నాలుగో టీ-20లో ఆవేశ్ ఖాన్ షో.. 3-1తో సిరీస్ పై భారత్ పట్టు
ఐదుమ్యాచ్ ల సిరీస్ కే కీలకంగా మారిన ఈ నాలుగో టీ-20 సమరంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్.. అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని..20 ఓవర్లలో 191 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
టీ-20 ప్రపంచకప్ సన్నాహాలలో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న టీ-20 సమరం మొదటి నాలుగు మ్యాచ్ లు ముగిసే సమయానికే భారత్ 3-1తో సిరీస్ ఖాయం చేసుకొంది. అమెరికాలోని ఫ్లోరిడా.. లాడెర్ హిల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన నాలుగో మ్యాచ్ లో భారత్ 59 పరుగుల భారీవిజయం నమోదు చేసింది.
పంత్, సంజు ఫటాఫట్!
ఐదుమ్యాచ్ ల సిరీస్ కే కీలకంగా మారిన ఈ నాలుగో టీ-20 సమరంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్.. అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని..20 ఓవర్లలో 191 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. డాషింగ్ ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- సూర్యకుమార్ యాదవ్ మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 53 పరుగుల మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ 16 బాల్స్ లో 2 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 33, సూర్యకుమార్ 14 బాల్స్ లో 24 పరుగులకు అవుటయ్యారు. వన్ డౌన్ ఆటగాడు దీపక్ హుడా 21 పరుగులకు వెనుదిరగగా.. మిడిలార్డర్ ఆటగాళ్లు రిషబ్ పంత్ 31 బాల్స్ లో 44 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ చివర్లో సంజు శాంసన్ ( 30 నాటౌట్ ), అక్షర్ పటేల్ 20 నాటౌట్ స్కోర్లు సాధించడంతో భారత్ 191 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది. కరీబియన్ బౌలర్లలో పేసర్ అల్జారీ జోసెఫ్, ఓబెడ్ మెకోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆవేశ్ ఖాన్ ఆవేశం..
192 పరుగుల భారీలక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 19.1 ఓవర్లలోనే 132 పరుగులకే కుప్పకూలింది. భారత యువఫాస్ట్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌల్ చేసి.. కరీబియన్ టాపార్డర్ పై ఒత్తిడి పెంచారు. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ 13, కీల్ మేయర్స్ 14, వన్ డౌన్ డేవన్ థామస్ 1, కెప్టెన్ నికోలస్ పూరన్ 24, మిడిలార్డర్ రోమన్ పావెల్ 24 పరుగులకు అవుటయ్యారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు, అర్షదీప్ 12 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. భారత్ 59 పరుగుల విజయంలో ప్రధానపాత్ర వహించిన పేసర్ ఆవేశ్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం వేదికగా ఆదివారం జరుగనుంది.
వరుసగా ఐదో సిరీస్ విజయం..
ప్రపంచమాజీ ఛాంపియన్ వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్ కు టీ-20ల్లో ఇది వరుసగా ఐదో సిరీస్ విజయం. అంతేకాదు కరీబియన్ జట్టు పైన 13వ సిరీస్ విజయం కావడం కూడా మరో రికార్డు. ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి టీ-20లను ట్రినిడాడ్, సెయింట్స్ కిట్స్ వేదికగా నిర్వహించారు. చివరి రెండుమ్యాచ్ లకు ఫ్లోరిడా ఆతిథ్యమిస్తోంది.