Telugu Global
Sports

భారత మహిళా క్రికెట్..షరామామూలే!

భారత మహిళా క్రికెట్ కథ మళ్లీ మొదటి కొచ్చింది. 2023 టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే మరో ఘోరపరాజయం ఎదురయ్యింది.

భారత మహిళా క్రికెట్..షరామామూలే!
X

భారత మహిళా క్రికెట్ కథ మళ్లీ మొదటి కొచ్చింది. 2023 టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే మరో ఘోరపరాజయం ఎదురయ్యింది...

భారత మహిళా క్రికెట్ పరిస్థితి రెండడుగులు ముందుకు..నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది. ప్రోత్సాహం, సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు పెరిగిన స్థాయిలో మహిళా క్రికెటర్ల ప్రమాణాలు ఏమాత్రం పెరగడం లేదు. మీడియా చిలువలు పలువలు చేస్తూ విశేష ప్రచారం కల్పిస్తున్నా తమ ఆటతీరును మెరుగు పరచుకోలేకపోతున్నారు.

దక్షిణాఫ్రికా వేదికగాఈనెల 10 నుంచి ప్రారంభంకానున్న 2023 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా సఫారీల్యాండ్ వేదికగా జరిగిన ముక్కోణపు ( దక్షిణాఫ్రికా- వెస్టిండీస్- భారత్ ) సిరీస్ ఫైనల్లో భారత్ దారుణంగా విఫలమయ్యింది.

మూడుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో అజేయంగా నిలిచిన భారత్..ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన టైటిల్ సమరంలో తేలిపోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో 5 వికెట్ల ఓటమితో ఢీలా పడిపోయింది.

అంతర్జాతీయ టోర్నీల ఫైనల్స్ వరకూ రావటం, టైటిల్ సమరంలో చేతులెత్తేయడం భారత్ కు ఓ సాంప్రదాయ బలహీనతగా మారింది.

స్మృతి, హర్మన్ ప్రీత్ ఫ్లాప్ షో...

భారత మహిళాజట్టుకు రెండు కళ్లు లాంటి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానాకు కీలక సమయాలలో జట్టును ముంచడం ఓ అలవాటుగా మారిపోయింది.

ఈస్ట్ లండన్ వేదికగా జరిగే ముక్కోణపు సిరీస్ ఫైనల్లో ఓపెనర్ స్మృతి మంధానా డకౌట్ కాగా..కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 21, జెమీమా రోడ్రిగేజ్ 11 పరుగులకే అవుట్ కావడంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ పవర్ ప్లే ఓవర్లలో 25 డాట్ బాల్స్ తో 19 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆట మొదటి 9.3 ఓవర్లలో 57 డాట్ బాల్స్ ఆడిన భారత్ మరి తేరుకోలేకపోయింది.

హర్లీన్ డియోల్ పోరాడి ఆడి 46 పరుగులు సాధించడంతో భారత్ పరువు దక్కించుకోగలిగింది. సమాధానంగా విజయానికి అవసరమైన 110 పరుగుల స్కోరును దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికే సాధించగలిగింది.

దక్షిణాఫ్రికా హిట్టర్ చోలే ట్రియోన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సహా 57 పరుగుల నాటౌట్ స్కోరుతో తనజట్టుకు విజయంతో పాటు ముక్కోణపు సిరీస్ ట్రోఫీని సైతం అందించింది. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 113 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది. భారత స్పిన్ త్రయం దీప్తి శర్మ, రాజేశ్వరీ గయక్వాడ్, స్నేహ రానా ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఫైనల్లో భారతజట్టు ఓడినా..వెటరన్ స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ మాత్రం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకొంది.

ప్రపంచకప్ ప్రారంభానికి ముందే...

దక్షిణాఫ్రికా వేదికగా ఈనెల 10 నుంచి ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్ గ్రూపు బీ- లీగ్ లో ఫిబ్రవరి 12న భారత్ తన తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పోటీపడుతుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్, 18న ఇంగ్లండ్, 20న ఐర్లాండ్ జట్లతో భారత్ తలపడనుంది.

ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి జట్లను అధిగమించగలిగితేనే భారత్ విశ్వవిజేతగా నిలువగలుగుతుంది.

First Published:  4 Feb 2023 10:15 AM GMT
Next Story