Telugu Global
Sports

పాండ్యా అవుట్, ప్రపంచకప్ జట్టులో ప్రసిద్ధ కృష్ణ...

ఐసీసీ వన్డే ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టిదెబ్బ తగిలింది. కీలక ఆల్ రౌండర్ కమ్ వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు.

పాండ్యా అవుట్, ప్రపంచకప్ జట్టులో ప్రసిద్ధ కృష్ణ...
X

ఐసీసీ వన్డే ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టిదెబ్బ తగిలింది. కీలక ఆల్ రౌండర్ కమ్ వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు...

భారత టీమ్ మేనేజ్ మెంట్ భయపడినంతా జరిగింది. జట్టుకే వెన్నెముకలాంటి ఆల్ రౌండర్ కమ్ వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా గాయంతో టోర్నమెంట్ కే దూరమయ్యాడు.

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ పాండ్యా కుడికాలి మడమకు గాయమయ్యింది. దీంతో జట్టుకు దూరమై బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.

ప్రపంచకప్ కే పాండ్యా దూరం!

గాయంతో చికిత్స పొందుతున్న హార్థిక్ పాండ్యా పూర్తిగా కోలుకోడానికి కొద్దివారాలు సమయం పట్టే అవకాశం ఉండడంతో వైద్యుల సలహా మేరకు జట్టు నుంచి వైదొలిగాడు.

పాండ్యా స్థానంలో యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణకు తుదిజట్టులో చోటు కల్పించినట్లు టీమ్ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించారు.

పాండ్యా లాంటి కీలక ఆల్ రౌండర్ సెమీఫైనల్స్ కు ముందే జట్టుకు దూరం కావడం బాధాకరమని, అయితే..గాయాలు ఆటలో భాగమని, మనం చేయగలిగింది ఏమీలేదని మీడియా సమావేశంలో ద్రావిడ్ చెప్పాడు.



పాండ్యాకు గాయం..సూర్యాకు వరం...

భారత వైస్ కెప్టెన్ గా ఉన్న పాండ్యా జట్టు నుంచి వైదొలగడంతో భారతజట్టులో సమతూకం పూర్తిగా దెబ్బతింది. అదనపు పేసర్ గా, అదనపు బ్యాటర్ గా భారతజట్టుకు కొండంత అండగా నిలుస్తూ వచ్చిన పాండ్యా తప్పుకోడంతో భారత్ తన తుదిజట్టులోకి అదనపు బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఆడిస్తూ ..ఐదుగురు బౌలర్లతోనే లోటును పూడ్చుకోడానికి ప్రయత్నిస్తోంది.

న్యూజిలాండ్ తో జరిగిన 5వ రౌండ్ మ్యాచ్ వరకూ ఆరుగురు బౌలర్లతో ఆడుతూ వచ్చిన భారత్..ఆ తర్వాతి రెండుమ్యాచ్ ల్లో సూర్యకుమార్ ను అదనపు బ్యాటర్ గా తీసుకొని..ఐదుగురు బౌలర్లతోనే నెట్టుకొంటూ వస్తోంది.

బ్యాకప్ బౌలర్ గా ప్రసిద్ధ కృష్ణ..

మొత్తం 15 మంది సభ్యుల భారతజట్టు నుంచి హార్థిక్ పాండ్యా వైదొలగడంతో యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణకు బ్యాకప్ బౌలర్ గా చోటు కల్పించినట్లు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.

ప్రస్తుతం భారతజట్టులో బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్, బ్యాకప్ స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్, బ్యాకప్ మిడిలార్డర్ బ్యాటర్ గా సూర్యకుమార్ , బ్యాకప్ పేస్ ఆల్ రౌండర్ గా శార్థూల్ ఠాకూర్ ఉన్నారు. ఇప్పుడు పాండ్యా స్థానంలో బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ గా ప్రసిద్ధ కృష్ణను తుదిజట్టులోకి తీసుకోవాల్సి వచ్చిందని చీఫ్ కోచ్ ద్రావిడ్ వివరించారు.

బౌలర్ గా పాండ్యా లేని లోటును ఐదుగురు బౌలర్లే పూడ్చక తప్పదని, బ్యాటర్ గా పాండ్యా లేని లోటును మాత్రం అదనపు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో పూడ్చుకోగలుగుతున్నామని భారత కోచ్ తెలిపారు.

భారతజట్టులో ఇప్పటికే షమీ, సిరాజ్, బుమ్రాల రూపంలో ముగ్గురు మెరుపు ఫాస్ట్ బౌలర్లతో పాటు మీడియం పేస్ ‌ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ సైతం ఉన్నారు. ఇప్పుడు అదనంగా మరో సూపర్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణను తుదిజట్టులో చేర్చుకొన్నారు.

మెరుపు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ...

28 సంవత్సరాల ప్రసిద్ధ కృష్ణకు మెరుపు ఫాస్ట్ బౌలర్ గా పేరుంది. గంటకు 145 కిలోమీటర్ల సగటు వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ప్రసిద్ధ కృష్ణకు భారత్ తరపున 17 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. 5.60 ఎకానమీతో అత్యుత్తమంగా 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన ఘనత సైతం ఉంది.

చివరి సారిగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో పాల్గొన్నాడు.

First Published:  5 Nov 2023 11:20 AM IST
Next Story