Telugu Global
Sports

వందో టెస్టు ముంగిట్లో భారత క్రికెట్ నయావాల్!

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు.

వందో టెస్టు ముంగిట్లో భారత క్రికెట్ నయావాల్!
X

వందో టెస్టు ముంగిట్లో భారత క్రికెట్ నయావాల్!

భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. ఆస్ట్ర్రేలియాతో న్యూఢిల్లీ వేదికగా జరిగే రెండోటెస్టు ద్వారా టెస్టుల సెంచరీ పూర్తి చేయనున్నాడు. ఈ ఘనత సాధించిన భారత 13వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరనున్నాడు...

చతేశ్వర్ పూజారా.....సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో కీలక వన్ డౌన్ స్థానం కోసమే పుట్టిన ఆటగాడు, పటిష్టమైన డిఫెన్స్, చెక్కుచెదరని ఏకాగ్రత....ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా...క్రీజునే అంటిపెట్టుకొని... గంటలతరబడి ఆడుతూ....ప్రత్యర్థి బౌలింగ్ ఎటాక్ కు.. అడ్డుగోడగా నిలబడగల మొనగాడు.

13 సంవత్సరాలు..100 టెస్టులు...

సౌరాష్ట్ర క్రికెట్ నుంచి 13 సంవత్సరాల క్రితం భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన 33 సంవత్సరాల పూజారా.....ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తో....నయా వాల్ గా టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2010 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో.... బెంగళూరు టెస్ట్ ద్వారా...తొలిమ్యాచ్ ఆడిన పూజారా...ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. నిలకడగా రాణిస్తూ...భారతజట్టు రెండుసార్లు టెస్టు నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడంలో ప్రధానపాత్ర వహించాడు.

1వ టెస్టు, 100వ టెస్టు..కంగారూలపైనే...

ఒకేజట్టు ప్రత్యర్థిగా మొదటి టెస్టు, వందోటెస్టు ఆడిన అత్యంత అరుదైన రికార్డును పూజారా సొంతం చేసుకోనున్నాడు. 2010లో ఆస్ట్ర్రేలియాతో టెస్టు సిరీస్ లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరు ద్వారా టెస్టు అరంగేట్రం చేసిన పూజారా..గత 13 సంవత్సరాల కాలంలో వెనుదిరిగి చూసింది లేదు.

ప్రస్తుత 2023 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా ఆస్ట్ర్లేలియాతో న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక జరిగే రెండోటెస్టుతో పూజారా తన కెరియర్ లో వందో టెస్టు మ్యాచ్ ను ఆడనున్నాడు.

ప్రస్తుత సిరీస్ లోని నాగపూర్ టెస్టు వరకూ ఆడిన మొత్తం 99 టెస్టుల్లో పూజారా 7వేల 21 పరుగులు సాధించాడు. మొత్తం 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 44.39 సగటు నమోదు చేశాడు. ప్రస్తుత సిరీస్ లోని రెండోటెస్టు ద్వారా 100 టెస్టుల క్లబ్ లో చేరిన 13వ భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.

అరుదైన రికార్డుల పూజారా...

టెస్టు చరిత్రలో మరే బ్యాటర్ కు సాధ్యంకాని పలు రికార్డులు పూజారా పేరుతో ఉన్నాయి. తన కెరియర్ లో ఆడిన మొదటి 99 టెస్టుమ్యాచ్ ల్లో ఆరుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన మొనగాడు పూజారా.

అంతేకాదు..జిడ్డాటలో తనకు తానే సాటిగా నిలిచిన వీరుడు పూజారా. తన తొలిపరుగు కోసం 40కి పైగా బంతులు డిఫెన్స్ ఆడిన వన్ డౌన్ బ్యాటర్.

ఆస్ట్రేలియాతో జార్ఖండ్ క్రికెట్ సంఘం ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో టెస్ట్ లో పూజారా...తనదైన శైలిలో డబుల్ సెంచరీ సాధించాడు.

