Telugu Global
Sports

చెపాక్ లో ఎవరికో షాక్...నేడే ముంబై- లక్నో ఎలిమినేటర్ ఫైట్ !

ఐపీఎల్ -16వ సీజన్ ఎలిమినేటర్ ఫైట్ కి చెన్నై చెపాక్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాత్రి 7-30కి జరిగే ఈ నాకౌట్ సమరంలో ముంబై, లక్నో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IPL 2023 Eliminator match: Mumbai-Lucknow eliminator match today at 7:30 PM
X

చెపాక్ లో ఎవరికో షాక్...నేడే ముంబై- లక్నో ఎలిమినేటర్ ఫైట్ !

ఐపీఎల్ -16వ సీజన్ ఎలిమినేటర్ ఫైట్ కి చెన్నై చెపాక్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాత్రి 7-30కి జరిగే ఈ నాకౌట్ సమరంలో ముంబై, లక్నో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లో మరో బిగ్ ఫైట్ కి స్పిన్ బౌలర్ల అడ్డా చెన్నై చెపాక్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఈరోజు రాత్రి 7-30కి జరిగే ఈ నాకౌట్ పోరులో..

లీగ్ టేబుల్ మూడోస్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తో నాలుగోస్థానం సాధించిన ముంబై ఇండియన్స్ ఢీ కొనబోతోంది.

లక్నోదే పైచేయి..ఫేవరెట్ ముంబై...

ఐపీఎల్ లో భాగంగా ఇప్పటి వరకూ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడిన మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ ముంబైకి పరాజయాల రికార్డే ఉంది. అయితే..ఈ రోజు జరిగే కీలక పోరులో మాత్రం పవర్ ఫుల్ బ్యాటింగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

ప్రస్తుత సీజన్ లీగ్ లో నాలుగుమ్యాచ్ ల్లో 200కు పైగా స్కోర్లను చేధించిన ఏకైకజట్టుగా ముంబై నిలిచింది. అంతేకాదు..లీగ్ దశలో ఆడిన మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ ల్లో ముంబై రికార్డుస్థాయిలో 159.70 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేసింది. 76 వికెట్లు నష్టపోయి మొత్తం 2వేల 592 పరుగులు సాధించింది.34.11 సగటును సైతం నమోదు చేసింది.

అదే లక్నోజట్టు స్ట్ర్రయిక్ రేట్ మాత్రం 144.38గానే ఉంది. మొత్తం 14 మ్యాచ్ ల్లో 2వేల 378 పరుగులు సాధించింది. 92 వికెట్ల నష్టానికి 25.85 సగటు సాధించింది.

అసలే ఉక్కబోత, ఆ పైన చెపాక్ స్లోపిచ్.....

ఈ పోరుకు వేదికగా ఉన్న చెన్నై చెపాక్ స్టేడియం వాతావరణం, వికెట్ లోని మందకొడి తనం రెండుజట్ల స్ట్ర్రోక్ మేకర్ల సహనానికి, ప్రతిభకు అసలు సిసలు పరీక్షకానున్నాయి.

మ్యాచ్ జరిగే సమయంలో అధికంగా ఉక్కబోత ఉంటుందని, వాతావరణంలో 68 శాతం తేమ సైతం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.దీనికితోడు..పూర్తిగా పొడిబారిన చెపాక్ పిచ్ సైతం స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండనుండడంతో 150 నుంచి 170కి మధ్యనే స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్యూరేటర్ చెబుతున్నారు.

మ్యాచ్ ఫలితాన్ని రాత్రివేళ పడే మంచు సైతం ప్రభావితం చేయనుంది. 150 పరుగుల లక్ష్యం సైతం చేధించడం అంతతేలిక కాదని చెపాక్ పిచ్ స్వభావం తెలిసిన క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు.

లక్నో స్పిన్ కు..ముంబై బ్యాటింగ్ కు సమరం..

స్పిన్ బౌలర్లకు సర్వధామం లాంటి చెపాక్ పిచ్ పైన జరుగనున్న ఈ ఎలిమినేటర్ సమరాన్ని భీకరమైన ముంబై బ్యాటింగ్ కు, పదునైన లక్నో స్పిన్ బౌలింగ్ కు నడుమ జరిగే యుద్ధంగా అభివర్ణిస్తున్నారు.

సూపర్ హిట్టర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ,సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మలతో ముంబై బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఈ బ్యాటర్లలో ఏ ముగ్గురు రాణించినా..200కు పైగా స్కోర్లు సాధించడం ముంబైకి మంచినీళ్లప్రాయంలా మారింది. అయితే...చెపాక్ స్లో పిచ్ పైన ముంబై బ్యాటర్లు అదే దూకుడు కొనసాగించగలరా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

మరోవైపు..కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రాలతో కూడిన లక్నో స్పిన్ బౌలింగ్ ఎటాక్ నుంచి ముంబైకి గట్టి పరీక్ష ఎదురుకానుంది.

ముంబై స్టార్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కు పేస్ బౌలర్లపై 150కి పైగా స్ట్ర్రయిక్ రేట్ ఉంటే..స్పిన్ బౌలర్ల పైన 130 స్ట్ర్రయిక్ రేట్ మాత్రమే ఉండటం విశేషం.

మళ్లీ అదే ఫలితం ఖాయమేనా?

చెన్నై వేదికగా ముగిసిన తొలి క్వాలిఫైయర్ పోరులో గుజరాత్ టైటాన్స్ పై ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో తొలి విజయం నమోదు చేసింది.

గతంలో టైటాన్స్ తో ఆడిన మూడుకు మ్యూడుమ్యాచ్ ల్లోనూ చెన్నైకి పరాజయాలే ఉన్నాయి.

లక్నో ప్రత్యర్థిగా మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ పరాజయాలు పొందిన ముంబై...చెన్నై వేదికగా తొలి విజయం సాధించగలనన్న ధీమాతో ఉంది. లక్నోజట్టు మాత్రం..

బ్యాటింగ్ లో మిడిలార్డర్ హిట్టర్లు స్టోయినిస్, నికోలస్ పూరన్ లపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ తో పాటు స్టోయినిస్, పూరన్ రాణించకపోతే లక్నో సూపర్ జెయింట్స్ కు కష్టాలు తప్పవు.

బౌలింగ్ విభాగంలో ముంబై..ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షౌకీన్ తో పాటు..వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా,లెఫామ్ స్పిన్నర్ కుమార కార్తికేయలకు తుదిజట్టులో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 170కి పైగా స్కోరు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. చేజింగ్ అంత తేలిక కాకపోడంతో..టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం వైపే మొగ్గుచూపనుంది.

ఈమ్యాచ్ లో నెగ్గినజట్టు క్వాలిఫైయర్స్ -2 లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడనుంది. ఓడిన జట్టు మాత్రం టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించక తప్పదు.

ఇప్పటికే ఐదుటైటిల్స్ నెగ్గిన ముంబై ఈ కీలక పోరులో నెగ్గడం ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న పట్టుదలతో ఉంది.

ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం..మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  24 May 2023 1:05 PM IST
Next Story