Telugu Global
Sports

ఈడెన్ లో బెంగళూరు చిత్తుగా ఓడెన్!

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సమరంలో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ 81 పరుగులతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది.

IPL 2023: ఈడెన్ లో బెంగళూరు చిత్తుగా ఓడెన్!
X

IPL 2023: ఈడెన్ లో బెంగళూరు చిత్తుగా ఓడెన్!

ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ రెండోరౌండ్లోనే బెంగళూరుకు కళ్లు బైర్లు కమ్మే దెబ్బ తగిలింది. మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 81 పరుగుల ఘోరపరాజయం చవిచూసింది....

ఐపీఎల్ 16వ సీజన్ సమరం హాట్ హాట్ గా సాగుతోంది. ఆరునూరైనా ప్రస్తుత సీజన్లో టైటిల్ సాధించాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు లీగ్ రెండోరౌండ్లోనే కళ్లు బైర్లు కమ్మే దెబ్బ తగిలింది.

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సమరంలో ఆతిథ్య కోల్ కతా నైట్ రైడర్స్ 81 పరుగులతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది.

శార్దూల్ విశ్వరూపం.....

ఈ మ్యాచ్ లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా...ప్రారంభ ఓవర్లలోనే టాపార్డర్ వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలు పెట్టింది. ఓపెనర్లో రహ్మానుల్లా గుర్బాజ్‌ ధాటిగా ఆడినా.. వెంకటేశ్‌ అయ్యర్‌, మన్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ రాణా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు వరుస ఓవర్లలో వికెట్లు పడగొడుతూ కోల్ కతాకు పగ్గాలు వేశారు. అయితే..రహ్మానుల్లా ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. రింకూ సింగ్‌ అండగా నిలవడంతో దారితప్పిన జట్టును తిరిగి గాడిలో పడేలా చేశాడు.

నిలదొక్కుకొంటున్న సమయంలో లెగ్ స్పిన్నర్ కరణ్‌ శర్మ 12వ ఓవర్లో వరుస బంతుల్లో రహ్మానుల్లాతో పాటు సూపర్ హిట్టర్ రస్సెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో కోల్‌కతా 89 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పేస్ ఆల్ రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాట్ ఝళిపిస్తూ ఎదురుదాడికి దిగాడు. తొలి బంతినే బౌండ్రీకి బాదటం ద్వారా గేర్ మార్చాడు. ఆకాశ్‌ దీప్‌ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. బ్రేస్‌వెల్‌కు రెండు సిక్సర్లు రుచి చూపించిన శార్దూల్‌.. ఆ తర్వాత పేసర్ హర్షల్‌ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టాడు.

జోస్ బట్లర్ సరసన శార్దూల్...

ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే శార్దూల్ మెరుపు అర్ధశతకం పూర్తి చేయడం ద్వారా ఐపీఎల్ లో సంయుక్త రికార్డు విజేతగా నిలిచాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సాధించిన 20 బంతుల ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో బెంగళూరు బౌలర్లు 23 పరుగులు సమర్చించుకొన్నారు. 19వ ఓవర్లో రింకూ సింగ్‌ 4,6,6 బాది స్కోరును రెండొందలు దాటించాడు.

కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌ (29 బంతుల్లో 9 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేయటం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేసుకున్నాడు. రింకు సింగ్‌ (46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్‌ విల్లే, కరణ్‌ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

కోల్ కతా స్పిన్ లో బెంగళూరు గల్లంతు...

205 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలిపోయింది. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మరో ఓపెనర్ విరాట్‌ కోహ్లీ (21; 3 ఫోర్లు), బ్రేస్‌వెల్‌ (19) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచుకోలేకపోయారు.

మ్యాక్స్‌వెల్‌ (5), షాబాజ్‌ అహ్మద్‌ (1), దినేశ్‌ కార్తీక్‌ (9), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనూజ్‌ రావత్‌ (1), హర్షల్‌ పటేల్‌ (0) విఫలమయ్యారు. డేవిడ్‌ విల్లే (20 నాటౌట్‌), ఆకాశ్‌దీప్‌ (17) ఆఖర్లో కాస్త పోరాడినా పరాజయం తప్పలేదు.

కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 4, ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మిస్టరీ స్పిన్నర్ సుయాశ్‌ శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. శార్దూల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఈరోజు లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరిగే 10వ లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. రాత్రి 7-30 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

First Published:  7 April 2023 9:08 AM IST
Next Story