శ్రీలంక.. మన సిరాజ్ మియాకు ప్రియమైన శత్రువు
లంక మీద మ్యాచ్ అంటే సిరాజ్ మియా రెచ్చిపోతాడు. బుల్లెట్ వేగంతో బంతులేసి ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను చిగురుటాకులా వణికించేస్తాడు. దీంతో ఆ జట్టు బ్యాటర్లకు అతడో పీడకలగా మారిపోయాడు.
మన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు శ్రీలంక అంటే మా చెడ్డ అభిమానం. లంక మీద మ్యాచ్ అంటే సిరాజ్ మియా రెచ్చిపోతాడు. బుల్లెట్ వేగంతో బంతులేసి ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను చిగురుటాకులా వణికించేస్తాడు. దీంతో ఆ జట్టు బ్యాటర్లకు అతడో పీడకలగా మారిపోయాడు. మొన్నటి ఆసియాకప్ ఫైనల్లో, నిన్న ప్రపంచకప్ మ్యాచ్‌లో మనోడి నిప్పులు చెరిగే బంతులకు శ్రీలంక టాప్ ఆర్డర్ చెల్లాచెదురైపోయింది.
లంకకు యముడే
వరల్డ్ కప్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లలో కీలక వికెట్లు తీసినా సిరాజ్ ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్‌లలో స్థాయికి తగ్గ ప్రభావం చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రియమైన ప్రత్యర్థి శ్రీలంకంతో మ్యాచ్ అనేసరికి సిరాజ్ చెలరేగిపోయాడు. వేసిన తొలి బంతికే ఓపెనర్ కరుణరత్నే వికెట్ తీశాడు. అదే ఓవర్ ఐదో బంతికి సమర విక్రమను పెవిలియన్ చేర్చాడు. తర్వాత శ్రీలంక కెప్టెన్, ఈ వరల్డ్ కప్‌లో శ్రీలంక టాప్ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండీస్ వికెట్లను గిరాటేశాడు. మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్.. 16 పరుగులే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు రాబట్టాడు.
సిరాజ్‌పై నమ్మకం పెంచిన ప్రదర్శన అది
ఇదే సిరాజ్ ఆసియాకప్ ఫైనల్‌లో శ్రీలంకను చెడుగుడు ఆడేసుకున్నాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 21 పరుగులకే ఆరు వికెట్లు తీసి లంకను 50 పరుగులకే కుప్పకూల్చడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్ట్‌ల్లో విజయవంతమైన బౌలరయినా వన్డేల్లో ధారాళంగా పరుగులిచ్చేస్తాడన్న భయంతో సిరాజ్‌ను వన్డే జట్టులోకి అడపాదడపానే తీసుకుంటుంటారు. ఆసియా కప్‌లో శ్రీలంక మీద చేసిన ఆ అద్భుత ప్రదర్శనే అతణ్ని ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో రెగ్యులర్ బౌలర్‌గా అదీ ఓపెనింగ్ బౌలర్‌గా అవకాశం దక్కించిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అదే శ్రీలంక మీద ప్రదర్శన మనోడి ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. వన్డే కెరీర్‌లో సిరాజ్ తీసిన 63 వికెట్లలో 19 శ్రీలంకవే. సో.. శ్రీలంక మన సిరాజ్ మియాకు ప్రియమైన శత్రువు అనడం కరెక్టే కదా!