Telugu Global
Sports

మరో మెట్టు పైన భారత మహిళా క్రికెట్!

భారత మహిళా క్రికెట్ ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతోంది. విజయశోభతో వెలిగిపోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాదికాలంలో వరుస విజయాలతో తన ఉనికిని గతంలో ఎన్నడూలేనంత గొప్పగా చాటుకొంది.

మరో మెట్టు పైన భారత మహిళా క్రికెట్!
X

భారత మహిళా క్రికెట్ ఉత్తుంగ తరంగంలా ఎగసిపడుతోంది. విజయశోభతో వెలిగిపోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాదికాలంలో వరుస విజయాలతో తన ఉనికిని గతంలో ఎన్నడూలేనంత గొప్పగా చాటుకొంది.

ప్రపంచ క్రికెట్ కు ప్రస్తుత చిరునామా భారత్ అంటే పురుషుల క్రికెట్ మాత్రమే అనుకొనే రోజులుపోయాయి. మహిళా క్రికెట్ సైతం అనుకొనే రోజులు వచ్చాయి. జూనియర్, సీనియర్ అన్నతేడా లేకుండా భారత మహిళా క్రికెట్ జట్లు గతేడాది కాలంలో కళ్లు చెదిరే పలు చిరస్మరణీయ విజయాలు నమోదు చేశాయి.

పురుషులతో సమానంగా.....

తగిన ఆదరణ, ప్రోత్సాహం, ప్రచారం ఉంటే పురుషులతో సమానంగా మహిళలు సైతం రాణించగలరనడానికి గత ఏడాదికాలంలో భారత మహిళాజట్లు సాధించిన విజయాలే నిదర్శనం.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు పురుషులతో సమానంగా మహిళలకూ శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తూ రావడం అనూహ్యఫలితాలనే ఇచ్చింది.

జూనియర్ జట్ల నుంచి సీనియర్ జట్ల వరకూ అనూహ్య విజయాలతో భారత మహిళా క్రికెట్ సత్తా ఏపాటిదో ప్రపంచానికి సరికొత్తగా చాటి చెప్పుకోగలిగాయి.

జూనియర్ మహిళా ప్రపంచకప్ తో.....

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2023 జూనియర్ ( అండర్ -19 ) మహిళా ప్రపంచకప్ పోటీలలో షెఫాలీవర్మ నాయకత్వంలోని భారతజట్టు తొలిసారిగా ప్రపంచకప్ ను కైవసం చేసుకొంది.

వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోశ్, కెప్టెన్ షెఫాలీ వర్మతో పాటు జట్టులోని పలువురు యువప్లేయర్లు స్థాయికి తగ్గట్టుగా రాణించడంతో టైటిల్ సమరంలో ఇంగ్లండ్ ను భారత్ కంగు తినిపించడం ద్వారా విశ్వవిజేతగా నిలువగలిగింది.

హర్మన్ ప్రీత్ నాయకత్వంలో సీనియర్ల జోరు....

సీనియర్ స్థాయిలోనూ భారతజట్టు నిలకడగా రాణిస్తూ వస్తోంది. ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి ప్రపంచ మేటిజట్లకు గట్టి ప్రత్యర్థిగా నిలువగలిగింది. భారత్ ను తక్కువగా అంచనావేస్తే ముప్పుతప్పదన్న సంకేతాలను పంపింది.

ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో విజేతగా నిలువలేకపోయినా గట్టిపోటీ ఇవ్వడం ద్వారా అభిమానులను ఆకట్టుకోగలిగింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వాంఖడే స్టేడియాలు వేదికగా భారతజట్టు ఆడే మ్యాచ్ లకు అభిమానులు భారీసంఖ్యలో తరలిరావడం సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు స్మృతి మందన, దీప్తి శర్మ, రాజేశ్వరీ గయక్వాడ్, రేణుకాసింగ్, పూజా వస్త్రకర్ లాంటి సీనియర్లు, జెమీమా రోడ్రిగేజ్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, శ్రేయాంకా పాటిల్, తాన్యా భాటియా, శుభ సతీశ్ లాంటి నవతరం క్రికెటర్ల మేళవింపుతో అత్యంత సమతూకంతో గతంలో ఎన్నడూలేనంత పటిష్టంగా తయారయ్యింది.

ఆసియాక్రీడల బంగారు పతకంతో.....

