Telugu Global
Sports

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ శుభారంభం

బాక్సింగ్, స్విమ్మింగ్‌, హాకీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో భారత జట్లు, అథ్లెట్లు తిరుగులేని విజయాలు నమోదు చేశారు.

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ శుభారంభం
X

బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభమైన 2022 కామన్వెల్త్ గేమ్స్‌ తొలిరోజు పోటీలలో భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా క్రికెట్ గ్రూప్ లీగ్ పోరులో భారత్ చేజేతులా ఓడినా.. బాక్సింగ్, స్విమ్మింగ్‌, హాకీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో భారత జట్లు, అథ్లెట్లు తిరుగులేని విజయాలు నమోదు చేశారు.

మహిళల హాకీలో 5-0 గెలుపు..

టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత మహిళా హాకీ జట్టు బర్మింగ్ హామ్ గేమ్స్ గ్రూప్ లీగ్ పోటీలో శుభారంభం చేసింది. ఆఫ్రికాజట్టు ఘనాతో జరిగిన ఏకపక్ష పోరులో భారత్ 5-0 గోల్స్ తో విజేతగా నిలిచింది. పురుషుల 100 మీటర్ల స్విమ్మింగ్ బ్యాక్ స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్స్ కు చేరడం ద్వారా మెడల్ రౌండ్లో అడుగుపెట్టాడు. శ్రీహరి 54.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవ‌డం ద్వారా తన హీట్స్‌లో తృతీయ స్థానంలో నిలిచాడు.

పాక్ బాక్సర్ కు శివథాపా పంచ్..

పురుషుల బాక్సింగ్ 64 కేజీల తొలి రౌండ్‌లో భారత బాక్సర్ శివ థాపా 5-0తో పాక్ ప్రత్యర్థి సులేమాన్‌ను చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన పోరులో శివ తిరుగులేని విజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీమ్ విభాగంలో భారత్ 5-0తో పాక్ ను చిత్తు చేసింది. కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్, పీవీ సింధు, సాత్విక్‌ -చిరాగ్‌, త్రిసా-గాయత్రి గోపీచంద్‌ జోడీలతో కూడిన భారతజట్టు అలవోక విజయం సాధించింది. పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ అంశాలతో మిక్సిడ్ టీమ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

టేబుల్ టెన్నిస్ లో భారతజట్ల జోరు..

టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల టీమ్ విభాగాలలో భారతజట్లు రెండేసి విజయాలతో టైటిల్ వేటను మొదలు పెట్టాయి. మహిళల టీమ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ గా పతకం వేటకు దిగిన భారతజట్టు గ్రూప్-2 ప్రారంభమ్యాచ్ లో 3-0తో దక్షిణాఫ్రికాను, రెండోరౌండ్లో ఫిజీని 3-0 తోను ఓడించింది. పురుషుల టీమ్ విభాగంలో భారత్ 3-0తో బార్బడోస్ ను, రెండోరౌండ్లో సింగపూర్ ను అధిగమించింది. స్క్వాష్ పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు అనహత్ సింగ్, అభయ్ సింగ్ తొలి విజయాలతో శుభారంభం చేశారు. గత కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టిక మూడోస్థానంలో నిలిచిన భారత్ ప్రస్తుత గేమ్స్ లో మొత్తం 16 క్రీడాంశాల బరిలో 200 కు పైగా అథ్లెట్ల బృందంతో తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

First Published:  30 July 2022 8:52 AM IST
Next Story