ఒకటి కాదు...రెండుకాదు...ఏకంగా ఐదు సెషన్లు, పదకొండు గంటలపాటు...అలుపుసొలుపు లేకుండా...చెక్కు చెదరని ఏకాగ్రతతో ఆడి తనకు తానే సాటిగా నిలిచాడు.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహాతో ఏడో వికెట్ కు 199 పరుగుల భాగస్వామ్యంతో ...సరికొత్త రికార్డు నమోదు చేశాడు. గత 69 సంవత్సరాలుగా హేము అధికారి- విజయ్ హజారే పేరుతో ఉన్న 7వ వికెట్ రికార్డును తెరమరుగు చేశాడు. పూజారా మొత్తం 525 బాల్స్ ఎదుర్కొని 21 బౌండ్రీలతో 202 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్...

ఇప్పటి వరకూ రాహుల్ ద్రావిడ్ పేరుతో ఉన్న 495 బాల్స్ రికార్డును అధిగమించి..అత్యధికంగా 525 బాల్స్ ఎదుర్కొన్న భారత బ్యాట్స్ మన్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఇంతకు ముందే రెండేసి డబుల్ సెంచరీలు సాధించిన సచిన్, లక్ష్మణ్ ల సరసన పూజారా నిలిచాడు.

సాంప్రదాయ టెస్ట్ మ్యాచ్ ఐదురోజులూ బ్యాటింగ్ చేసిన..భారత మూడో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలిటెస్ట్ ఐదురోజులూ...పూజారా బ్యాటింగ్ క్రీజులో నిలవడం విశేషం. తొలిఇన్నింగ్స్ లో 52 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 22 పరుగులకు అవుటయ్యాడు.

ఎనిమిది దశాబ్దాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన వారిలో ఎమ్.ఎల్. జై సింహా, భారత మాజీ చీఫ్ కోచ్ రవి శాస్త్రి ఉన్నారు. 1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో జై సింహా తొలిఇన్నింగ్స్ లో 20, రెండోఇన్నింగ్స్ లో 74 పరుగులు సాధించారు. రవిశాస్త్రి మాత్రం 1984లో ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ మ్యాచ్ తొలిఇన్నింగ్స్ లో 111 పరుగులు, రెండోఇన్నింగ్స్ లో 7 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలిచాడు. టెస్ట్ మ్యాచ్ ఐదురోజులూ బ్యాటింగ్ చేసిన ఘనత దక్కించుకొన్న విదేశీ క్రికెటర్లలో జెఫ్ బాయ్ కాట్, కిమ్ హ్యూస్, అలెన్ ల్యాంబ్, అడ్రియన్ గ్రిఫిత్, యాండ్రూ ఫ్లింటాఫ్ ఉన్నారు. 13 దశాబ్దాల క్రికెట్ చరిత్రలో..

మ్యాచ్ ఐదురోజులూ ఆడిన ఆటగాళ్లు కేవలం ఎనిమిదిమందే కావడం విశేషం.

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా తిరుగులేని పూజారా..

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా పూజారాకు కళ్లు చెదిరే రికార్డే ఉంది. మొత్తం 38 ఇన్నింగ్స్ లో 54 సగటుతో 1900పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 42 స్ట్ర్రయిక్ రేటుతో, 204 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డులతో వందో టెస్టుకు ఉరకలేస్తున్నాడు.

శ్రీలంక ప్రత్యర్థిగా కొలంబో వేదికగా తన 50వ టెస్టు మ్యాచ్ ఆడిన పూజారా..ఢిల్లీ వేదికగా ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా తన వందో టెస్టు మ్యాచ్ ఆడటానికి ఉరకలేస్తున్నాడు.

పూజారాకు ముందే వందటెస్టులు ఆడిన 12 మంది భారత క్రికెట్ దిగ్గజాలలో సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్ ,

వీవీఎస్ లక్ష్మణ్, అనీల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇశాంత్ శర్మ, విరాట్ కొహ్లీ ఉన్నారు.

ఇప్పుడు వంద టెస్టు ఆడటం ద్వారా భారత 13వ బ్యాటర్ గా చతేశ్వర్ పూజారా అదే ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. తన శత టెస్టు మ్యాచ్ ను శతకంతో పూజారా చిరస్మరణీయంగా మిగుల్చుకోవాలని కోరుకొందాం.

First Published:  15 Feb 2023 11:10 AM IST
Next Story