Telugu Global
Sports

బంగ్లాతో తొలిటెస్టులో భారత్ భారీగెలుపు

బంగ్లాదేశ్ తో తొలిటెస్టులో భారత్ భారీవిజయం సాధించింది. రెండుమ్యాచ్ ల ఐసీసీ టెస్టులీగ్ సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది.

బంగ్లాతో తొలిటెస్టులో భారత్ భారీగెలుపు
X

బంగ్లాతో తొలిటెస్టులో భారత్ భారీగెలుపు

బంగ్లాదేశ్ తో తొలిటెస్టులో భారత్ భారీవిజయం సాధించింది. రెండుమ్యాచ్ ల ఐసీసీ టెస్టులీగ్ సిరీస్ లో 1-0తో పైచేయి సాధించింది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ తొలిటెస్టులో భారత్ 188 పరుగుల భారీవిజయం సాధించింది. చిట్టగాంగ్ లోని చోటాగ్రామ్ స్టేడియం వేదికగా జరిగిన ఐదురోజులటెస్టు ఆఖరిరోజు ఆట మొదటి రెండుగంటల్లోనే బంగ్లాదేశ్ ను రెండోసారి ఆలౌట్ చేసింది.

500కు పైగా పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన బంగ్లాజట్టు రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులు మాత్రమే చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

భారత స్పిన్ లో బంగ్లా గల్లంతు..

నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి సాధించిన 6 వికెట్ల నష్టానికి స్కోరుతో ఆఖరిరోజు ఆట కొనసాగించిన బంగ్లాజట్టు ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది.

భారత స్పిన్ త్రయం అశ్విన్, అక్షర్, కుల్దీప్ కలసి రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు పడగొట్టారు. ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లకు చెరో వికెట్ దక్కింది.

లెప్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 4 వికెట్లు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

జకీర్, షకీబుల్ హసన్ పోరాటం...

తొలి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాజట్టు...రెండో ఇన్నింగ్స్ లో మాత్రం మెరుగైన ఆటతీరు ప్రదర్శించింది. ఓపెనర్ జకీర్ హసన్ తన అరంగేట్రం టెస్టుమ్యాచ్ లోనే ఫైటింగ్ సెంచరీ సాధించాడు. 224 బాల్స్ లో 13 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 100 పరుగుల స్కోరుకు అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ నజ్ముల్ హసన్ సాంటో 67 పరుగులకు వెనుదిరిగాడు.

మిడిలార్డర్లో కెప్టెన్ షకీబుల్ హసన్ పోరాడి ఆడి 6 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 84 పరుగులు సాధించినా ప్రయోజనం లేకపోయింది. స్టార్ ప్లేయర్లు లిట్టన్ దాస్ 19, ముష్ ఫికుర్ రహీం 23, ఆల్ రౌండర్ మెహిదీ హసన్ 13 పరుగుల స్కోర్లకు అవుటయ్యారు.

బ్యాటింగ్ లో పూజారా..బౌలింగ్ లో కుల్దీప్..

భారత టెస్టు జట్టులో 22మాసాల తర్వాత తిరిగి చోటు సంపాదించిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొడితే, టాపార్డర్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత టెస్టు శతకం సాధించడం ద్వారా భారత విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

తొలిఇన్నింగ్స్ లో 90 పరుగులకు అవుటైన పూజారా రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

రెండు ఇన్నింగ్స్ లోనూ మొత్తం 8 వికెట్లు పడగొ్ట్టిన కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ లోని రెండోటెస్టుమ్యాచ్ మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా డిసెంబర్ 22న ప్రారంభమవుతుంది.

First Published:  18 Dec 2022 11:03 AM IST
Next Story