భారత పిల్లగ్రాండ్ మాస్టర్ సరికొత్త చరిత్ర!
భారత పిల్లగ్రాండ్ మాస్టర్ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల వయసులో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
భారత పిల్లగ్రాండ్ మాస్టర్ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల వయసులో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
17 సంవత్సరాల వయసులో..తనకంటే రెట్టింపు వయసు, అపారఅనుభవం ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, అజర్ బైజాన్ గ్రాండ్మాస్టర్లను ఎదుర్కొని ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ సాధించడం అంటే మాటలా మరి. అలాంటి అరుదైన ఘనతను భారత టీనేజ్ సంచలనం గుకేశ్ సాధించాడు.
ప్రపంచ రికార్డుతో టైటిల్....
కెనడాలోని టొరాంటో వేదికగా గత రెండువారాలుగా..14 రౌండ్లుగా..ప్రపంచ మేటి ఎనిమిదిమంది గ్రాండ్ మాస్టర్ల నడుమ జరిగిన 2024- ప్రపంచ క్యాండిడేట్స్ చదరంగ సమరంలో గుకేశ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత చిన్నవయసులో ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్ గా చరిత్ర సృష్టించాడు.
అమెరికన్ గ్రాండ్ మాస్టర్ల జోడీ ఫేబియన్ కరూనా, హికారు నకామురా, రష్యన్ సూపర్ గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమినిచ్, ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరోజా,
అజర్ బైజాన్ గ్రాండ్ మాస్టర్ అబ్సోవ్ లతో పాటు భారతజోడీ విదిత్ సంతోశ్ గుజరాతీ, ప్రజ్ఞానంద్ లతో తలపడిన గుకేశ్ వయసుకు మించిన పరిణతి ప్రదర్శించాడు.
ఎత్తుల యుద్దంలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అసలు సిసలు విజేత తానేనని చాటుకొన్నాడు.
14వ రౌండ్ డ్రాతో విజేతగా...
కీలక 13వ రౌండ్ లో విజయం సాధించడంతోనే గుకేశ్ 8.5 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచాడు. కీలక ఆఖరి, 14వ రౌండ్ గేమ్ లో హికారు నకామురాను నిలువరించడం ద్వారా గుకేశ్ విజేతగా అవతరించాడు.
మొత్తం 14 రౌండ్లలో 9 పాయింట్లు సాధించడం ద్వారా చాలెంజర్ టైటిల్ అందుకొన్నాడు. 2025 ప్రపంచ చదరంగ టైటిల్ కోసం జరిగే పోరులో ప్రస్తుత చాంపియన్ డింగ్ లీరెన్ తో తలపడటానికి గుకేశ్ అర్హత సంపాదించాడు.
2014లో ఆనంద్- 2024లో గుకేశ్..
ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 2014లో ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టైటిల్ నెగ్గిన పదేళ్ల తరువాత గుకేశ్ అదే ఘనతను సాధించగలిగాడు.
టాప్ సీడ్ ఫేబియానో కరూనా- రష్యన్ గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమినిచ్ ల ఆఖరి రౌండ్ గేమ్ డ్రాగా ముగియడం, నకామురాతో పోరును గుకేశ్ డ్రాగా ముగించడంతోనే ఫలితం తేలిపోయింది.
12 సంవత్సరాల చిరుప్రాయంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన చెన్నై చిన్నోడు గుకేశ్ ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ నెగ్గడం ద్వారా ప్రపంచ రికార్డుతో సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు..2025 ప్రపంచ చెస్ టైటిల్ గెలుచుకొనే అవకాశాన్ని సంపాదించాడు.
గుకేశ్ సాధించిన ఈ ఆపురూప విజయం చూసి భారత చదరంగ అభిమానులు మురిసిపోతున్నారు. సందేశాలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.