ఆసియా కప్‌లో భారత్-పాక్ సమరం నేడే!
2022 ఆసియా కప్ క్రికెట్ టోర్నీరెండో రోజునే అతిపెద్ద సమరానికి అబుదాబీలోని షేక్ జాయేద్ స్టేడియం వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7-30 గంటలకు జరిగే ఈ భీకర పోరులో భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.
క్రీడలు ఏవైనా..దాయాది జట్లు భారత్, పాకిస్థాన్ ప్రత్యర్థులుగా ఉంటే అది నిజంగా ఓ భీకర పోరు లాంటిదే. రెండు దేశాల క్రికెట్ అభిమానుల భావోద్వేగాల సమరమే. క్రికెట్లో ఈ రెండు జట్లూ తలపడుతున్నాయంటే చాలు..మీడియా హైప్, ఆర్భాటం అంతా ఇంతా కాదు. తమ రేటింగ్ పెంచుకోడానికి ప్రపంచ యుద్ధమే జరుగుతున్నట్లుగా నానా హంగామా చేయడం మనం తరచూ చూస్తున్నదే. ఆ పరంపరలో భాగంగా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన 2022 ఆసియా కప్ టీ-20 టోర్నీ గ్రూప్- ఏ లీగ్ తొలి పోరులో దిగ్గజ జట్లు భారత్, పాకిస్థాన్ సై అంటే సై అంటున్నాయి.
తొలిపోరే టెన్షన్ టెన్షన్‌గా...
హాంకాంగ్ ప్రత్యర్థిగా ఉన్న గ్రూప్ -ఏ లీగ్ నుంచి భారత్, పాక్ జట్లు సూపర్ -4 రౌండ్ చేరుకోడం ఖాయమే అయినా...తొలి గెలుపు కోసం తొలి రౌండ్ పోరులోనే ఢీ కొంటున్నాయి. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు బాబర్ అజమ్ నాకయత్వంలోని పాకిస్థాన్‌తో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సవాలు విసురుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌కు సన్నాహాలలో భాగంగా ఆసియా కప్ బరిలో ఆసియా అగ్రశ్రేణి జట్లు నిలిచాయి. ఇటు భారత్, అటు పాక్ జట్లు తమతమ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు లేకుండానే పోటీకి దిగుతున్నాయి. పాక్ తురుపుముక్క షాహీన్ అఫ్రిది, భారత ప్రధాన అస్త్రం జస్ ప్రీత్ బుమ్రా గాయాలతో జట్లకు దూరమయ్యారు.
అటు బాబర్, ఫకర్, అసీఫ్...ఇటు రోహిత్, విరాట్, సూర్య
షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరిగే ఈ పోరులో రెండు జట్లు శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్‌తో పోటీకి సిద్ధమయ్యాయి. పాకిస్థాన్ జట్టుకు ప్రపంచ టాప్ ర్యాంక్ ఆటగాడు బాబర్ అజమ్ వెన్నెముకలా ఉన్నాడు. ఫకర్ జమాన్, అసీఫ్ అలీలు సైతం నిలకడగా రాణిస్తూ తమ బ్యాటింగ్ లైనప్‌కు కొండంత అండగా నిలుస్తూ వస్తున్నారు. మరోవైపు...డాషింగ్ ఓపెనింగ్ జోడీ కెఎల్ రాహుల్- రోహిత్ శర్మ ఇచ్చే ఆరంభంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎడాపెడాషాట్లు కొడుతూ చెలరేగిపోయే సూర్యకుమార్ యాదవ్, సూపర్ హిట్టర్లు హార్థిక్ పాండ్యా, రిషభ్ పంత్, లోయర్ ఆర్డర్లో భారీ ఇన్నింగ్స్ ఆడటంలో దిట్ట రవీంద్ర జడేజాలతో..భారత్ భీకరమైన జట్టుగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, హార్థిక్ పాండ్యా, యజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్, జడేజాలతో సమతూకంగా ఉంది.
భారత్ దే పైచేయి...
ఆసియా కప్‌లో ఇప్పటి వరకూ భారత్ ఏడు సార్లు విజేతగా నిలిస్తే...పాకిస్థాన్ జట్టు రెండు సార్లు మాత్రమే విన్నర్ ట్రోఫీ సాధించగలిగింది.అయితే పాక్ ప్రత్యర్థిగా భారత్‌దే పైచేయిగా ఉంది. ఆసియా కప్‌లో భాగంగా ఈ రెండు జట్లు గత టోర్నీ వరకూ తొమ్మిది సార్లు తలపడితే..భారత్ 6 విజయాలు, పాక్ 2 విజయాలు సాధించాయి. మొత్తం మీద ఈ రెండు జట్లు వివిధ టోర్నీలలో భాగంగా 14 సార్లు తలపడితే భారత్ 8, పాకిస్థాన్ 5 విజయాల రికార్డుతో నిలిచాయి.
విరాట్ కోహ్లీదే అగ్రస్థానం...
టీ-20 ఫార్మాట్‌లో పాకిస్థాన్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీదే అగ్రస్థానం. విరాట్ 78 పరుగులు అత్యధిక స్కోరుతో మొత్తం 7 ఇన్నింగ్స్ లో 311 పరుగులు సాధించాడు. 3 అర్థ శతకాలతో 118.25 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. పాకిస్థాన్ తరపున భారత్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్ నిలిచారు. 2019లో చివరిసారిగా తన తొలి అంతర్జాతీయ శతకం బాదిన విరాట్ కోహ్లీ...గత వెయ్యి రోజులుగా పరుగుల కోసం నానాపాట్లు పడుతున్నాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించలేక సతమతమవుతున్నాడు. పాక్‌తో జరిగే ఈ మ్యాచ్ విరాట్‌కు చావోబతుకో సమరంలా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ...పాకిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా పూర్వ ప్రాభవం సాధించాలని అభిమానులు కోరుకొంటున్నారు. రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పసందైన విందే అనడంలో ఏమాత్రం సందేహంలేదు.