ప్రో-హాకీ లీగ్ లో భారత్ భలేగెలుపు!
2023 ప్రపంచ ప్రో- హాకీలీగ్ లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాపైన సైతం భారత్ సంచలన విజయం నమోదు చేసింది.
2023 ప్రపంచ ప్రో- హాకీలీగ్ లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాపైన సైతం భారత్ సంచలన విజయం నమోదు చేసింది...
అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2023 ప్రో-హాకీలీగ్ లో ఒలింపిక్స్ కాంస్య విజేత భారత్ సంచలన విజయాల జోరు టాప్ గేర్ కు చేరింది. రూర్కెలా బిర్సా ముండా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రపంచ మేటి జట్ల ఈ లీగ్ లో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్ర్రేలియా, ప్రపంచ చాంపియన్ జర్మనీతో సహా పలు టాప్ ర్యాంక్ జట్లు పోటీపడుతున్నాయి.
మొన్న జర్మనీ, నిన్న ఆస్ట్ర్రేలియా పైన.....
ప్రపంచ హాకీ అంటే గత దశాబ్దకాలంగా ఆస్ట్ర్రేలియా, జర్మనీ లాంటి అగ్రశ్రేణి జట్ల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ రెండుజట్లపై విజయాలు సాధించడం అంటే ప్రపంచాన్నే జయించడంతో సమానం.
అంతర్జాతీయ హాకీలో ఆస్ట్ర్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి జట్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. సాంప్రదాయ హాకీకి మరో పేరైన భారత్, పాకిస్థాన్ లాంటి జట్లు
తమ ఉనికిని చాటుకోడానికి, అస్థిత్వాన్ని కాపాడుకోడానికీ పోరాడాల్సి వస్తోంది.
ఒడిషా ప్రభుత్వం ప్రోత్సాహం, చొరవ, అండదండలతో భారతహాకీ పునరుజ్జీవనం ప్రారంభమయ్యింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ, ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా లాంటి దిగ్గజ జట్లను ఓడించే స్థితికి భారత్ చేరుకోగలిగింది.
భారత హాకీ అడ్డా ఒడిషా...
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారత హాకీకి అండగా నిలిచారు. భారీగా నిధులు కేటాయిస్తూ అక్కున చేర్చుకొన్నారు. భువనేశ్వర్ లో కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం, రూర్కెలాలో బిర్సాముండా ఇంటర్నేషనల్ స్టేడియాలు నిర్మించడం ద్వారా భారత హాకీకి అంతర్జాతీయ వేదికగా గుర్తింపు తీసుకువచ్చారు.
ప్రపంచకప్ తో పాటు..ప్రపంచ హాకీ లీగ్ టోర్నీలకు సైతం భువనేశ్వర్, రూర్కెలా ఆతిథ్యమిస్తున్నాయి.
ఇటీవలే 2023 ప్రపంచకప్ హాకీ టోర్నీని విజయవంతంగా నిర్వహించిన రూర్కెలా..ఇప్పుడు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రో- హాకీలీగ్ కు సైతం వేదికగా నిలిచింది.
కంగారూలకు భారత్ షాక్...
డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలిమ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ జర్మనీపై 4-3 గోల్స్ తో సంచలన విజయం సాధించిన భారత్...
కీలక రెండోమ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియాను సైతం కంగుతినిపించింది.
ఆఖరి నిముషం వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో భారత్ 5-4 గోల్స్ తో కంగారూలను అధిగమించగలిగింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.
బిర్సాముండా స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో రెండుజట్లూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఆటతీరును ప్రదర్శించాయి,
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్....
ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఈ కీలక మ్యాచ్ లో భారత కెప్టెన్, డ్రాగ్ ఫిక్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ద్వారా తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు. ఆట మొదటి భాగానికే 4-1గోల్స్ తో పైచేయి సాధించిన భారత్ ఆ తర్వాత కంగారూల నుంచి గట్టిపోటీ ఎదురైనా ఆధిక్యాన్ని నిలుపుకోడంలో సఫలం కాగలిగింది. భారత డిఫెండర్లు అత్యుత్తమంగా రాణించడం ద్వారా కంగారూలను నిలువరించగలిగారు.హర్మన్‌ప్రీత్ ఆట 13, 14, 55 నిముషాలలో పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్స్ సాధించాడు. ఇతర ఆటగాళ్లలో జుగరాజ్ సింగ్ ఆట 18వ నిముషంలోనూ, సెల్వం కార్తి 25వ నిముషంలోనూ చెరో గోలు నమోదు చేశారు.
ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్ర్రేలియా తరపున జోషువా బెల్జ్(2ని.), కి విల్లాట్(42ని.), బెన్ స్టెయిన్స్(52ని.), అరాన్ జలెస్కి(56ని.) తలో గోలు సాధించారు. ప్రస్తుత ( 2022-23 )సీజన్ ఈ లీగ్ లో ఆరుమ్యాచ్ లు ఆడిన భారత్ కు ఇది నాలుగో గెలుపు. లీగ్ తదుపరి మ్యాచ్ రెండో అంచె సమరంలో ప్రపంచ చాంపియన్ జర్మనీతో భారత్ పోటీపడుతుంది. తిరిగి బుధవారం ఆస్ట్రేలియాతో రెండో అంచెలో తలపడాల్సి ఉంది.