Telugu Global
Sports

కామన్వెల్త్‌లో భారత్‌కు తొలి పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ గెలిచిన సాగర్

సంకేత్ 139 కేజీల బరువు ఎత్తడంలో విఫలం అయ్యాడు. రెండు సార్లు కూడా మోచేతి వద్ద గాయం అయి బరువు ఎత్తలేక బాధపడ్డాడు. దీంతో మొత్తం 248 కేజీలకు పరిమితం అయ్యాడు.

కామన్వెల్త్‌లో భారత్‌కు తొలి పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ గెలిచిన సాగర్
X

భారత వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సాగర్ తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా శనివారం 55 కేజీల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. భారత్‌కు చెందిన సంకేత్ సాగర్, మలేషియాకు చెందిన మహ్మద్ అనీఖ్, శ్రీలంకకు చెందిన ఇసురు కుమార యోదాగే మధ్య మొదటి నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నది.

స్నాచ్ రౌండ్‌లో సంకేత్ వరుసగా 107, 111, 113 కేజీలు ఎత్తాడు. అయితే మలేషియాకు చెందిన మహ్మద్ అనీఖ్ మాత్రం 107 కేజీలు ఎత్తిన తర్వాత మిగిలిన రెండు అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యాడు. కుమార యోదాగే రెండో అటెంప్ట్‌లో 105 కిలోలో ఎత్తాడు. దీంతో స్నాచ్ రౌండ్ ముగిసే సరికి భారత్‌కు చెందిన సంకేత్ సాగర్ లీడర్ బోర్డు పొజిషన్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

ఇక క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో తొలి అటెంప్ట్‌లో సంకేత్ 135 కేజీలు, మహ్మద్ అనీఖ్ 138 కేజీలు, కుమార యోదాగే 120 కేజీలు ఎత్తి తమ పొజిషన్లు కాపాడుకున్నారు. యోదాగే తర్వాత రెండు అటెంప్ట్స్‌లో ఫెయిల్ అయ్యి మొత్తం 225 కేజీలకు పరిమితం అయ్యాడు. సంకేత్ 139 కేజీల బరువు ఎత్తడంలో విఫలం అయ్యాడు. రెండు సార్లు కూడా మోచేతి వద్ద గాయం అయి బరువు ఎత్తలేక బాధపడ్డాడు. దీంతో మొత్తం 248 కేజీలకు పరిమితం అయ్యాడు. స్వర్ణం గెలవాలంటే మహ్మద్ అనీఖ్ 142 కేజీలు ఎత్తాల్సి ఉన్నది. అయితే తొలి అటెంప్ట్ మిస్ అవడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు. కానీ చివరి అటెంప్ట్‌లో మాత్రం 142 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తం 249 కేజీలతో మలేషియాకు స్వర్ణ పతకం సాధించిపెట్టాడు.

భారత యువ లిఫ్టర్ సంకేత్ చివరకు సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోగా.. శ్రీలంకకు చెందిన ఇసురు కుమార యోదాగే రజత పతకం గెలిచాడు. కామన్వెల్త్ 2022లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

First Published:  30 July 2022 11:16 AM GMT
Next Story