వీరబాదుడులో వీరికి వీరేసాటి!
చిట్టిపొట్టి టీ-20 క్రికెట్లో బ్యాటింగ్ కు అర్థాలు మారిపోయాయి. బిగ్ హిట్టర్లకు, తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించే వీరబాదుడు బ్యాటర్ల హవా తారాస్థాయికి చేరింది.
చిట్టిపొట్టి టీ-20 క్రికెట్లో బ్యాటింగ్ కు అర్థాలు మారిపోయాయి. బిగ్ హిట్టర్లకు, తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించే వీరబాదుడు బ్యాటర్ల హవా తారాస్థాయికి చేరింది....
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్..ధూమ్ ధామ్ టీ-20 గమనాన్నే మార్చి వేసింది. గత 15 సీజన్లుగా క్రికెట్ లోని మూడు ప్రధాన అంశాలు..బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను కొత్తపుంతలు తొక్కిస్తోంది. సీజన్ సీజన్ కూ ఆలోచనలు, వ్యూహాలు, భావనలు అనూహ్యంగా మారిపోతూ వస్తున్నాయి.
ఆటలో మజాను పెంచడం కోసం, ఉత్కంఠను రేకెత్తించడం కోసం నిర్వాహక సంఘం పలు సరికొత్త ప్రయోగాలు చేస్తూ వస్తోంది.
ప్రస్తుత 16వ సీజన్లో 10 జట్లు..70 మ్యాచ్ ల లీగ్ సమరం..మొదటి 25 మ్యాచ్ లకే పతాకస్థాయికి చేరింది.
ఢిల్లీ క్యాపిటల్స్ మినహా...
పదిజట్ల లీగ్ లో ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగిలిన జట్లన్నీ అంచనాలకు అందనిరీతిలో ఆడుతూ ఎనలేని ఉత్కంఠను రేకెత్తిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
హాట్ ఫేవరెట్ జట్టు అంటూ ఏదీ లేకపోడంతో..ఏ జట్టు ఏ జట్టును ఓడిస్తుందో తెలియని ఉత్కంఠ, మజాలతో మ్యాచ్ లు సాగిపోతున్నాయి. ఆఖరి ఓవర్ ఆఖరి బంతివరకూ ఆధిక్యత చేతులు మారటం, ఒక్క పరుగు నుంచి 7 పరుగులు, ఒక్క వికెట్ నుంచి 3 వికెట్ల విజయాలు సాధారణమైపోయాయి.
మొత్తం 10 జట్లలో కేవలం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రమే మొదటి ఐదుమ్యాచ్ ల్లో ఐదింట ఓడి లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది. మిగిలిన జట్లు కనీసం రెండు నుంచి మూడు వరకూ విజయాలు సాధించడం ద్వారా పోటీలను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి.
దంచుడు..బాదుడు..కుమ్ముడు..
గ్రామీణ ప్రాంతాలలో వాడుక పదాలుగా ఉన్న బాదుడు, దంచుడు, కుమ్ముడు, వీరబాదుడు, పిచ్చ కొట్టుడు, యమదంచుడు కు ఇప్పుడు ఐపీఎల్ లో ఎనలేని ప్రాధ్యాన్యత ఏర్పడింది.
వివిధజట్లకు చెందిన ఒక్కో ఆటగాడు బాదుతున్న తీరు చూస్తుంటే వ్యాఖ్యాతలకు, పాత్రికేయులకు..మన పల్లెపదాలే దిక్కయ్యాయి. బ్యాటింగ్ లో హోరు,జోరు, దూకుడును వర్ణించడానికి, తీవ్రతను సగటు క్రికెట్ అభిమానికి తెలియ చెప్పడం కోసం వీరబాదుడు, దంచుడు, కుమ్ముడు, కొట్టుడు అన్నపదాలను అలవోకగా వాడేస్తున్నారు.
ఒక్కమ్యాచ్ లో 33 సిక్సర్లు....444 పరుగులు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నాలుగుసార్లు విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరిగిన నాలుగోరౌండ్ మ్యాచ్ బాదుడు, దంచుడు, పిచ్చ కొట్టుడు అన్న పదాలకు పరాకాష్టగా నిలిచింది.
మొత్తం 40 ఓవర్లలో రెండుజట్లూ కలసి 444 పరుగులు సాధించాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగుల స్కోరు నమోదు చేసింది. సమాధానంగా రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేయగలిగింది.
రెండుజట్ల బ్యాటర్లు కలసి మొత్తం 33 సిక్సర్లు, 24 బౌండ్రీలు బాదడం సరికొత్త ఐపీఎల్ రికార్డుగా మిగిలింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ గా రికార్డుల్లో చేరింది.
