Telugu Global
Sports

ఏషియాడ్ లో భారత్ కు అరుదైన స్వర్ణాలు!

19వ ఆసియాక్రీడల 8వ రోజు పోటీలలో సైతం భారత్ పతకాల వేట కొనసాగింది.

ఏషియాడ్ లో భారత్ కు అరుదైన స్వర్ణాలు!
X

19వ ఆసియాక్రీడల 8వ రోజు పోటీలలో సైతం భారత్ పతకాల వేట కొనసాగింది. 11 స్వర్ణాలతో సహా మొత్తం 41 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టిక 4వ స్థానంలో నిలిచింది.

హాంగ్జు వేదికగా జరుగుతున్న 2022 ఆసియాక్రీడల 8వ రోజు పోటీలలో భారత్ మరో బంగారు పతకం కైవసం చేసుకొంది. తన స్వర్ణ పతకాల సంఖ్యను 11కు పెంచుకోగలిగింది.

షూటింగ్ లో ఓ స్వర్ణ, రజత పతకాలతో పాటు..గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో రజత పతకం సొంతం చేసుకొంది. పురుషుల షూటింగ్ ట్రాప్ విభాగంలో పృథ్వీరాజ్ తోండైమాన్, కీనన్ చెనాయ్, జోర్వార్ సింగ్ సంధులతో కూడిన భారత జట్టు బంగారు పతకం అందుకొంది.

మొత్తం 361 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిస్తే 359 పాయింట్లతో కువైట్ రజత, 354 పాయింట్లతో చైనా కాంస్య పతకాలు అందుకొన్నాయి.

మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో మనీశా కీర్, ప్రీతి రజక్, రాజేశ్వరీ కుమారీలతో కూడిన భారతజట్టు రజత పతకంతో సరిపెట్టుకొంది. భారతజట్టుకు 337 పాయింట్లు మాత్రమే లభించాయి.

ఆసియాక్రీడల ట్రాప్ షూటింగ్ చరిత్రలో భారత పురుషుల, మహిళల జట్లు సాధించిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. కేవలం షూటింగ్ విభాగంలోనే భారత షూటర్లు 8 స్వర్ణపతకాలు సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

మహిళల గోల్ఫ్ లో రజతం...

గోల్ఫ్ మహిళల విభాగంలో బంగారు పతకం ఆశలు రేపిన ఆదితి అశోక్ చివరకు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25 సంవత్సరాల ఆదితి 271 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. మహిళల టీమ్ విభాగంలో మాత్రం భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

థాయ్ లాండ్ కు చెందిన అర్పిచాయ స్వర్ణ, కొరియాకు చెందిన హ్యుంజో యూ కాంస్య పతకాలు సాధించారు.

ఆసియాక్రీడల గోల్ఫ్ లో 1982లో లక్ష్మణ్ సింగ్, శివ్ కపూర్, 2002 గేమ్స్ లో రాజీవ్ మహతో వ్యక్తిగత విభాగంలో పతకాలు సాధించగా..ప్రస్తుత క్రీడల్లో పతకం సాధించడం ద్వారా ఆదితి వారి సరసన నిలువగలిగింది.

పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ ఫైనల్లో భారత్...

భారత బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఆసియాక్రీడల చరిత్రలోనే తొలిసారిగా టీమ్ ఫైనల్స్ కు అర్హత సంపాదించగలిగింది. పవర్ ఫుల్ దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 3-1తో కొరియాపై సంచలన విజయం సాధించింది. మొత్తం మూడు సింగిల్స్ ను భారత ఆటగాళ్లు ప్రణయ్, లక్ష్యసేన్, కిడాంబీ శ్రీకాంత్ గెలుచుకోగా..డబుల్స్ లో కొరియా విజయాలు సాధించింది.

