కుస్తీలో భారత వస్తాదుల పసిడి పట్టు..
బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ కుస్తీ బరిలోకి భారీఅంచనాలతో దిగిన భారత వస్తాదులు స్థాయికి మించి రాణించారు. గేమ్స్ ఎనిమిదోరోజు పోటీలలో భాగంగా జరిగిన కుస్తీ ఆరు విభాగాల పోరులో భారత వస్తాదులు మూడు స్వర్ణ, ఒక రజత, 2 కాంస్య పతకాలు సాధించారు.
కామన్వెల్త్ గేమ్స్ కుస్తీ తొలిరోజు పోటీలలోనే భారత వస్తాదులు బంగారు మోత మోగించారు. మూడు స్వర్ణాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించారు. లాన్ బౌల్స్ పురుషుల ఫోర్స్ ఫైనల్స్ కు భారతజట్టు చేరుకోవడం ద్వారా గోల్డ్ మెడల్ రేస్ లో నిలిచింది. బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో భారత టాప్ స్ట్రార్ల విజయపరంపర కొనసాగుతోంది. టేబుల్ టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. మహిళల హాకీలో భారత బంగారు కలలు కల్లలయ్యాయి. మహిళల 200 మీటర్ల పరుగులో హిమాదాస్ పోటీ ముగిసింది.
బజరంగ్, దీపక్, సాక్షీల గోల్డెన్ షో..
బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ కుస్తీ బరిలోకి భారీఅంచనాలతో దిగిన భారత వస్తాదులు స్థాయికి మించి రాణించారు. గేమ్స్ ఎనిమిదోరోజు పోటీలలో భాగంగా జరిగిన కుస్తీ ఆరు విభాగాల పోరులో భారత వస్తాదులు మూడు స్వర్ణ, ఒక రజత, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల 62 కిలోల విభాగం ఫైనల్లో భారత సూపర్ స్టార్ వస్తాదు బజరంగ్ పూనియా అలవోక విజయం సాధించాడు. కెనడాకు చెందిన లాచ్లాన్ మెక్లీన్ ను పడగొట్టడం ద్వారా పసిడిపతకం అందుకొన్నాడు. కామన్వెల్త్ గేమ్స్ లో బజరంగ్ పూనియా స్వర్ణం సాధించడం ఇది వరుసగా రెండోసారి. మహిళల 62 కిలోల బంగారు పతకం పోరులో భారత వస్తాదు సాక్షి మాలిక్ విజేతగా నిలిచింది. కెనడాకు చెందిన అనా గాడీనెజ్ ను సాక్షి పడగొట్టడం ద్వారా భారత్ కు కుస్తీలో రెండో స్వర్ణం అందించింది. పురుషుల 86 కిలోల విభాగం ఫైనల్స్ లో దీపక్ పూనియా ప్రత్యర్థి పాక్ వస్తాదు మహ్మద్ ఇనామ్ పై విజయంతో స్వర్ణ పతకం సాధించాడు. మహిళల 57కిలోల ఫైనల్లో నైజీరియా వస్తాదు ఒడునాయి ఫోల్సాడే చేతిలో ఓటమి పొందిన అన్షు మాలిక్ రజత పతకంతో సరిపెట్టికోవాల్సి వచ్చింది. మహిళల 68 కిలోల విభాగంలో దివ్య కక్రాన్ సైతం కాంస్య పతకం సాధించింది. పురుషుల 125 కిలోల విభాగంలో మోహిత్ గ్రేవాల్ కాంస్య పతకం సాధించాడు. కేవలం కుస్తీలోనే భారత్ 6 పతకాలు సంపాదించింది.
బ్యాడ్మింటన్ క్వార్టర్స్ లో సింధు,సేన్, శ్రీకాంత్..
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత ఆశాకిరణం పీవీ సింధు అలవోకగా చేరుకొంది. పురుషుల సింగిల్స్ లో సైతం భారత ఆటగాళ్లు కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ విజయాలతో పతకాలకు మరింత చేరువయ్యారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోనే మనికా బాత్ర పోరు ముగిసింది. పురుషుల సింగిల్స్ లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు శరత్ కమల్, సత్యన్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకొన్నారు. మహిళల 200 మీటర్ల పరుగు సెమీఫైనల్లోనే హిమాదాస్ పోటీ ముగిసింది. తన హీట్ లో హిమాదాస్ మూడోస్థానంలో నిలవడం ద్వారా రేస్ నుంచి నిష్క్రమించింది.
హాకీ షూటౌట్ లో భారత్ అవుట్..
మహిళల హాకీ ఫైనల్స్ చేరాలన్న భారత ఆశలు అడియాసలయ్యాయి. గోల్డ్ మెడల్ రౌండ్లో చోటు కోసం హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియాతో ముగిసిన తొలిసెమీఫైనల్లో భారత్ అడుగడుగునా గట్టిపోటీ ఇచ్చింది. ఆట నిర్ణత సమయంలో రెండుజట్లు చెరో గోల్ చేసి సమఉజ్జీలుగా నిలవడంతో విజేతను పెనాల్టీ షూటౌట్ ద్వారా నిర్ణయించారు. షూటౌట్ లో కంగారూ జట్టు 3-0తో నెగ్గడం ద్వారా భారత్ ను కాంస్య పతకం రౌండ్ కే పరిమితం చేసింది.
పతకాల పట్టిక 5వ స్థానంలో భారత్..
కామన్వెల్త్ గేమ్స్ 8వ రోజు పోటీలు ముగిసే సమయానికి భారత్.. పతకాల పట్టిక 5వ స్థానంలో నిలిచింది. గత రెండురోజులుగా 7వ స్థానానికి పడిపోయిన భారత్.. కుస్తీలో సాధించిన మూడు బంగారు పతకాలతో పుంజుకోగలిగింది. భారత్ మొత్తం 9 స్వర్ణ, 8 రజత, 9 కాంస్యాలతో సహా 26 పతకాలు సాధించింది. 140 పతకాలతో ఆస్ట్రేలియా, 131 పతకాలతో ఆతిథ్య ఇంగ్లండ్, 67 పతకాలతో కెనడా మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ 4, భారత్ 5, స్కాట్లాండ్ 6, దక్షిణాఫ్రికా 7 స్థానాలలో నిలిచాయి. కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తం 72 దేశాలజట్లు బరిలో నిలిస్తే 35 దేశాలు మాత్రమే ఏదో ఒక పతకం సాధించగలిగాయి. ఆగస్టు 8న ఈ క్రీడలు ముగియనున్నాయి.