Telugu Global
Sports

ఆసియా క్రీడల మహిళా క్రికెట్ సెమీస్‌లో భారత్!

ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జ‌ట్టు సెమీఫైనల్స్ కు చేరుకొంది. భారత ఓపెనర్ షఫాలీ వర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది.

ఆసియా క్రీడల మహిళా క్రికెట్ సెమీస్‌లో భారత్!
X

చైనాలోని హాంగ్జు వేదికగా.. ఏడాది ఆలస్యంగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల క్రికెట్ మహిళల విభాగంలో భారత్ మెడల్ రౌండ్లో చోటు ఖాయం చేసుకొంది.

క్రీడల ప్రారంభానికి నాలుగు రోజుల ముందే..

వాస్తవానికి 2022 సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా క్రీడల్ని కరోనా భయంతో ఏడాది పాటు వాయిదా వేసి.. 2023 సెప్టెంబర్ 23 నుంచి నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. అయితే.. క్రికెట్, ఫుట్ బాల్ లాంటి పలు రకాల క్రీడాంశాలను మాత్రం అధికారికంగా ప్రారంభం కావటానికి కొద్దిరోజుల ముందే నిర్వహిస్తున్నారు. మొత్తం 10 జట్లు తలపడుతున్న మహిళా క్రికెట్ గ్రూప్ లీగ్ క్వార్టర్ ఫైనల్లో భారత్- మలేసియా జట్ల పోరుకు వానదెబ్బ తగిలింది.

19 ఏళ్ల వయసులో షఫాలీ వర్మ అరుదైన రికార్డు..

హాంగ్జు వేదికగా మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2 వికెట్లకు 173 పరుగుల భారీ స్కోరు సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవ‌ర్ల‌కు కుదించారు. అయితే, మలేషియా లక్ష్య ఛేదనకు దిగిన వెంటనే మళ్లీ వర్షం మొదలుకావడంతో మ్యాచ్ ర‌ద్దు అయింది. నిబంధనల ప్రకారం మలేసియా కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన భారత జట్టు సెమీస్‌కి చేరినట్లుగా నిర్వాహక సంఘం ప్రకటించింది.

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ 39 బంతుల్లో 67 పరుగులు సాధించింది. హాఫ్ సెంచరీలో 5 సిక్సర్లు, 4 బౌండ్రీలున్నాయి. ఆసియా క్రీడల మహిళా క్రికెట్ చరిత్రలో కేవలం 19 ఏళ్ల‌ ప్రాయంలోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన భారత మహిళగా ష‌ఫాలీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

మరో ఓపెనర్ స్మృతి మంధన 16 బంతుల్లో 27 పరుగులకు అవుట్ కాగా.. వన్ డౌన్ జెమీమా రోడ్రిగేజ్ 29 బంతుల్లో 47, రిచా ఘోశ్ 7 బంతుల్లో 21 పరుగుల స్కోర్లతో అజేయంగా నిలిచారు. రెండో వికెట్‌కు ష‌ఫాలీ- జెమీమా జోడీ 86 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం ఓపెనర్ ష‌ఫాలీ సైతం అవుటయ్యింది.

డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం మలేసియా ఎదుట భారత్ 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. మలేసియా జట్టు చేజింగ్‌కు దిగి 2 బంతుల్లో 1 పరుగులు చేసిన సమయంలో కుండపోతగా వర్షం కుర‌వ‌డంతో మ్యాచ్ రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. హర్మన్ ప్రీత్ కౌర్‌పై రెండు మ్యాచ్‌ల‌ సస్పెన్షన్ ఉన్న కారణంగా జట్టుకు స్మృతి మందాన కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.

ఆసియాకప్ మహిళా క్రికెట్లో తలపడుతున్న ఇతర అగ్రశ్రేణి జట్లలో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సైతం ఉన్నాయి. భారత జట్టు బంగారు పతకం గెలుచుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్‌కు ప్రధానంగా శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. పురుషుల విభాగంలో భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నాడు.


First Published:  21 Sept 2023 10:27 AM GMT
Next Story