Telugu Global
Sports

అప్ఘన్ తో నేడు భారత్ 'గోల్డ్ మెడల్ 'ఫైట్!

ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల గోల్డ్ మెడల్ ఫైట్ కు భారత్, అఫ్ఘనిస్థాన్ సై అంట సై అంటున్నాయి. పింగ్ ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా ఈరోజు జరిగే ఫైనల్లో తలపడనున్నాయి.

అప్ఘన్ తో నేడు భారత్ గోల్డ్ మెడల్ ఫైట్!
X

ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల గోల్డ్ మెడల్ ఫైట్ కు భారత్, అఫ్ఘనిస్థాన్ సై అంట సై అంటున్నాయి. పింగ్ ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా ఈరోజు జరిగే ఫైనల్లో తలపడనున్నాయి.....

హాంగ్జు ఆసియాక్రీడల క్రికెట్లో రెండో స్వర్ణానికి భారత్ ఉరకలేస్తోంది. మహిళల విభాగంలో ఇప్పటికే బంగారు పతకం సొంతం చేసుకొన్న భారత్ పురుషుల విభాగంలో సైతం గోల్డ్ మెడల్ కు గురిపెట్టింది. సంచలనాల అప్ఘనిస్థాన్ తో టైటిల్ సమరంలో భారత్ ఈరోజు అమీతుమీ తేల్చుకోనుంది.

10 ఓవర్లలోనే భారత్ సెమీస్ విజయం...

పింగ్ ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ కు బంగ్లాదేశ్ ఏమాత్రం సమఉజ్జీ కాలేకపోయింది.20 ఓవర్ల ఈ నాకౌట్ పోరులో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్...బంగ్లాదేశ్ ను 9 వికెట్లకు 96 పరుగుల స్కోరుకే పరిమితం చేసింది.

భారత లెఫ్టామ్ స్పిన్నర్ సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బతీశాడు. బంగ్లా బ్యాటర్లలో జాకర్ అలీ ఒక్కడే పోరాడి ఆడి 24 పరుగుల స్కోరుతో నాటౌట్ గా మిగిలాడు. లోయర్ ఆర్డర్ ఆటగాడు రకీబుల్ హసన్ 14 పరుగులు సాధించాడు.

తిలక్ వర్మ ధూమ్ ధామ్ బ్యాటింగ్...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 97 పరుగులు చేయాల్సిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే డాషింగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వికెట్ నష్టపోయినా..కెప్టెన్ కమ్ ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్, వన్ డౌన్ తిలక్ వర్మల ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో కేవలం 10 ఓవర్లలోనే 9 వికెట్ల విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

రుతురాజ్ గయక్వాడ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40, తిలక్ వర్మ 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించారు.

క్వార్టర్ ఫైనల్లో నేపాల్ ను 23 పరుగులతో ఓడించిన భారత్ కేవలం 9.2 ఓవర్లలోనే బంగ్లాదేశ్ ను మట్టికరిపించడం ద్వారా తొలిసారిగా ఆసియాక్రీడల క్రికెట్ ఫైనల్ కు చేరుకోగలిగింది.

పాకిస్థాన్ కు అఫ్ఘనిస్థాన్ షాక్...

నువ్వానేనా అన్నట్లుగా సాగిన రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్ పై 4 వికెట్లతో అఫ్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించడం ద్వారా గోల్డ్ మెడల్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ను 18 ఓవర్లలో 115 పరుగుల స్కోరుకే అఫ్ఘన్ బౌలర్లు కుప్పకూల్చగలిగారు. ఓపెనర్ ఓమెయిర్ యూసుఫ్ 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టాడు. సమాధానంగా 116 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన అప్ఘన్ జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టానికి సాధించగలిగింది.

కెప్టెన్ గుల్బదీన్ నైబ్ కీలక ఇన్నింగ్స్ తో అఫ్ఘనిస్థాన్ ను విజేతగా నిలిపాడు.

ఈరోజు జరిగే బంగారు పతకం పోరులో భారత్ కు అఫ్ఘనిస్థాన్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 11-30 గంటలకు ఫైనల్స్ ప్రారంభంకానుంది.

First Published:  7 Oct 2023 3:09 AM GMT
Next Story