Telugu Global
Sports

ఆసియాక్రీడల్లో భారతనారీ పతకాల హోరు!

చైనా వేదికగా ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో భారత్ రికార్డుస్థాయిలో 107 పతకాలు సాధించడంలో మహిళా అథ్లెట్లు తమవంతు బాధ్యత నిర్వర్తించారు.

ఆసియాక్రీడల్లో భారతనారీ పతకాల హోరు!
X

ఆసియాక్రీడల్లో భారతనారీ పతకాల హోరు!

చైనా వేదికగా ముగిసిన 19వ ఆసియాక్రీడల్లో భారత్ రికార్డుస్థాయిలో 107 పతకాలు సాధించడంలో మహిళా అథ్లెట్లు తమవంతు బాధ్యత నిర్వర్తించారు. పురుషులకు మహిళాలు ఏమాత్రం తీసిపోరని తమ అపురూప విజయాలతో చాటి చెప్పారు.....

19వ ఆసియాక్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగోస్థానంలో నిలవడమే కాదు..గత ఏడుదశాబ్దాల కాలంలో తొలిసారిగా వందకు పైగా (107) పతకాలు సాధించడం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీసింది.

14రోజులపాటు 38 రకాల క్రీడాంశాలలో జరిగిన 45 దేశాల ఈ పోటీలలో భారత్ 655 మంది అథ్లెట్ల భారీబృందంతో బరిలో నిలిచింది. భారత బృందంలో 330 మంది మహిళా అథ్లెట్లు సైతం ఉన్నారు.

మహిళా అథ్లెట్ల వాటా 46 పతకాలు ...

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత మహిళా అథ్లెట్లు పలు అపురూప విజయాలు సాధించారు. సంవత్సరాల తరబడి ఎదురుచూసిన పతకాలు కైవసం చేసుకొన్నారు.

భారత్ సాధించిన మొత్తం 107 పతకాలలో మహిళలు సాధించినవే 46 పతకాలు ఉన్నాయి. మిక్సిడ్ విభాగంలో పురుష అథ్లెట్లు భాగస్వాములుగా మరో 9 పతకాలను మహిళా అథ్లెట్లు గెలుచుకొన్నారు.

తెలుగు రాష్ట్రాల అథ్లెట్ల అరుదైన ఘనత...

భారత అథ్లెట్లు సాధించిన మొత్తం 28 బంగారు పతకాలలో తెలుగు రాష్ట్రాల సూపర్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం సాధించినవే మూడు స్వర్ణాలు ఉన్నాయి.

కాంపౌండ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత, టీమ్ విభాగాలతో పాటు మిక్సిడ్ విభాగంలో సైతం జ్యోతి సురేఖ బంగారు పతకాలు సాధించింది. గాంగ్జు ఆసియాక్రీడల్లో అత్యధికంగా మూడు బంగారు పతకాలు సాధించిన భారత మహిళగా, ఇద్దరు బారత అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది.

హైదరాబాద్ షూటర్ ఈషాసింగ్ పిస్టల్ షూటింగ్ విభాగంలో ఓ స్వర్ణంతో సహా మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకొంది. అత్యధిక పతకాలు (4) సాధించిన ఇద్దరు భారత అథ్లెట్లలో ఈషా సింగ్ ఒకరిగా నిలిచింది.

అపురూపం టేబుల్ టెన్నిస్ రజతం...

ఆసియాక్రీడల టేబుల్ టెన్నిస్ చరిత్రలో భారత మహిళలు తొలి పతకాన్ని గెలుచుకోడం ద్వారా చరిత్ర సృష్టించారు. మహిళల డబుల్స్ లో ముఖర్జీ సిస్టర్స్ సుతీర్థ- ఐహిక సెమీఫైనల్లో చైనాజోడీ పై సంచలన విజయంతో రజత పతకం అందుకొన్నారు.

మహిళల 5 వేల మీటర్ల పరుగులో ఆఖరి 30 మీటర్ల దూరంలోనే జపాన్ కు చెందిన ప్రత్యర్థి రిరికాను అధిగమించడం ద్వారా పారుల్ చౌదరి బంగారు పతకం సొంతం చేసుకొన్న తీరు క్రీడాభిమానులకు కలకాలం గుర్తుండి పోతుంది.

మహిళల జావలిన్ త్రోలో అను రాణి బంగారు పతకం సాధిస్తే..క్రికెట్ , కబడ్డీ అంశాలలో సైతం భారత మహిళాజట్లు స్వర్ణాలు గెలుచుకోగలిగాయి. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అధితి అశోక్ రజత పతకంతో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఆసియాక్రీడల మహిళల గోల్ఫ్ చరిత్రలోనే వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన భారత తొలి మహిళగా రికార్డుల్లో చేరింది.

బంగారు ఆశలతో హాకీ బరిలోకి దిగిన భారతజట్టు కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విశాఖ రన్నర్ కు రజతం..

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేస్ లో విశాఖ పట్నం రన్నర్ జ్యోతి ఎర్రాజీ రజత పతకం గెలుచుకొంది. చదరంగం మహిళల టీమ్ విభాగంలో భారత్ కు రజతం దక్కింది.

గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక భారతజట్టులో సభ్యులుగా ఉన్నారు.

మహిళా బాక్సింగ్ లో బంగారు పతకం నెగ్గితీరుతుందని భావించిన నిఖత్ జరీన్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లవ్లీనా బోర్గెయిన్ ఫైనల్ చేరినా రజత పతకంతో సంతృప్తి పడాల్సి వచ్చింది.

బ్యాడ్మింటన్ టీమ్ ,వ్యక్తిగత విభాగాలతో పాటు కుస్తీలోనూ భారత మహిళలు దారుణంగా విఫలమయ్యారు. మొత్తం మీద పురుషులతో సమానంగా రాణించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచారు.

ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తే..మహిళా అథ్లెట్లు అంతకు మించి అత్యుత్తమంగా రాణించడం తమ ప్రత్యేకతను చాటుకోగలిగారు.

First Published:  13 Oct 2023 8:06 AM IST
Next Story