చెన్నై ఓపెనర్ డేవిడ్ కాన్వే 45 బంతుల్లో 6 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 83, రెండోడౌన్ శివం దూబే 27 బంతుల్లో 2 బౌండ్రీలు, 5 సిక్సర్లు బాదితే..బెంగళూరు కెప్టెన్ డూప్లెసి
33 బంతుల్లో 5 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 62, రెండో డౌన్ గ్లెన్ మాక్స్ వెల్ 36 బంతుల్లోనే 3 బౌండ్రీలు, 8 సిక్సర్లతో చెలరేగిపోయారు.
మిడిలార్డర్ డైనమైట్లు...
ఇక..మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన వివిధ జట్ల సూపర్ హిట్టర్లు..ఒంటిచేత్తో తమజట్లను విజేతగా నిలుపుతూ రేటుకు తగ్గ ఆటతో పోటుగాళ్లమని చెప్పకనే చెబుతున్నారు.
ప్రస్తుత ఐపీఎల్ మొదటి 24 మ్యాచ్ ల్లో కోల్ కతా నైట్ రైడర్స్ హిట్టర్ రింకూ సింగ్, రాజస్థాన్ రాయల్స్ థండర్ బ్యాటర్ షెర్మన్ హెట్ మేయర్, బెంగళూరు బ్లాస్టర్ గ్లెన్ మాక్స్ వెల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాయి.
రింకూసింగ్ బాదుడే బాదుడు..
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ మిడిలార్డర్ ఆటగాడు రింకూసింగ్ తన వీరబాదుడు బ్యాటింగ్ తో ఒంటిచేతి విజయం అందించాడు.
లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగిన పాకెట్ డైనమైట్ రింకూ సింగ్ తన కెరియర్ లోనే అత్యుత్తమ, అసాధారణ ఇన్నింగ్స్ తో అసాధ్యాన్ని సుసాధ్య చేశాడు.
కోల్‌కతా విజయానికి ఆఖరి 5 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో.. రింకూ వీరబాదుడు విధ్వంసక బ్యాటింగ్ తో సిక్సర్ల మోత మోగించాడు.
అందిన బంతిని అందినట్లుగా బాది కేవలం 21 బంతుల్లోనే 6 సిక్సర్లు, సింగిల్ బౌండ్రీతో 48 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.
చివరి ఏడు బంతుల్లో 40 పరుగులు సాధించడం ద్వారా రింకూసింగ్.. గుజరాత్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
రింకూ సింగ్ ఎదుర్కొన్న తన చివరి ఏడు బంతుల్లో ( 6,4,6,6,6,6,6) ఆరు సిక్సర్లు, ఓ బౌండ్రీ బాదటం మరో రికార్డుగా మిగిలిపోతుంది.యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్‌లో రింకూ సునామీ సృష్టించాడు.రింకూ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టాడు.
చివరకు కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 207 పరుగులతో 3 వికెట్ల విజయం సొంతం చేసుకోగలిగింది. రింకూసింగ్ కు కోల్ కతా ఫ్రాంచైజీ సీజన్ కు 55 లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. రింకూ తన ఐపీఎల్ కెరియర్ లో ఇప్పటికే 32 బౌండ్రీలు, 22 సిక్సర్లు బాదడం ద్వారా..అత్యంత ప్రమాదకరమైన, విధ్వంసకర హిట్టర్ గా గుర్తింపు సంపాదించాడు.
హెడ్ మేర్..ప్రత్యర్థిబౌలర్లకు సింహస్వప్నం..
గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్..వేలం ద్వారా కరీబియన్ సూపర్ హిట్టర్ షెర్మన్ హెట్ మేర్ ను 9 కోట్ల 50 లక్షల రూపాయలకు దక్కించుకొంది. హెట్ మేర్
డెడ్లీ హిట్టర్ గా, సూపర్ ఫినిషర్ గా రాజస్థాన్ కు రాయల్ విజయాలు అందించడం ద్వారా పైసా వసూల్ అనుకొనేలా చేస్తున్నాడు.
గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన పోరులో హెట్ మేర్ కేవలం 26 బంతుల్లో 2 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 56 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా తనజట్టును విజేతగా నిలిపాడు.
8 కోట్ల 25 లక్షల రూపాయల ధరకు ముంబైకి ఆడుతున్న టిమ్ డేవిడ్, 3 కోట్ల రూపాయల ధరకు గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న డేవిడ్ మిల్లర్, 16 కోట్ల రూపాయల ధరకు కోల్ కతా ఫ్రాంచైజీకి ఆడుతున్న యాండీ రస్సెల్, 14 కోట్ల 25 లక్షల ధరకు బెంగళూరుకు ఆడుతున్న మ్యాక్ వెల్, 12 కోట్ల రూపాయలకు చెన్నైకి ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ తమదైన రోజున బాదుడులో తమకు తామే సాటిగా నిలిచిపోయే మొనగాళ్లు.
లీగ్ రానున్న మ్యాచ్ ల్లో వీరబాదుడు ఏ రేంజ్ కి చేరుతుందో మరి.!