చైనాలోని హాంగ్జు వేదికగా జరిగిన 2022 ఆసియాక్రీడల మహిళా క్రికెట్లో భారతజట్టు అలవోకగా బంగారు పతకం గెలుచుకొంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన భారత్ స్వర్ణపతం పోరులో శ్రీలంకను 22 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆసియాక్రీడల క్రికెట్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం.

తొలిసారిగా మహిళా ఐపీఎల్....

2008 నుంచి పురుషులకు మాత్రమే నిర్వహిస్తున్న ఐపీఎల్ ను మహిళలకు సైతం 2023 సీజన్ నుంచి నిర్వహించడం మొదలు పెట్టారు. మొత్తం ఐదుజట్లతో ..ముంబైలోని మూడు వేదికల్లో 22 మ్యాచ్ లుగా నిర్వహించిన ఈ టోర్నీ విజయవంతమయ్యింది.

ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7వికెట్లతో ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. తొలివిజేతగా ముంబై 6 కోట్లు, రన్నరప్ ఢిల్లీ 3 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందుకొన్నాయి.

మహిళా ఐపీఎల్ తొలిసీజన్ వేలంలో ఓపెనర్ స్మృతి మందనను బెంగళూరు ఫ్రాంచైజీ 3 కోట్ల 40 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంది. ఐపీఎల్ ద్వారా మహిళలు సైతం కోట్ల రూపాయలు సంపాదించగలరని స్మృతి మందన చాటి చెప్పింది.

10 రోజుల్లో రెండు టెస్టు విజయాలు!

సాంప్రదాయ మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలో..కేవలం 10 రోజుల వ్యవధిలో రెండు ప్రపంచ మేటిజట్లను కంగుతినిపించిన అరుదైన రికార్డును భారతజట్టు సొంతం చేసుకొంది.

2023 డిసెంబర్ నెల ఆఖరి10 రోజుల్లో నవీ ముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముగిసిన నాలుగురోజుల టెస్టు మ్యాచ్ లో భారత్ 347 పరుగుల భారీ ఆధిక్యంతో ఇంగ్లండ్ పై అతిపెద్ద విజయం సాధించింది. ఒక్కరోజు ఆటలో 400కు పైగా పరుగులు సాధించిన రెండోజట్టుగా రికార్డుల్లో చోటు సంపాదించింది.

ఆస్ట్ర్రేలియాపై అపురూప విజయం...

మహిళా క్రికెట్ ఫార్మాట్ ఏదైనా ప్రపంచ మేటి ఆస్ట్ర్రేలియాను ఓడించడం భారత్ కు ఓ కల. సాంప్రదాయటెస్టుమ్యాచ్ లో కంగారూలను కంగు తినిపించాలన్న భారత కల మూడదశాబ్దాల తరువాత సాకారమయ్యింది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముగిసిన టెస్టులో సైతం ఆస్ట్ర్రేలియాపై భారత్ 8 వికెట్ల సంచలన విజయం సాధించింది.

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఆడిన గత 10 టెస్టుల్లో కనీసం ఒక్క గెలుపులేని భారత్ ఎట్టకేలకు తొలివిజయం నమోదు చేయగలిగింది.

అత్యంత పటిష్టమైన ఆస్ట్ర్రేలియాను తొలిఇన్నింగ్స్ లో 219 పరుగులకే కుప్పకూల్చడంతో పాటు..తన తొలిఇన్నింగ్స్ లో 406 పరుగులతో భారీ ఆధిక్యం సంపాదించిన భారత్..రెండో ఇన్నింగ్స్ లో సైతం కంగారూజట్టును 261 పరుగులకే కట్టడి చేసింది.

దీంతో మ్యాచ్ నెగ్గాలంటే రెండో ఇన్నింగ్‌ లో 75 పరుగులు మాత్రమే చేయాల్సిన భారత్ ఓపెనర్ షెఫాలీవర్మ, వన్ డౌన్ రిచా వికెట్ల నష్టానికే చరిత్రాత్మక విజయం సాధించగలిగింది.

భారత మహిళా క్రికెట్ చరిత్రలో 2023 అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. ఇదేజోరును కొత్తసంవత్సరంలోనూ భారత్ కొనసాగించగలిగితే ప్రపంచ మూడు అత్యుత్తమజట్లలో ఒకటిగా నిలువగలుగుతుంది.తన స్థానం పదిలపరచుకోగలుగుతుంది.

First Published:  1 Jan 2024 4:13 PM IST
Next Story