Telugu Global
Sports

క్రీడలతో రాజకీయం చేయెద్దు- ఐవోసీ వార్నింగ్!

క్రీడలతో రాజకీయాలు చేసే దేశాలకు ఒలింపిక్స్ ను నిర్వహించే అవకాశమే లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పింది. పరోక్షంగా భారత్ కు సైతం హెచ్చరికలు జారీ చేసింది.

క్రీడలతో రాజకీయం చేయెద్దు- ఐవోసీ వార్నింగ్!
X

క్రీడలతో రాజకీయాలు చేసే దేశాలకు ఒలింపిక్స్ ను నిర్వహించే అవకాశమే లేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పింది. పరోక్షంగా భారత్ కు సైతం హెచ్చరికలు జారీ చేసింది...

క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. అయితే..భారత్ తో సహా ప్రపంచంలోని చాలా దేశాలు క్రీడలతో రాజకీయాలు చేస్తున్నాయి. క్రీడాసంఘాలను రాజకీయనాయకులు తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తూ లబ్దిపొందుతున్నారు. అయితే..ఈ ధోరణిని ప్రదర్శించే దేశాలపట్ల కఠినంగా వ్యవహరించాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయించింది.

ఆరునూరైనా ఒలింపిక్స్ స్ఫూర్తిని కొనసాగిస్తామని, రాజీలేని ధోరణితో వ్యవహరిస్తామని, క్రీడలతో, క్రీడాకారులతో రాజకీయాలు చేస్తామంటే ఉపేక్షించేది లేనేలేదని..ముంబై వేదికగా జరుగుతున్నఅంతర్జాతీయ ఒలింపిక్ మండలి 141వ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు.

భారత్ కు సైతం ఇది హెచ్చరికే!....

2036లో జరిగే ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని తహతహలాడుతున్న భారత్ కు సైతం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం పరోక్షంగా హెచ్చరించింది. క్రీడాకారుల హక్కులను గుర్తించాలని, వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించాలని..అలా చేయని దేశాలకు ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే అర్హత ఉండబోదని ఐవోసీ అధ్యక్షుడు థామస్ బెక్ స్పష్టం చేశారు.

భారత ఒలింపిక్ సంఘానికి అనుబంధంగా ఉన్న 40కి పైగా క్రీడాసంఘాలలో రాజకీయనాయకుల జోక్యం మితిమీరి ఉండటాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఓ కంట కనిపెడుతూనే ఉంది.

భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు, ఆయన సన్నిహితులు తమను లైంగికంగా వేధించారంటూ వినీత్ పోగట్ తో సహా పలువురు అంతర్జాతీయ మహిళావస్తాదులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొద్దివారాలపాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయాన్ని, ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని కూడా ఐవోసీ గమనంలో ఉంచుకొంది.

మహిళా అథ్లెట్ల వేధింపులపై సీరియస్...

మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించడం ఏ ఒక్క దేశానికో పరిమితమై లేదని, ఈ జాఢ్యం చాలా దేశాలకు విస్తరించడం పట్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇలాంటి ధోరణిని తాము చూస్తూ ఊరుకోబోమని, ఉక్కుపాదంతో అణచివేస్తామని ఐవోసీ సభ్యురాలు కోలిండా గ్రాబర్ కిటరోవిచ్ ప్రకటించారు. క్రీడలతో రాజకీయాలు చేయాలని చూసినా సహించేది లేదని, రాజకీయ కారణాలతో క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేయరాదని సూచించారు.

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు పాల్పడిందన్న నెపంతో ఉక్రెయిన్, రష్యా అథ్లెట్లు యూరోపియన్ గేమ్స్ లో పాల్గొనకుండా పోలాండ్ నిషేధం విధించడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే..రష్యా, బైలో రష్యా క్రీడాకారులను తటస్థ హోదాలో అనుమతిస్తామని, తమతమ జాతీయ పతకాలతో పాల్గొనటానికి అనుమతించే ప్రసక్తే లేదని వివరించారు.

ఇండోనీసియా వేదికగా జరగాల్సిన పీఫా అండర్- 20 ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలను వేరే దేశానికి కేటాయించడాన్ని గుర్తుచేశారు. తమ దేశంలో జరిగే పోటీలలో ఇజ్రేల్ క్రీడాకారులు పాల్గొనకుండా ఇండోనీసియా నిషేధం విధించిన కారణంగా ప్రపంచ ఫుట్ బాల్ పోటీలు నిర్వహించే అవకాశం చేజార్చుకోవాల్సి వచ్చింది.

తమకు అన్యాయం జరిగిందంటూ నిరసన తెలిపే హక్కు అథ్లెట్లకు ఉండితీరుతుందని, దానిని ఆమోదించని దేశాల పట్ల కఠినంగా ఐవోసీ వ్యవహరిస్తుందంటూ హెచ్చరించారు.

2036 ఒలింపిక్ రేస్ లో పోలాండ్, ఇండోనీసియా...

2036లో జరుగనున్న ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వడానికి భారత్ తో పోలాండ్, ఇండోనీసియా దేశాలు సైతం పోటీపడుతున్నాయి. ఒలింపిక్స్ నిర్వహించడం సంగతి అటుంచి, బిడ్ దరఖాస్తు కోసమే 5లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంది. పోటీలు నిర్వహించే అవకాశం దక్కకపోయినా..ఈ మొత్తం వదులుకోక తప్పదు.

ఒలింపిక్స్ క్రీడల పడుగ నిర్వహించే అవకాశం దక్కించుకోవాలని భావించే దేశాలు ఒలింపిక్స్ నియమావళిని తుచతప్పక పాటించి తీరాలని సూచించారు.

2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడాంశాలలో క్రికెట్ తో సహా కొత్తగా మరో నాలుగు క్రీడల్ని మెడల్ అంశాలలో చేర్చుతూ ఐవోసీ అనుమతి ఇచ్చింది.

First Published:  17 Oct 2023 5:47 PM IST
Next Story