ఆసియాక్రీడల కబడ్డీ ఫైనల్స్ లో భారతజట్లు!
19వ ఆసియాక్రీడల కబడ్డీ పురుషుల, మహిళల ఫైనల్స్ కు భారతజట్లు అలవోకగా చేరుకొన్నాయి. బంగారు పతకాలకు గురిపెట్టాయి.
19వ ఆసియాక్రీడల కబడ్డీ పురుషుల, మహిళల ఫైనల్స్ కు భారతజట్లు అలవోకగా చేరుకొన్నాయి. బంగారు పతకాలకు గురిపెట్టాయి.
హాంగ్జు ఆసియాక్రీడల కబడ్డీ పురుషుల, మహిళల ఫైనల్స్ కు మాజీచాంపియన్లు భారతజట్లు చేరుకొన్నాయి. సెమీఫైనల్స్ లో అలవోక విజయాలు సాధించడం ద్వారా గోల్డ్ మెడల్ రౌండ్లో అడుగుపెట్టాయి.
సెమీస్ లో భారీవిజయాలు...
పురుషుల సెమీఫైనల్లో భారత్ కు ఎదురేలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన పోరులో భారత్ 61- 14 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. గత ఆసియాక్రీడల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకొన్న భారతజట్టు ప్రస్తుత గేమ్స్ లో మాత్రం బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో ఉంది.
ఆసియాక్రీడల చరిత్రలో ఇప్పటి వరకూ ఏడుసార్లు బంగారు పతకాలు గెలుచుకొన్న భారత్ కు ఫైనల్లో మరోసారి ఇరాన్ నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది.
పాకిస్థాన్ తో జరిగిన పోరులో భారత్ కు ఎదురేలేకపోయింది.
రైడింగ్, బ్లాకింగ్ విభాగాలలో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఆట మొదటి భాగం ముగిసే సమయానికే 30-5 పాయింట్ల ఆధిక్యం కొనసాగించిన భారత్..రెండో భాగంలోనూ అదే దూకుడు కొనసాగించింది. చివరకు 61-14 పాయింట్లతో భారీవిజయం నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో పవన్ షెరావత్ ఆల్ రౌండ్ గేమ్ తో కీలకపాత్ర పోషించాడు.
1990 ఆసియాక్రీడల్లో కబడ్డీని తొలిసారిగా ప్రవేశపెట్టిన నాటినుంచి భారతజట్టు వరుసగా ఏడుసార్లు స్వర్ణ విజేతగా నిలిచింది. అయితే..2018 ఆసియాక్రీడల సెమీస్ దశలోనే ఇరాన్ చేతిలో పరాజయం ఎదురు కావడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇరాన్-చైనీస్ తైపీ జట్ల నడుమ జరిగే రెండో సెమీఫైనల్లో నెగ్గినజట్టుతో భారత్ ఫైనల్స్ లో తలపడాల్సి ఉంది.
మహిళల సెమీస్ లో నేపాల్ పై గెలుపు..
మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 61- 17 పాయింట్ల తేడాతో నేపాల్ ను చిత్తు చేసి వరుసగా నాలుగోసారి ఆసియాక్రీడల ఫైనల్స్ కు చేరుకొంది.
భారత రైడర్లలో పూజా హత్ వాల్, పుష్పా రాణా, అక్షిమా రాణించారు. ఆట మొదటి భాగానికి 29-10 పాయింట్లతో పైచేయి సాధించిన భారత్ కు రెండో భాగంలో పోటీనే లేకుండా పోయింది.
గోల్డ్ మెడల్ రౌండ్లో చైనీస్ తైపీతో భారతజట్టు తలపడనుంది. గ్రూప్ లీగ్ దశలో భారత్ ను 31-31 పాయింట్లతో నిలువరించిన చైనీస్ తైపీ నుంచి గోల్డ్ మెడల్ మ్యాచ్ లో గట్టిపోటీ ఎదురుకానుంది.