Telugu Global
Sports

దక్షిణాఫ్రికా కోటలో భారత కుర్రాళ్ల పాగా!

దక్షిణాఫ్రికాతో తీన్మార్ టీ-20 సిరీస్ సమరానికి సూర్యకుమార్ నాయకత్వంలోని భారత యువజట్టు సై అంటోంది. బెంగళూరు నుంచి సఫారీ ల్యాండ్ కు బయలుదేరింది.

దక్షిణాఫ్రికా కోటలో భారత కుర్రాళ్ల పాగా!
X

దక్షిణాఫ్రికాతో తీన్మార్ టీ-20 సిరీస్ సమరానికి సూర్యకుమార్ నాయకత్వంలోని భారత యువ జట్టు సై అంటోంది. బెంగళూరు నుంచి సఫారీ ల్యాండ్ కు బయలుదేరింది...

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సన్నాహాల జోరును ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారత్ మరింత పెంచింది. వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో మరో 7 మాసాలలో జరుగునున్న టోర్నీకి భారత్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది.

4వ ర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా సిరీస్ ను 4-1తో గెలుచుకొన్న భారత్..దక్షిణాఫ్రికా జట్టును సఫారీ ల్యాండ్ వేదికగా ఓడించాలన్న పట్టుదలతో ఉంది.

సీనియర్ స్టార్లు లేకుండానే....

ధూమ్ ధామ్ టీ-20 సిరీస్ ల్లో సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా లాంటి కీలక ఆటగాళ్ళు లేకుండానే భారత్ టీ-20 సిరీస్ ల్లో పాల్గొంటూ వస్తోంది.

ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్ కు అందుబాటులో లేని సీనియర్లు పలు రకాల కారణాలతో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల సిరీస్ కు సైతం దూరమయ్యారు. దీనికితోడు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత టీమ్ మేనేజ్ మెంట్..ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ళందరికీ వరుసగా అవకాశాలు ఇస్తూ తుది జట్టు కోసం కసరత్తులు ప్రారంభించింది.

యువఆటగాళ్ళు సూపర్ హిట్....

ఆస్ట్రేలియా సిరీస్ లో భారత్ 4-1తో విజేతగా నిలవడంలో యువ ఆటగాళ్ళు స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా సూపర్ హిట్ గా నిలిచారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్ తమకు అందివచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగారు. ప్రధానంగా లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ 9 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలవడం ద్వారా సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు తానే తగిన వారసుడనని చాటుకొన్నాడు.

మిస్టర్ టీ-20 నాయకత్వంలో...

కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వివిధ కారణాలతో అందుబాటులో లేకపోడంతో భారత టీ-20 జట్టుకు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్, 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. కెప్టెన్ గా తన పూర్తిస్థాయి సిరీస్ లోనే ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా 4-1 విజయం అందించిన సూర్య..సఫారీలతో సిరీస్ లో అసలు సిసలు పరీక్షను ఎదుర్కోనున్నాడు.

సూర్య కెప్టెన్ గా, ద్రవిడ్ చీఫ్ కోచ్ గా భారత జట్టు బెంగళూరు నుంచి దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లింది. జట్టులోని ఇతర ఆటగాళ్లలో యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్. అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చహార్ ఉన్నారు.

డిసెంబర్ 10 నుంచి 17 వరకూ టీ-20 సిరీస్..

భారత్- దక్షిణాఫ్రికా జట్ల మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ డిసెంబర్ 10 నుంచి 17 వరకూ జరుగనుంది. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు టీ-20, వన్డే సిరీస్ ల్లో ఆల్ రౌండర్ మర్కరమ్ నాయకత్వం వహిస్తున్నాడు.

వన్డే సిరీస్ లో పాల్గొనే భారత జట్టుకు కెఎల్ రాహుల్, టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. దక్షిణాఫ్రికాతో టీ-20, వన్డే సిరీస్ లకు రోహిత్, విరాట్, బుమ్రా దూరంగా ఉండడంతో రింకూ సింగ్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, రజత్ పాటీదార్ లాంటి యువ ఆటగాళ్లకు తొలిసారిగా భారత వన్డే జట్టులో అవకాశం కల్పించారు.

డిసెంబర్ 21 నుంచి వన్డే సిరీస్, డిసెంబర్ 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానున్నాయి.

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా జరిగే రెండు మ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు సెంచూరియన్ పార్క్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరుగనుంది. రెండోటెస్ట్ 2024 జనవరి 3 నుంచి కేప్ టౌన్ వేదికగా నిర్వహిస్తారు.

దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ లో భారత జట్టుకు ముగ్గురు వేర్వేరు(సూర్యకుమార్, రాహుల్, రోహిత్ ) క్రికెటర్లు నాయకత్వం వహిస్తున్నారు.

First Published:  6 Dec 2023 3:51 PM IST
Next Story