మొదటి రెండు సింగిల్స్ లో భారత్, ఆ తర్వాత జరిగిన రెండు డబుల్స్ లో కొరియా విజయాలు సాధించి 2-2తో సమఉజ్జీలుగా నిలిచిన తరువాత జరిగిన నిర్ణయాత్మక ఆఖరి సింగిల్స్ లో కొరియాకు చెందిన 163వ ర్యాంక్ ప్లేయర్ చో జియోనోప్ ను అధిగమించడానికి భారత్ కు చెందిన 21వ ర్యాంక్ ప్లేయర్ కిడాంబీ శ్రీకాంత్ మూడుసెట్లపాటు పోరాడాల్సి వచ్చింది.

తొలిగేమ్ ను 12-21తో చేజార్చుకొన్న శ్రీకాంత్...ఆ తర్వాతి రెండుగేమ్ లను 21-16, 21-14తో నెగ్గడం ద్వారా భారత్ కు ఫైనల్స్ బెర్త్ ఖాయం చేయగలిగాడు.

బంగారు పతకం కోసం జరిగే ఫైనల్ పోరులో ఆతిథ్య చైనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

2022 థామస్ కప్ ఫైనల్లో భారతజట్టు విజయం సాధించిన తరువాత సాధించిన అతిపెద్ద విజయం ప్రస్తుత ఆసియాక్రీడల సెమీస్ లోనే సాధించడం విశేషం.

పురుషుల టీమ్ స్క్వాష్ లో భారత్ కు స్వర్ణం..

పురుషుల స్క్వాష్ టీమ్ గోల్ మెడల్ పోరులో భారత్ 3-2తో పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించడం ద్వారా తొలిసారిగా స్వర్ణపతకం అందుకొంది. ఆసియాక్రీడల స్క్వాష్ పురుషుల టీమ్ విభాగంలో భారత్ బంగారు పతకం గెలుచుకోడం ఇదే మొదటిసారి.

టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ కు సైతం భారత జోడీ సుతీర్థ- ఐహిక అర్హత సంపాదించారు. క్వార్టర్ ఫైనల్ పోరులో ప్రపంచ చాంపియన్ జోడీ చెన్ మెంగ్- వాంగ్ లపై 11-5, 11-5, 5-11, 5-11, 11-9తో అనూహ్య విజయం సాధించడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగుపెట్టారు.

టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ లో స్వర్ణ పతకం...

టెన్నిస్ పురుషుల డబుల్స్ లో రజత పతకంతో సరిపెట్టుకొన్న భారత్ కు మిక్సిడ్ డబుల్స్ లో మాత్రం వెటరన్ రోహిన్ బొపన్న- రుదుజా భోంస్లే బంగారు పతకం అందించారు.

హోరాహోరీగా సాగిన గోల్డ్ మెడల్ రౌండ్లో భారతజోడీ 2-6, 6-3, 10-4తో 9వ సీడ్ సుంగ్- హావో, షువో లియాంగ్ లను అధిగమించారు.

2018 ఆసియాక్రీడల పురుషుల డబుల్స్ లో బంగారు పతకం సాధించిన 43 సంవత్సరాల రోహన్ బొపన్న ప్రస్తుత ఆసియాక్రీడల మిక్సిడ్ డబుల్స్ లో స్వర్ణపతకం సాధించాడు.

పతకాల పట్టిక నాలుగోస్థానంలోనే భారత్...

మొత్తం 45 దేశాలు తలపడుతున్న ప్రస్తుత ఆసియాక్రీడల పతకాల పట్టికలో భారత్ తన నాలుగో స్థానాన్ని నిలుపుకొంటూ వస్తోంది. పోటీల 8వ రోజున 11వ బంగారు పతకం సాధించడం ద్వారా పతకాల సంఖ్యను 41కి పెంచుకోగలిగింది.

భారత అథ్లెట్లు మొత్తం 11 స్వర్ణ, 16 రజత, 14 కాంస్యాలతో 41 పతకాలు గెలుచుకొన్నారు. 2018 ఆసియాక్రీడల్లో 17 స్వర్ణాలతో సహా మొత్తం 70 పతకాలు సాధించిన భారత్ ప్రస్తుత క్రీడల్లో 70 పతకాల లక్ష్యాన్ని అధిగమించాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  1 Oct 2023 2:15 PM IST
Next Story