Telugu Global
Sports

హోం మ్యాచ్ ల్లో చెన్నైజోరు, ఢిల్లీ హోరు!

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక విజయాలు సాధించాయి. ముంబై, బెంగళూరుజట్లు మాత్రం చతికిల పడ్డాయి.

హోం మ్యాచ్ ల్లో చెన్నైజోరు, ఢిల్లీ హోరు!
X

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక విజయాలు సాధించాయి. ముంబై, బెంగళూరుజట్లు మాత్రం చతికిల పడ్డాయి...

ఐపీఎల్ -16 ప్లే ఆఫ్ రౌండ్లో చోటు కోసం మొత్తం 10 జట్ల మధ్య ఆసక్తికరమైన పోరే జరుగుతోంది. ఐదుసార్లు విజేత ముంబై, తొలి టైటిల్ కోసం తహతహలాడుతున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు కీలక 10వ రౌండ్ మ్యాచ్ ల్లో విఫలం కాగా...నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కళ్లు చెదిరే విజయాలు సాధించాయి.

చెపాక్ లో 13 ఏళ్ల తర్వాత చెన్నై గెలుపు....

చెన్నై సూపర్ కింగ్స్ హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో ఆతిథ్య చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.హోంగ్రౌండ్లో ముంబై ప్రత్యర్థిగా చెన్నై సూపర్ కింగ్స్ కు గత 13 సంవత్సరాలలో ఇదే తొలిగెలుపు కావడం ఓ విశేషం.

ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మిడిలార్డర్ ఆటగాడు, యువబ్యాటర్ నెహల్‌ వాధేరా (64; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో జట్టు పరువు దక్కించాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌ (26), స్టబ్స్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు.

ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగిన కామెరూన్ గ్రీన్, ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాటర్. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0) దారుణంగా విఫలమయ్యారు. కామెరూన్‌ గ్రీన్‌ (6), ఇషాన్‌ కిషన్‌ (7), టిమ్‌ డేవిడ్‌ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యారు. కాగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది వరుసగా రెండో డకౌట్ కావడం విశేషం.

ఆదుకున్న‌ వ‌ధేరా

చెన్నై బౌలర్ల ధాటికి ముంబై టాపార్డ‌ర్ పేకమేడలా కూలింది. ఓపెనింగ్ బౌలర్ దీపక్ చహార్ పవర్ ప్లే ఓవర్లలోనే 3 వికెట్లు పడగొట్టడం ద్వారా చెన్నై విజయానికి మార్గం సుగమం చేశాడు. స్టార్ బ్యాటర్లు విఫలం కావడంతో జట్టు భారాన్ని యువఆటగాడు నేహ‌ల్ వ‌ధేరా(64) తనపైనే వేసుకొన్నాడు. అర్ధ శ‌త‌కంతో మెరిశాడు.

మరో యువబ్యాటర్ స్ట‌బ్స్(20)తో క‌లిసి ధాటిగా ఆడి ముంబై స్కోర్ వంద దాటించాడు. ఈ యువజోడీ ఐదో వికెట్‌కు 54 ప‌రుగులు జోడించారు.

చెన్నై బౌల‌ర్ల‌లో మ‌థీశ ప‌థిర‌న మూడు, దీప‌క్ చాహ‌ర్, తుషార్ దేశ్‌పాండే రెండేసి వికెట్లు తీశారు. జ‌డేజాకు ఒక వికెట్ ద‌క్కింది.

లాసిత్ మలింగ జూనియర్ గా పేరుపొందిన 20 ఏళ్ల‌ ప‌థిర‌న 15 ప‌రుగ‌లిచ్చి మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయాల్సిన చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.

ప‌వ‌ర్ ప్లేలో చెన్నై ఓపెన‌ర్లు దంచికొట్టారు. రుతురాజ్ గైక్వాడ్(30) సిక్సర్ల‌తో చెల‌రేగాడు. అర్ష‌ద్ ఖాన్ వేసిన 4వ ఓవ‌ర్లో రెండు సిక్స్‌లు, రెండు బౌండ‌రీల‌తో 20 ప‌రుగులు రాబ‌ట్టాడు. అయితే.. పీయూష్ చావ్లా ఈ జోడీని విడ‌దీశాడు. గైక్వాడ్‌ను ఔట్ చేసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. దాంతో, తొలి వికెట్‌కు 46 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆరు ఓవ‌ర్ల‌కు చెన్నై వికెట్ న‌ష్టానికి 55 ప‌రుగులు కొట్టింది. డెవాన్ కాన్వే(18), అజింక్యా ర‌హానే(3) ఆ తర్వాత దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు.

