అరుదైన రికార్డు వైపు బుమ్రా చూపు!
భారత మెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఐర్లాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా బుమ్రా ఈ ఘనతను సొంతం చేసుకోనున్నాడు.
భారత మెరుపు ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఐర్లాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా బుమ్రా ఈ ఘనతను సొంతం చేసుకోనున్నాడు...
భారత ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా రీ-ఎంట్రీ సిరీస్ ద్వారా ఓ అరుదైన రికార్డుకు సిద్ధమయ్యాడు. వెన్నెమొక గాయంతో గత కొద్దిమాసాలుగా జట్టు దూరమై..శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకొని నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో అందుబాటులోకి రావడంతోనే సెలెక్టర్లు గట్టి బాధ్యతను అప్పజెప్పారు.
కెప్టెన్, వైస్ కెప్టెన్ల విశ్రాంతితో...
ఐర్లాండ్ తో డబ్లిన్ వేదికగా ఆగస్టు 18 నుంచి జరుగనున్న తీన్మార్ టీ-20 సిరీస్ లోని భారత యువజట్టుకు జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.
రొటేషన్ పాలసీలో భాగంగా భారత టీ-20 కెప్టెన్ హార్థిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లకు విశ్రాంతినిచ్చారు. దీంతో రీఎంట్రీకి సిద్ధమైన బుమ్రా చేతికి జట్టు పగ్గాలను ఎంపిక సంఘం అప్పజెప్పింది.
భారత 11వ కెప్టెన్ గా జస్ ప్రీత్ బుమ్రా...
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత 11వ కెప్టెన్ గా జస్ ప్రీత్ బుమ్రా రికార్డుల్లో చేరనున్నాడు. ఐర్లాండ్ తో సిరీస్ లో భాగంగా డబ్లిన్ విలేజ్ గ్రౌండ్స్ వేదికగా ఐర్లాండ్ తో శుక్రవారం జరిగే తొలి టీ-20 మ్యాచ్ లో భారత్ కు నాయకత్వం వహించడం ద్వారా బుమ్రా అరుదైన ఘనతను దక్కించుకోబోతున్నాడు.
భారత టీ-20 జట్టుకు ఇంతకుముందు వరకూ నాయకత్వం వహించిన మొత్తం 10 మంది కెప్టెన్లలో తొమ్మిదిమంది బ్యాటర్లు, ఓ ఆల్ రౌండర్ ఉన్నారు. అయితే..భారతజట్టు పగ్గాలు చేపట్టిన తొలి బౌలర్ ఘనతను జస్ ప్రీత్ బుమ్రా మాత్రమే దక్కించుకోబోతున్నాడు.
వీరూ నుంచి బుమ్రా వరకూ....
భారత టీ-20 చరిత్రలో తొలి కెప్టెన్ గా వ్యవహరించిన ఘనత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు మాత్రమే దక్కుతుంది. ఆ తర్వాత 2007 టీ-20 ప్రపంచకప్ నుంచి 2016 వరకూ భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించాడు.
సురేశ్ రైనా, అజింక్యా రహానే స్టాండిన్ కెప్టెన్లుగా కొద్దిమ్యాచ్ లకు నాయకత్వం వహించారు.
2017 నుంచి 2021 టీ-20 ప్రపంచకప్ వరకూ భారతజట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ గా విరాట్ కొహ్లీ వ్యవహరించాడు. కొహ్లీకి విశ్రాంతినిచ్చిన సమయంలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లతో పాటు రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ సైతం భారతజట్టుకు కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.
గత టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తే..ఆ తర్వాత నుంచి హార్ధిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించారు. అప్పుడు కపిల్ , కుంబ్లే..ఇప్పుడు బుమ్రా...
గతంలో భారత వన్డే జట్టుకు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్, టెస్టుజట్టుకు స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అనిల్ కుంబ్లే నాయకత్వం వహిస్తే..ప్రస్తుత టీ-20 సిరీస్ ద్వారా అసలుసిసలు బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు.
ఐర్లాండ్ తో తీన్మార్ సిరీస్ లో బుమ్రా నాయకత్వం వహిస్తుంటే..ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ వైస్ కెప్టెన్ కానున్నాడు. ఆసియాక్రీడల్లో పాల్గొనే భారతజట్టుకు రితురాజ్ గయక్వాడ్ ను కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసింది.
ఐర్లాండ్ తో సిరీస్ ద్వారా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ అంతర్జాతీయ టీ-20 అరంగేట్రం చేయబోతున్నాడు.