Telugu Global
Sports

టెస్టులీగ్ లో భారత్ కొంపముంచే సిరీస్!

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు రెండోర్యాంకర్ భారత్ వరుసగా రెండోసారి చేరేది లేనిది..శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ తుది ఫలితంపై ఆధారపడి ఉంది.

టెస్టులీగ్ లో భారత్ కొంపముంచే సిరీస్!
X

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు రెండోర్యాంకర్ భారత్ వరుసగా రెండోసారి చేరేది లేనిది..శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ తుది ఫలితంపై ఆధారపడి ఉంది...

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అగ్రశ్రేణిజట్ల ఐసీసీ టెస్టు లీగ్ సమరం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇండోర్ టెస్టులో భారత్ ను 9 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా..రెండో బెర్త్ కోసం రెండోర్యాంకర్ భారత్, 7వ ర్యాంకర్ శ్రీలంక పోటీపడుతున్నాయి.

ఆఖరిటెస్టులో నెగ్గితేనే భారత్ కు ఫైనల్స్ బెర్త్...

రెండోర్యాంకర్ భారత్ ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్ కు వరుసగా రెండోసారి చేరాలంటే..బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ను 3-1తో నెగ్గితీరాల్సి ఉంది. సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ ల్లో 2-1తో పైచేయి సాధించిన భారత్..ఇండోర్ వేదికగా ముగిసిన మూడోటెస్టులో 9 వికెట్ల ఓటమితో ఫైనల్ బెర్త్ ను క్లిష్టంగా మార్చుకొంది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు నేరుగా ఫైనల్స్ చేరాలంటే..అహ్మదాబాద్ వేదిక మార్చి 9 నుంచి జరిగే ఆఖరిటెస్టులో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

ఒకవేళ టెస్టులో భారత్ ఓడితే ఫైనల్ బెర్త్ అవకాశాలను చేజార్చుకొన్నట్లే అవుతుంది. అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసే పక్షంలో...5వ ర్యాంకర్ న్యూజిలాండ్- 7వ ర్యాంకర్ శ్రీలంకజట్ల రెండుమ్యాచ్ ల సిరీస్ తుది ఫలితం పై భారత్ ఫైనల్ చేరేది లేనిది ఆధారపడి ఉంది.

శ్రీలంకకు న్యూజిలాండ్ గండం...

టెస్టు లీగ్ ఫైనల్ కు చేరే అవకాశం భారత్ తర్వాత శ్రీలంకకే ఎక్కువగా ఉంది. కివీ గడ్డపై న్యూజిలాండ్ తో ఈనెల 13న ప్రారంభంకానున్న రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో గెలుచుకోగలిగితే శ్రీలంక నేరుగా ప్రపంచ లీగ్ ఫైనల్ చేరే అవకాశం ఉంది.

ఒకవేళ్ల సిరీస్ లో శ్రీలంక 2-0తో ఓడినా, 1-1తో డ్రాగా ముగించినా..భారత్ ఫైనల్స్ కు చేరుకోగలుగుతుంది. బోర్డర్ - గవాస్కర్ సిరీస్ మూడోటెస్టు ముగిసే నాటికి..

ఐసీసీ టెస్టు లీగ్ టేబుల్ పాయింట్ల పట్టికలో అత్యుత్తమ విజయం శాతం నమోదు చేసిన మొదటి మూడుజట్లలో ఆస్ట్ర్రేలియా, భారత్, శ్రీలంక నిలిచాయి.

కివీగడ్డపై శ్రీలంకకు అంతతేలికకాదు....

భారత్ ను అధిగమించడం ద్వారా శ్రీలంక టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే స్వింగ్, సీమ్ బౌలర్ల అడ్డా కివీగడ్డపై న్యూజిలాండ్ ను 2-0తో ఓడించి తీరాల్సి ఉంది.

అయితే..న్యూజిలాండ్ ను న్యూజిలాండ్ గడ్డపై ఓడించి టెస్టు సిరీస్ నెగ్గడం ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, భారత్ లాంటి హేమాహేమీజట్లకే సాధ్యం కావడం లేదు.

ఇంగ్లండ్ తో ఇటీవలే ముగిసిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను కివీజట్టు 1-1తో డ్రాగా ముగించడం ద్వారా తిరిగి పుంజుకోగలిగింది.

వెలింగ్టన్ వేదికగా పవర్ ఫుల్ ఇంగ్లండ్ తో ముగిసిన కీలక రెండోటెస్టులో ఒక్క పరుగు తేడాతో నెగ్గడం ద్వారా న్యూజిలాండ్ గతవారమే సంచలనం సృష్టించింది.

వరుసగా ఏడుమ్యాచ్ ల విరామం తర్వాత న్యూజిలాండ్ తొలివిజయం సాధించడం ద్వారా..శ్రీలంకతో సిరీస్ కు సిద్ధమయ్యింది.

19 టెస్టుల్లో రెండే విజయాలు...

కివీగడ్డపై ఇప్పటి వరకూ ఆడిన 19 టెస్టుల్లో శ్రీలంకకు రెండంటే రెండుమాత్రమే విజయాలున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే మినహా..న్యూజిలాండ్ ను రెండుమ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఓడించడం శ్రీలంకకు సాధ్యపడక పోవచ్చు.

ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్ ల్లో బంగ్లాదేశ్ ను 1-0తో ఓడించిన శ్రీలంక..పాకిస్థాన్, ఆస్ట్ర్ర్రేలియా జట్లతో రెండుమ్యాచ్ ల సిరీస్ లను 1-1తో డ్రాగా ముగించడం ద్వారా..

టెస్టు లీగ్ ఫైనల్స్ బెర్త్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది.

దిముత్ కరుణరత్నే నాయకత్వంలోని శ్రీలంకజట్టు...రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టును ఈనెల 9 నుంచి 13 వరకూ క్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ వేదికగా జరుగనుంది.

మార్చి 17 నుంచి వెలింగ్టన్ బేసిన్ రిజర్వ్ పార్క్ వేదికగా జరుగనుంది.

ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జూన్ నెలలో జరుగనున్న టెస్టు లీగ్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియాతో తలపడే జట్టు ఏదో..బోర్డ్రర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆఖరి టెస్టు ఫలితంతో తేలిపోనుంది.

First Published:  7 March 2023 12:29 PM IST
Next Story