కాన్వే (44), రుతురాజ్‌ (30), రహానే (21), శివమ్‌ దూబే (26 నాటౌట్‌) నిలకడగా రాణించడంతో చెన్నై విజేతగా నిలిచింది.ముంబై బౌలర్ల‌లో పీయూష్ చావ్లా రెండు, స్ట‌బ్స్, ఆకాశ్ మ‌ద్వాల్ ఒక్కో వికెట్ తీశారు.

చెన్నై విజయంలో ప్రధానపాత్ర వహించిన పథిరనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

11 రౌండ్లలో చెన్నైకి ఇది 6వ విజయం కాగా..10 జట్ల లీగ్ టేబుల్ లో గుజరాత్ టైటాన్స్ తర్వతి స్థానంలో నిలిచింది. 2010 తర్వాత చెపాక్‌ స్టేడియంలో ముంబైపై ధోనీ సేన విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బెంగళూరు నోటిలో సాల్ట్!

లీగ్ మొదటి తొమ్మిదిరౌండ్లలో అధిక పరాజయాలతో విలవిలలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 10వ రౌండ్ పోరులో హాట్ ఫేవరెట్ బెంగళూరును 7 వికెట్లతో చిత్తు చేసి..ప్లే ఆఫ్ రౌండ్ ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

గత మ్యాచ్‌లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ హోంగ్రౌండ్ వేదికగా జరిగిన పోరులో బెంగళూరు పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

ఈ కీలక పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న బెంగళూరుకు శుభారంభం ద‌క్కింది. ఫాఫ్ డూప్లెసిస్(45), విరాట్ కోహ్లీ(55) తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే.. మీడియం పేసర్ మిచెల్ మార్ష్ వ‌రుస బంతుల్లో ఫాఫ్ డూప్లెసిస్(45), మ్యాక్స్‌వెల్(0)ను పెవీలియన్ దారి పట్టించాడు.

ఆ త‌ర్వాత వ‌చ్చిన యువబ్యాటర్ మ‌హిపాల్ లోమ్‌రోర్(54 నాటౌట్) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. దినేశ్ కార్తిక్(11), అనుజ్ రావ‌త్(8 నాటౌట్‌) కీలక పరుగులు జమ చేశారు..దాంతో ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ రెండు, ముఖేశ్ కుమార్, ఖ‌లీల్ అహ్మ‌ద్ ఒక వికెట్ తీశారు.

సాల్ట్ వీరవిహారం....

182 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనింగ్ జోడీ సాల్ట్- వార్నర్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. బెంగళూరు బౌలర్లను వీరబాదుడు బాదారు.సాల్ట్‌ (45 బంతుల్లో 87; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టాడు.

ఓపెన‌ర్‌ ఫిలిఫ్ సాల్ట్(87) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరుపు హాఫ్ సెంచ‌రీ సాధించాడు.ఒంటిచేత్తో తన జ‌ట్టును విజేతగా నిలిపాడు. సాల్ట్ కు రిలే ర‌స్సో(35) తోడుగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ ఓవ‌ర్లో ర‌స్సో సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు.

. సాల్ట్ తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పి సిక్స్‌లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.దాంతో, ప‌వ‌ర్ ప్లేలో ఆ జ‌ట్టు వికెట్ న‌ష్టానికి 70 ప‌రుగులు కొట్టింది. వార్న‌ర్ ఔట‌య్యాక మిచెల్ మార్ష్‌(26)తో క‌లిసి సాల్ట్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఆఖ‌ర్లో రిలే ర‌స్సో(35) దంచ‌డంతో మ‌రో 3.2 ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే విజ‌యం ఢిల్లీ విజయాన్ని అందుకొంది. స్పిన్ ఆల్ రౌండర్ అక్ష‌ర్ ప‌టేల్(8) నాటౌట్‌గా నిలిచాడు.

చివరకు..ఢిల్లీ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులతో బ్యాట్ టు బ్యాక్ విజయాలు నమోదు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్‌, కరణ్‌ శర్మ, హర్షల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. సాల్ట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ విజ‌యంతో ఢిల్లీ పాయింట్ల ప‌ట్టిక‌లో 9వ స్థానంలో నిలిచింది.

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఈ రోజు జరిగే సూపర్ సండే డబుల్‌ హెడర్‌ పోరులో గుజరాత్‌తో లక్నో, రాజస్థాన్‌తో హైదరాబాద్‌ తలపడనున్నాయి.

First Published:  7 May 2023 2:00 PM IST
Next Story