ప్రపంచకప్ హాకీలో నేడు భారత్ తొలిసమరం!
2023 హాకీ ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ ఆతిథ్య దేశం హోదాలో గురిపెట్టింది.
2023 హాకీ ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ ఆతిథ్య దేశం హోదాలో గురిపెట్టింది. గ్రూప్ లీగ్ లో ఈరోజు జరిగే తొలిపోరులో స్పెయిన్ తో భారత్ తలపడనుంది.
15వ హాకీ ప్రపంచకప్ హంగామాకు భారత్ వేదికగా నిలిచింది. భువనేశ్వర్, రూర్కెలా వేదికగా వచ్చే రెండువారాలపాటు జరిగే నాలుగు గ్రూపులు, 16 జట్ల ఈ సమరంలో
భారత్ 47 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి ప్రపంచకప్ అందుకోవాలని ఉబలాట పడుతోంది.
చివరిసారిగా 1975 హాకీ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత నుంచి గత నాలుగున్నర దశాబ్దాలుగా మరో టైటిల్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.
14 టోర్నీల్లో భారత్ కు 3 పతకాలు
ఒలింపిక్స్ హాకీలో అత్యధిక బంగారు పతకాలు సాధించిన భారత్ కు ప్రపంచకప్ లో మాత్రం అంతేస్థాయిలో విజయాలు దక్కలేదు. 1971 నుంచి ప్రపంచకప్ హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. భారత్ మాత్రం ప్రారంభ ప్రపంచకప్ లో కాంస్య పతకం, 1973 ప్రపంచకప్ లో రజత పతకంతో సరిపెట్టుకొంది. అయితే 1975 ప్రపంచకప్ లో మాత్రం అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలో భారత్ బంగారు పతకం అందుకోగలిగింది.
ఆ తర్వాత 1978 నుంచి 2018 వరకూ జరిగిన 11 ప్రపంచకప్ టోర్నీల్లోనూ..భారత్ కు పరాజయాలే ఎదురయ్యాయి.
భారత్ అరుదైన రికార్డు...
1971 నుంచి 2023 వరకూ.. మొత్తం 15 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న ఘనతను భారత్ తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ జట్లు మాత్రమే దక్కించుకోగలిగాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం..ఇప్పటి వరకూ 26 దేశాలజట్లే ప్రపంచకప్ బరిలో నిలువగలిగాయి.
1978 ప్రపంచకప్ లో ఆరో స్థానానికి పడిపోయిన భారత్..1982లో ఐదు, 1986 ప్రపంచకప్ లో 12 స్థానాలకే పరిమితమయ్యింది. 1990 ప్రపంచకప్ లో 10వ స్థానం సంపాదించిన భారత్..1994 ప్రపంచకప్ లో పుంజుకొని 5వ స్థానానికి ఎగబాక గలిగింది.
1998 ప్రపంచకప్ లో నాలుగు, 2002 ప్రపంచకప్ లో 10, 2006 ప్రపంచకప్ లో 11 స్థానాలు సాధించిన భారత హాకీ...2010 టోర్నీలో ఎనిమిది, 2014 ప్రపంచకప్ లో 9 స్థానాలలో నిలువగలిగింది.2018 ప్రపంచకప్ లో 5వ స్థానం సంపాదించింది.
పూల్-డీ లీగ్ లో భారత్ పోటీ...
ఈ రోజు ప్రారంభం కానున్న ప్రస్తుత 15వ ప్రపంచకప్ గ్రూప్- డీ లీగ్ లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్ జట్లతో భారత్ పోటీపడుతోంది.
మిడ్ ఫీల్డర్ మన్ దీప్ సింగ్ నాయకత్వంలోని 18 మంది సభ్యుల భారతజట్టు మరోసారి తన అదృష్టం పరీక్షించుకొంటోంది.
ఈరోజు రూర్కెలా వేదికగా జరిగే గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో స్పెయిన్ తో భారత్ తలపడుతోంది.మిగిలిన రెండురౌండ్లలో ఇంగ్లండ్, వేల్స్ జట్లతో తలపడాల్సి ఉంది.
ప్రపంచకప్ లో తలపడుతున్న జట్లలో ఆస్ట్ర్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ, ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్, ఆతిథ్యదేశం హోదాలో భారత్ ఉన్నాయి.
తొలిసారిగా రెండు నగరాలలో...
ప్రపంచకప్ హాకీ పోటీలకు భారత్ రికార్డుస్థాయిలో నాలుగోసారి ఆతిథ్యమిస్తోంది. 1982 ప్రపంచకప్ ను తొలిసారిగా ముంబై వేదికగా నిర్వహిస్తే..ఆ తర్వాత 2010, 2018 టోర్నీలకు సైతం ఆతిథ్యమిచ్చింది.
గత ( 2018 ) ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన ఒడిషా హాకీ సంఘమే ప్రస్తుత 2023 ప్రపంచకప్ కు సైతం వేదికగా నిలిచింది.హాకీ ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా
రెండు నగరాలు ( భువనేశ్వర్, రూర్కెలా ) వేదికలుగా పోటీలు నిర్వహిస్తున్నారు.
రూర్కెలాలోని బిర్సాముండా స్టేడియం వేదికగా 20 మ్యాచ్ లు, భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 25 మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. జనవరి 27న సెమీఫైనల్స్, 29న కాంస్య పతకంతో పాటు బంగారు పతకం పోటీలు జరుగుతాయి.
ప్రపంచ 6వ ర్యాంకర్ భారతజట్టు టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన కాంస్య పతకం జోరునే ప్రస్తుత ప్రపంచకప్ లో కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. నలుగురు పెనాల్టీకార్నర్ స్పెషలిస్ట్ లతో సమరానికి సిద్ధమయ్యింది.
భారతజట్టు విశ్వవిజేతగా నిలిస్తే..జట్టులోని ఒక్కో సభ్యుడికి కోటిరూపాయలు నజరానాగా ఇస్తామని ఒడిషా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఈరోజు నుంచి జనవరి 29 వరకూ జరిగే గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ ప్రపంచకప్ పోటీలు విశ్వహాకీ అభిమానులకు పండుగే కానుంది.