు విజేతగా ( 2010, 2011, 201, 2021), ఏడుసార్లు రన్నరప్ ( 2008, 12, 13, 15, 19) గా నిలిచిందంటే..కెప్టెన్ గా ధోనీ సత్తా ఏపాటిదో మరిచెప్పాల్సిన పనిలేదు.

2020 సీజన్ మినహా మిగిలిన అన్ని ఐపీఎల్ టోర్నీలలో ప్లేఆఫ్ రౌండ్ చేరిన జట్టు ఏదంటే చెన్నై అని మాత్రమే చెప్పాలి. కెప్టెన్ గా చెన్నై జట్టుకు 100కు పైగా విజయాలు అందించిన తొలి కెప్టెన్ రికార్డుకూడా ధోనీకే దక్కుతుంది.

ఐపీఎల్ అంటే ధోనీ, ధోనీ అంటే ఐపీఎల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  12 April 2023 2:27 PM IST
Next Story