ముంబై ఇండియన్స్ నుంచి ఆర్చర్ పోయే...జోర్డాన్ వచ్చే!
ఐపీఎల్ లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్లో కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు.
ఐపీఎల్ లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్లో కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు....
ఐపీఎల్ కింగ్, ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. జస్ ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్ల గాయాలతో ఇప్పటికే చతికిలబడిన ముంబైకి మరో దెబ్బ తగిలింది.
ముంబై జట్టులోని కీలక ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ సైతం గాయంతో జట్టు నుంచి వైదొలగడంతో ..అతని స్థానంలో ఇంగ్లండ్ కే చెందిన మరో ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ కు చోటు కల్పించారు.
4 మ్యాచ్ లతోనే ఆర్చర్ పని సరి..
ముంబై ఇప్పటి వరకూ ఆడిన 10 మ్యాచ్ ల్లో ఆర్చర్ కేవలం 4 మ్యాచ్ ల్లో మాత్రమే ఆడినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 10.38 ఎకానమీతో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు.
ఆర్చర్ తన ఐపీఎల్ కెరియర్ లో 39 మ్యాచ్ లు ఆడి 48 వికెట్లు సాధించాడు. అత్యుత్తమంగా 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 10 రౌండ్ల మ్యాచ్ ల్లో 5 విజయాలు, 5 పరాజయాల రికార్డుతో ఉన్న ముంబై..ప్లే-ఆఫ్ రౌండ్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే..మిగిలిన 4 రౌండ్ల మ్యాచ్ ల్లో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది. ఇదే సమయంలో జోఫ్రా ఆర్చర్ లాంటి ప్రధాన బౌలర్ సైతం గాయంతో తప్పుకోడంతో..
2 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పై..డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్ క్రిస్ జోర్డాన్ ను చేర్చుకొన్నట్లు ముంబై ఫ్రాంచైజీ ప్రకటించింది.
అపారఅనుభవం జోర్డాన్ సొంతం...
వైట్ బాల్ క్రికెట్లో ఇంగ్లండ్ కీలక బౌలర్ గా గుర్తింపు పొందిన క్రిస్ జోర్డాన్ కు 28 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 27 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. 2016 సీజన్ నుంచి ఐపీఎల్ లో పాల్గొంటూ వచ్చిన జోర్డాన్ కు ఇంగ్లండ్ తరపున ఆడిన 87 టీ-20 మ్యాచ్ ల్లో 96 వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగే కీలక 11వ రౌండ్ మ్యాచ్ లో ముంబై తుదిజట్టులో క్రిస్ జోర్డాన్ చేరే అవకాశం ఉంది.
యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా గాయంతో సీజన్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోడంతో ముంబై బౌలింగ్ బలహీన పడిపోయింది.బెహ్రన్ డార్ఫ్, రీలే మెర్డిత్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఆ లోటును పూడ్చలేకపోతున్నారు. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ తోనే ముంబై నెట్టుకొస్తోంది.