టైటాన్స్ టాప్...రాయల్స్ ఫ్లాప్!
ఐపీఎల్ -16 లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. 10వ రౌండ్ పోరులో గతేడాది ఫైనలిస్ట్ రాజస్థాన్ రాయల్స్ ను టైటాన్స్ 9 వికెట్లతో చిత్తు చేసి టేబుల్ టాపర్ గా నిలిచింది.
ఐపీఎల్ -16 లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. 10వ రౌండ్ పోరులో గతేడాది ఫైనలిస్ట్ రాజస్థాన్ రాయల్స్ ను టైటాన్స్ 9 వికెట్లతో చిత్తు చేసి టేబుల్ టాపర్ గా నిలిచింది.
ఐపీఎల్ గత సీజన్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది టైటిల్ కు గురి పెట్టింది. మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ ల లీగ్ 10వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి గుజరాత్ అత్యధికంగా 14 పాయింట్లు సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరువయ్యింది.
గుజరాత్ కళకళ..రాజస్థాన్ వెలవెల!
ఐపీఎల్-15వ సీజన్ విన్నర్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ జట్ల పోరు..ప్రస్తుత 16వ సీజన్లో సైతం కొనసాగుతోంది. టైటాన్స్ హోంగ్రౌండ్ అహ్మదాబాద్ వేదికగా ముగిసిన తొలి అంచె పోటీలో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిస్తే..రాజస్థాన్ హోం గ్రౌండ్ జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో అంచెపోరులో గుజరాత్ 9 వికెట్లతో నెగ్గి దెబ్బకు దెబ్బతీసింది.
రషీద్ స్పిన్ జాదూలో రాయల్స్ గల్లంతు...
ఈ కీలక పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం 17.5 ఓవర్లలోనే 118 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ స్పిన్ జాదూ రషీద్ ఖాన్ 14 పరుగులిచ్చి ముగ్గురు రాయల్స్ బ్యాటర్లను పెవీలియన్ దారిపట్టించాడు.
గుజరాత్ ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్ చక్కటి ఆరంభాన్ని ఇవ్వకుండానే తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.హార్దిక్ రెండో ఓవర్‌లోనే బట్లర్ ఔట్ కాగా.. మరో ఓపెనర్ యశస్వి రనౌటయ్యాడు. పవర్ ప్లే ఓవర్లలోని మొదటి 5 ఓవర్లు ముగిసేసరికి 47/1తో పటిష్టమైన స్థితిలో కనిపించిన రాయల్స్ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి మరి కోలుకోలేకపోయింది. కెప్టెన్ సంజు క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడినా..జోస్ లిటిల్ బౌలింగ్ లో చిక్కాడు. ఆ తర్వాత నుంచి అఫ్గాన్ స్పిన్ జోడీ రషీద్ ఖాన్, నూర్ మహ్మద్ జోరు ప్రారంభమయ్యింది. ఇటు రషీద్, అటూ నూర్ పోటీపడి వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి ధాటికి రాయల్స్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. చివర్లో బౌల్ట్ (15) కాస్త ప్రతిఘటించడంతో రాజస్థాన్ వంద పరుగుల స్కోరైనా దాటగలిగింది.
డాషింగ్ ఓపెనర్ొ బట్లర్ (8), యశస్వి జైస్వాల్ (14), దేవదత్ పడిక్కల్ (12), అశ్విన్ (2), రియాన్ పరాగ్ (4), హెట్‌మైర్ (7), ధ్రువ్ జురేల్ (9) పెవిలియన్‌దారి పట్టారు. కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే పోరాడి 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సంజు మొత్తం 3 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 30 పరుగులు సాధించాడు. గుజరాత్ బౌలర్లలో స్పిన్ జోడీ రషీద్ ఖాన్ (3/14), నూర్ అహ్మద్ (2/25) అత్యుత్తమంగా రాణించారు.
అలవోకగా 119 పరుగుల టార్గెట్....
మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేయాల్సిన గుజరాత్ 37 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల విజయం నమోదు చేయగలిగింది.
ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (41 నాటౌట్; 5 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (36; 6 ఫోర్లు) తమజట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ ను లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పడగొట్టడంతో...క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తనదైన స్టయిల్లో దూకుడుగా ఆడి 15 బంతుల్లో 39 నాటౌట్ స్కోరుతో తనజట్టుకు అలవోక విజయం అందించాడు. పాండ్యా 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు.
రాయల్స్ బౌలర్లలో చాహల్ మాత్రమే వికెట్ పడగొట్టగలిగాడు. గుజరాత్ భారీవిజయంలో ప్రధానపాత్ర వహించిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రాయల్స్ కు అచ్చిరాని హోంగ్రౌండ్...
రాజస్థాన్ రాయల్స్ కు హోంగ్రౌండ్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఏమాత్రం అచ్చిరావడం లేదు. ప్రస్తుత సీజన్లో వరుసగా పరాజయాలు చవిచూడాల్సి వస్తోంది.
ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అతిపెద్ద ఓటమిని గుజరాత్ టైటాన్స్ చేతిలోనే చవిచూడాల్సి వచ్చింది. 118 పరుగులకే రాయల్స్ కుప్పకూలడంతో పాటు..కేవలం 13 ఓవర్లలోనే ఓటమి పాలయ్యింది.
2019లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో 37 బంతులు మిగిలిఉండగానే రాజస్థాన్ ను చిత్తు చేసిన రికార్డును..ప్రస్తుత సీజన్లో గుజరాత్ టైటాన్స్ అధిగమించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 37 బంతులు మిగిలి ఉండగానే సాధించడం ద్వారా అతిపెద్ద విజయం నమోదు చేయగలిగింది.
10 మ్యాచ్ ల్లో 7 విజయాల టైటాన్స్...
మొత్తం 14 రౌండ్ల లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించడం ద్వారా గుజరాత్ టైటాన్స్ 10 జట్ల లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.
మిగిలిన జట్ల కంటే 4 పాయింట్ల ఆధిక్యం సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరువకాగలిగింది. ఈరోజు జరిగే సూపర్ ఫైట్ లో మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ పోరు.. డేమ్యాచ్ గా జరుగనుంది.
న్యూఢిల్లీ వేదికగా రాత్రి 7-30కి ప్రారంభమయ్యే రెండో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ సవాలు విసురుతోంది.