Telugu Global
Sports

ఆసియా కప్ క్వీన్ భారత్..ఫైనల్లో శ్రీలంక చిత్తు!

మహిళా ఆసియా కప్ టీ-20 టైటిల్‌ను భారత్ ఏడోసారి గెలుచుకొంది. బంగ్లాదేశ్ వేదికగా ఈ రోజు ముగిసిన టైటిల్ పోరులో మాజీ రన్నరప్ శ్రీలంకను భారత్ 8 వికెట్లతో చిత్తు చేసి తనకుతానే సాటిగా నిలిచింది.

ఆసియా కప్ క్వీన్ భారత్..ఫైనల్లో శ్రీలంక చిత్తు!
X

ఆసియా టీ-20 మహిళా క్రికెట్‌లో తనకు ఎదురేలేదని ఆరు సార్లు విన్నర్ భారత్ చాటుకొంది. గత ఎనిమిది టోర్నీలలో వరుసగా ఫైనల్స్ చేరుతూ వస్తున్న భారత్ రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్ చేజిక్కించుకొంది. బంగ్లాదేశ్‌లోని సిల్హౌట్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గత రెండు వారాలుగా సాగిన 2022 ఆసియా కప్ పోరులో భారత్ మొత్తం ఆరు లీగ్, రెండు నాకౌట్ మ్యాచ్‌లు ఆడి.. ఏడు విజయాలతో టైటిల్ విజేతగా నిలిచింది.


శ్రీలంక టపటపా!

రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం ద్వారా..14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్స్ చేరిన శ్రీలంక జట్టు కీలక మ్యాచ్‌లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా తన ఓటమికి తానే కారణమయ్యింది. స్ట్రోక్ ప్లేకి ఏమాత్రం అనువుగాలేని సిల్హౌట్ మందకొడి పిచ్‌పై ముందుగా బ్యాటింట్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కెప్టెన్ చమరీ అటపట్టు ఆట మూడో ఓవర్లలోనే రనౌట్‌గా వెనుదిరగడంతోనే శ్రీలంక టాప్‌ ఆర్డర్ పేకమేడలా కూలుతూ వచ్చింది. టాప్ హిట్టర్ అనుష్క సంజీవని సైతం రనౌట్ గానే దొరికిపోయింది.

భారత మీడియం పేసర్ రేణుక సింగ్ బౌలింగ్‌లో హాసినీ పెరెరా తొలి బంతికే అవుట్ కావడంతో శ్రీలంక కోలుకోలేకపోయింది. 9 పరుగులకే 4 టాప్‌ ఆర్డర్ వికెట్లు కోల్పోయి..దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకొన్నశ్రీలంకను భారత స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ మరో దెబ్బ కొట్టింది. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చిన శ్రీలంక ఒక దశలో 32 పరుగులకే 8 వికెట్లు నష్టపోయింది. యాభై పరుగుల స్కోరు చేయటమే కష్టమనుకొన్న తరుణంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ రణవీర 22 బాల్స్ లో 18 పరుగులు చేయడంతో శ్రీలంక 65 పరుగుల స్కోరుతో పరువుదక్కించుకొంది.

స్మృతి మందన మెరుపు హాఫ్ సెంచరీ..

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 66 పరుగులు చేయాల్సిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్ షెఫాలీ వర్మ, వన్ డౌన్ జెమీమా వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ స్మృతి మందన తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి కేవలం 25 బాల్స్ లోనే 51 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో భారత్ 8.3 ఓవర్లలోనే విజయలక్ష్యం చేరుకోగలిగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 14 బాల్స్ లో 11 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచింది.

స్మృతి హాఫ్ సెంచరీలో 6 బౌండ్రీలు, 3 సిక్సర్లు ఉన్నాయి.

2004 ప్రారంభమైన మహిళా ఆసియాకప్‌లో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిదికి ఎనిమిది టోర్నీలలోనూ ఫైనల్స్ చేరుతూ వచ్చిన భారత్ 7 సార్లు విజేతగా, ఒక్కసారి రన్నరప్ గా నిలవడం ద్వారా..ఆసియా క్రికెట్ క్వీన్ ను తానేనని మరోసారి చాటుకోగలిగింది.

First Published:  15 Oct 2022 6:12 PM IST
Next Story