వన్డే క్రికెట్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు!
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలను భారత్ జోరుగా మొదలు పెట్టింది. 8వ ర్యాంకర్ శ్రీలంకతో జరిగిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ తో పాటు ప్రపంచ రికార్డు విజయంతో ముగించింది.
వన్డే క్రికెట్లో మాజీ చాంపియన్ భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో రికార్డుల మోత మోగించింది. ప్రపంచకప్ సన్నాహాలను సిరీస్ విజయంతో మొదలు పెట్టింది...
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలను భారత్ జోరుగా మొదలు పెట్టింది. 8వ ర్యాంకర్ శ్రీలంకతో జరిగిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ తో పాటు ప్రపంచ రికార్డు విజయంతో ముగించింది.
తిరు..వనంత ..రికార్డులు...
తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఆఖరివన్డేలో భారత్ 317 పరుగుల విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయంగా రికార్డుల్లో చేరింది.
భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 97 బాల్స్ లో 116 పరుగులు, సెంచరీల కింగ్ విరాట్ కొహ్లీ 110 బాల్స్ లో 166 నాటౌట్ స్కోర్లు సాధించడంతో భారత్ 50 ఓవర్లలో 390 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
సమాధానంగా 393 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకొంది. విరాట్ కొహ్లీ తన కెరియర్ లో 46వ వన్డే సెంచరీ సాధించగా..యువఓపెనర్ శుభ్ మన్ గిల్ కు ఇది రెండో శతకం మాత్రమే.
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కొహ్లీకి ఇది 74వ శతకం కాగా..శ్రీలంక ప్రత్యర్థిగా 11వ సెంచరీ. ఇప్పటి వరకూ మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న జంట రికార్డులను విరాట్ కేవలం ఒకే ఒక్క సెంచరీతో తెరమరుగు చేశాడు.
స్వదేశీగడ్డపై అత్యధికంగా 21 శతకాలు బాదడం ద్వారా సచిన్ పేరుతో గత కొద్ది సంవత్సరాలుగా ఉన్న రికార్డును విరాట్ అధిగమించాడు. అంతేకాదు శ్రీలంక ప్రత్యర్థిగా అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును సైతం అధిగమించాడు.
సచిన్ 452 ఇన్నింగ్స్ లో 49 శతకాలు సాధించగా..కొహ్లీ కేవలం 259 ఇన్నింగ్స్ లోనే 46 సెంచరీలు బాది..సచిన్ రికార్డుకు మూడు సెంచరీల దూరంలో నిలిచాడు.
భారత్ సరికొత్త రికార్డు...
2010 తర్వాత నుంచి స్వదేశంలో జరిగిన సిరీస్ ల్లో భారత్ రికార్డు విజయం సాధించింది. సొంతగడ్డపై తనకు ఎదురేలేదని కొత్తసంవత్సరంలో సైతం చాటుకోగలిగింది.
ప్రస్తుత సిరీస్ లోని కోల్ కతా వన్డే వరకూ శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన మ్యాచ్ ల్లో భారత్ కు 95 విజయాలు, 57 పరాజయాల రికార్డు ఉంది.
స్వదేశీగడ్డపై శ్రీలంకతో ఆడిన 53 వన్డేల్లో భారత్ కు 75 శాతం విజయాల రికార్డు ఉంది. 38 విజయాలు, 12 పరాజయాల రికార్డుతో ఉంది. మరో మూడుమ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.
2007 నుంచి 2021 మధ్యకాలంలో శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన ద్వైపాక్షిక సిరీస్ ల్లో 10సార్లు భారత్ విజేతగా నిలిచింది.1998 నుంచి శ్రీలంక చేతిలో భారత్ కు ఒక్క ఓటమి లేకపోడం విశేషం.
2021 నుంచి స్వదేశీగడ్డపై భారత్ ఆడిన మొత్తం 12 వన్డేలలో 10 విజయాల రికార్డుతో ఉంది. అదే శ్రీలంక మాత్రం 28 వన్డేలు ఆడి..ఇంటా, బయటా 16 పరాజయాలు చవిచూసింది.
పరాజయాలలో శ్రీలంక ప్రపంచ రికార్డు..
క్రికెట్ చరిత్రలో అత్యధిక పరాజయాలు పొందినజట్టుగా, అత్యధిక తేడాతో ఓటమి పొందినజట్టుగా శ్రీలంక జంట రికార్డును మూటగట్టుకొంది. అత్యధికంగా 317 పరుగుల భారీ ఓటమితో పాటు.. ఇప్పటి వరకూ 4వ ర్యాంకర్ భారత్ పేరుతో ఉన్న436 మ్యాచ్ ల రికార్డును శ్రీలంక అధిగమించింది. కోల్ కతా వేదికగా ముగిసిన రెండోవన్డేలో 4 వికెట్ల పరాజయంతో శ్రీలంక ఓటమిల సంఖ్య 437కు చేరింది. ఆఖరి వన్డే పరాజయంతో అత్యధికంగా 438పరాజయాలు చవిచూసిన తొలిజట్టుగా శ్రీలంక నిలిచింది.
టీ-20లలో సైతం శ్రీలంకకు 94 పరాజయాలు ఉన్నాయి. శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ అత్యధికంగా 96 విజయాలు సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా పేరుతో ఉన్న రికార్డును భారత్ అథిగమించగలిగింది.
శ్రీలంకతో ముగిసిన ప్రస్తుత ఈ సిరీస్ లో విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.