ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత యువజోడీ సరికొత్త చరిత్ర
టోక్యో వేదికగా జరుగుతున్న 2022 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టీ జోడీ భారత్‌కు పతకం ఖాయం చేయడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో గత ఏడాది కాలంగా సంచలన విజయాలు సాధిస్తూ, పతకాల మోత మోగిస్తున్నభారత యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి..టోక్యో వేదికగా జరుగుతున్న 2022 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో సైతం అదే జోరు, దూకుడు కొనసాగిస్తున్నారు. సెమీఫైనల్లో చోటు కోసం ఆతిథ్య జపాన్ జోడీ యుగో కోబియాషీ- టకురో హోకీలతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో తుదివరకూ పోరాడి విజేతలుగా నిలిచారు. మూడు గేమ్‌ల ఈ ఉత్కంఠభరిత పోరులో తొలిగేమ్‌ను 24-22తో కైవసం చేసుకొన్న భారత జోడీ...రెండో గేమ్‌ను 15-21తో చేజార్చుకొన్నా..నిర్ణయాత్మక ఆఖరి గేమ్‌లో మాత్రం చెలరేగి ఆడారు. ఆలౌట్ ఎటాక్‌తో 21-14తో గేమ్‌ను, 2-1తో మ్యాచ్‌ను నెగ్గడం ద్వారా సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకున్నారు.
భారత తొలిజోడీగా రికార్డు...
ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ చరిత్రలో సెమీఫైనల్స్ చేరిన భారత తొలిజోడీ ఘనతను సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టి ద్వయం సొంతం చేసుకున్నారు. ప్రపంచ రెండోర్యాంక్, రెండోసీడ్ జపాన్ జట్టుపై సంచలన విజయంతో భారత్‌కు పతకం ఖాయం చేశారు. సెమీస్‌లో నెగ్గితే రజత, లేదా స్వర్ణ పతకాలు...ఒక వేళ పరాజయం పాలైతే కనీసం కాంస్యంతో స్వదేశానికి తిరిగిరానున్నారు.
ఇటీవలే ముగిసిన బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ పురుషుల డబుల్స్ లో బంగారు పతకం సాధించిన సాత్విక్-చిరాగ్ జోడీకి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడంతో పాటు..టీమ్ మిక్సిడ్ విభాగంలో రజత, థామస్ కప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఘనమైన రికార్డులు ఉన్నాయి. 2011 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాలా- అశ్వనీ పొన్నప్ప జోడీ కాంస్య పతకం సాధించగా...పురుషుల డబుల్స్ లో ఇప్పటి వరకూ భారత్‌కు కనీసం ఒక్క పతకమూ లేకపోడం విశేషం. ఆ లోటును సాత్విక్- చిరాగ్ జోడీ పూడ్చబోతున్నారు.