Telugu Global
Sports

ఆసియాక్రీడల క్రికెట్లో భారత్ 'బంగారు' వేట!

ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల విభాగంలో భారత్ ద్వితీయశ్రేణిజట్టుతో బంగారు పతకం వేట మొదలుపెట్టింది. పసికూన నేపాల్ తో క్వార్టర్ ఫైనల్స్ పోరులో హాట్ ఫేవరెట్ గా పోటీలో నిలిచింది.

ఆసియాక్రీడల క్రికెట్లో భారత్ బంగారు వేట!
X

ఆసియాక్రీడల క్రికెట్ పురుషుల విభాగంలో భారత్ ద్వితీయశ్రేణిజట్టుతో బంగారు పతకం వేట మొదలుపెట్టింది. పసికూన నేపాల్ తో క్వార్టర్ ఫైనల్స్ పోరులో హాట్ ఫేవరెట్ గా పోటీలో నిలిచింది.

చైనా వేదికగా జరుగుతున్న హాంగ్జు ఆసియాక్రీడల క్రికెట్ మహిళల విభాగంలో ఇప్పటికే బంగారు పతకం సాధించిన భారత్..పురుషుల విభాగంలో సైతం విజేతగా నిలవడం ద్వారా 'గోల్డెన్ డబుల్' సాధించాలన్న పట్టుదలతో ఉంది.

9 ఏళ్ల తర్వాత ఏషియాడ్ లో క్రికెట్...

ఆసియాక్రీడల్లో 9 సంవత్సరాల తర్వాత తిరిగి క్రికెట్ ను పతకం అంశంగా ప్రవేశపెట్టారు. 20 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశ నుంచి..

ఆసియా అగ్రశ్రేణిజట్లు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, అప్ఘనిస్థాన్ తలపడుతున్నాయి.

ఓ వైపు..భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలో తమ ప్రధానజట్లను బరిలో నిలిపిన భారత్, శ్రీలంక,బంగ్లా, పాక్, అఫ్ఘన్ క్రికెట్ బోర్డులు..ఆసియాక్రీడలకు మాత్రం ద్వితీయశ్రేణిజట్లనే ఎంపిక చేశాయి.

రుతురాజ్ నాయకత్వంలో భారత్ టైటిల్ వేట...

యువఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ కెప్టెన్ గా, వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన శిక్షకుడుగా భారత్ పోటీకి దిగుతోంది. జట్టులోని ఇతర ఆటగాళ్లలో యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్నోయ్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం దుబే, ప్రభ్ సిమ్రన్ సింగ్, ఆకాశ్ దీప్ సభ్యులుగా ఉన్నారు.

జూన్ 1 నాటికి ఉన్న ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆసియాలోని నాలుగు అగ్రశ్రేణిజట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో పాల్గొనే అవకాశం కల్పించారు.

మలేసియా, నేపాల్, హాంకాంగ్, మంగోలియా జట్లు తొలిదశ క్వాలిఫైయింగ్ రౌండ్లో తలపడితే...ప్రపంచ రికార్డుల మోతతో నేపాల్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

భారతజోరుకు నేపాల్ బేజారేనా?

ఆసియాక్రీడల తొలిరౌండ్ పోరులో మంగోలియాతో జరిగిన పోటీలో నేపాల్ జట్టు మూడు ప్రపంచ రికార్డులతో 300కు పైగా పరుగుల విజయంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. 34 బంతుల్లోనే ప్రపంచ రికార్డు శతకం బాదిన కుశాల్ మల్లా, 9 బంతుల్లోనే ప్రపంచ రికార్డు అర్థశతకం బాదిన దీపేంద్ర సింగ్ అయిరీలతో నేపాల్ బ్యాటింగ్ సవాలు విసురుతోంది.

భారత్ లాంటి అపారఅనుభవం కలిగిన జట్టుకు నేపాల్ ఏపాటి పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. హాంగ్జులోని జీజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్ ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా ఆసియాక్రీడల క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.

క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లో భారత్ తో నేపాల్, హాంకాంగ్ తో పాకిస్థాన్, అప్ఘనిస్థాన్ తో శ్రీలంక, మలేసియాతో బంగ్లాదేశ్ తలపడనున్నాయి. అక్టోబర్ 6న సెమీఫైనల్స్, అక్టోబర్ 7న గోల్డ్ మెడల్ మ్యాచ్ తో పాటు ..కాంస్య పతకం కోసం సైతం పోటీలను నిర్వహించనున్నారు.

First Published:  3 Oct 2023 2:52 AM GMT
Next Story