Telugu Global
Sports

వన్డే ప్రపంచకప్ లో చెమటోడ్చి నెగ్గిన భారత్!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్ తొలిపోరులో చెమటోడ్చి నెగ్గింది

వన్డే ప్రపంచకప్ లో చెమటోడ్చి నెగ్గిన భారత్!
X

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఆతిథ్య భారత్ తొలిపోరులో చెమటోడ్చి నెగ్గింది. ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా పై 6వికెట్ల తేడాతో విజయం సాధించింది...

భారత గడ్డపై నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ప్రపంచ టాప్ ర్యాంకర్, ఆతిథ్య భారత్ తొలివిజయంతో టైటిల్ వేట ప్రారంభించింది. 10జట్ల రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్లో ఆస్ట్ర్రేలియాను అధిగమించింది.

భారత స్పిన్నర్ల మ్యాజిక్.....

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్ర్రేలియాకు భారత స్పిన్ త్రయం పగ్గాలు వేసి 199 పరుగులకే పరిమితం చేశారు.

స్పిన్ బౌలర్ల అడ్డా చెపాక్ లో లెఫ్టామ్ స్పిన్ జోడీ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లతో పాటు వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ సైతం కట్టడితో బౌల్ చేశాడు. మిడిల్ ఓవర్లలో

జడేజా మూడు కీలక వికెట్లు పడగొట్టడంతో కంగారూజట్టు 30వ ఓవర్ కే 5 వికెట్లు నష్టపోయి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో 41 పరుగులు, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 71 బంతుల్లో 46 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు. చివరకు కంగారూజట్టు 199 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, జడేజా 38 పరుగులిచ్చి 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అశ్విన్, హార్థిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

భారత టాపార్డర్ టపటపా..

ఆ తరువాత 200 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ టాపార్డర్ లోని మొదటి ముగ్గురు ( ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ) బ్యాటర్లు

డకౌట్లుగా వెనుదిరిగారు. కంగారూ ఫాస్ట్ బౌలర్ హేజిల్ వుడ్, స్టార్క్ దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో 2 పరుగుల స్కోరుకే 3 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకు పోయింది.

విరాట్, రాహుల్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్..

వరుసగా మూడు వికెట్లు నష్టపోయి దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకొన్న భారత్ ను విరాట్ కొహ్లీ- రాహుల్ జోడీ ఆదుకొన్నారు. సమయోచితంగా బ్యాటింగ్ చేసి 4వ వికెట్ కు 165 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. చెమటోడ్చి ఆడుతూ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించారు.

విరాట్ 116 బంతుల్లో 6 బౌండ్రీలతో 85 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. వన్డే క్రికెట్లో విరాట్ కు ఇది 67వ హాఫ్ సెంచరీ. మరోవైపు..వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్

మాత్రం ఆత్మవిశ్వాసంతో కంగారూ బౌలర్లను ఎదుర్కొంటూ ఆకర్షణీయమైన షాట్లతో అలరించాడు. 115 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ప్రపంచకప్ లో ఓ భారత వికెట్ కీపర్ బ్యాటర్ సాధించిన రెండో అత్యుత్తమ స్కోరుగా రాహుల్ నమోదు చేసిన 97 పరుగుల నాటౌట్ స్కోరు మిగిలిపోతుంది.

భారత్ 41.2 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికే విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది. విరాట్ కొహ్లీ 85 పరుగులకు అవుట్ కాగా, కెఎల్ రాహుల్ 97 పరుగుల నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

భారతగడ్డపై ప్రపంచకప్ టోర్నీలలో భాగంగా ఆడిన మొత్తం 19 మ్యాచ్ ల్లో ఆస్ట్ర్రేలియాకు ఇది కేవలం నాలుగో పరాజయం మాత్రమే. చెన్నై వేదికగా తొలి ఓటమి.

ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగే రెండోరౌండ్లో చిరకాల ప్రత్య్థర్థి పాకిస్థాన్ తో ఈనెల 13న భారత్ తలపడనుంది.

First Published:  9 Oct 2023 4:36 AM GMT
Next Story