Telugu Global
Sports

బార్బడోస్ లో నేడే భారత్- విండీస్ తొలివన్డే..

వన్డే ప్రపంచకప్ లో రెండుసార్లు విజేత భారత్..2023 ప్రపంచకప్ సన్నాహాలలో భాగంగా తొలి సిరీస్ లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ తో తలపడనుంది. తీన్నార్ సిరీస్ లోని ఈ తొలివన్డేకి బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా నిలిచింది.

బార్బడోస్ లో నేడే భారత్- విండీస్ తొలివన్డే..
X

బార్బడోస్ లో నేడే భారత్- విండీస్ తొలివన్డే..

భారత్- వెస్టిండీస్ జట్ల తీన్మార్ సిరీస్ లోని తొలివన్డేకి కరీబియన్ ద్వీపాలలోని బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా రంగం సిద్ధమయ్యింది.రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది...

వన్డే ప్రపంచకప్ లో రెండుసార్లు విజేత భారత్..2023 ప్రపంచకప్ సన్నాహాలలో భాగంగా తొలి సిరీస్ లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ తో తలపడనుంది. తీన్నార్ సిరీస్ లోని ఈ తొలివన్డేకి బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ తొలిసమరం జరుగనుంది.

భారత్ 3, వెస్టిండీస్ 10....

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 3వ ర్యాంక్ లో ఉంటే..వెస్టిండీస్ 10వ ర్యాంక్ లో కొట్టిమిట్టాడుతోంది. భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో కరీబియన్ జట్టు తొలిసారిగా విఫలమయ్యింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో 1975, 1979 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ లేకుండా వన్డే ప్రపంచకప్ జరుగనుండటం ఇదే తొలిసారి.

అయితే..భారత్ ప్రపంచకప్ సన్నాహాల ప్రారంభ సిరీస్ కు వెస్టిండీసే ఆతిథ్యమిస్తోంది. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లో వెస్టిండీస్ జట్టుకు ఆల్ రౌండర్ షాయ్ హోప్, భారత్ కు డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు.

షమీ, సిరాజ్ లేకుండానే బరిలో భారత్..

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, హార్థిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లాంటి మేటి బ్యాటర్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టగా కనిపిస్తున్నా..పేస్ జోడీ మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు లేని బౌలింగ్ ఎటాక్ మాత్రం అనుభవం లేమిగా మిగిలింది.

జయదేవ్ ఉనద్కత్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్ లాంటి పేసర్లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది.

స్పిన్ బౌలింగ్ విభాగంలో మాత్రం రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు..హోప్ నాయకత్వంలోని కరీబియన్ జట్టులో రోవ్ మన్ పావెల్, అలిక్ అత్నాజే, డోమనిక్ డ్రేక్స్, హెట్ మేయర్, బ్రెండన్ కింగ్, కీల్ మేయర్స్ లాంటి ఆటగాళ్లున్నారు. బ్యాటింగ్ పవర్ తో ఉరకలేస్తున్న భారత్ ను నిలువరించడం కరీబియన్ జట్టుకు కత్తిమీద సాము లాంటిదే.

15 సిరీస్ లుగా ఓటమి లేని భారత్...

వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత 15 వన్డే సిరీస్ ల్లోనూ విజేతగా నిలుస్తూ వచ్చిన భారత్ మరోసారి హాట్ ఫేవరెట్ గా ప్రస్తుత సిరీస్ బరిలోకి దిగుతోంది. వరుసగా 16వ సిరీస్ కు గురి పెట్టింది.

2006లో చివరిసారిగా భారత్ పై నెగ్గిన కరీబియన్ టీమ్ ..మరో సిరీస్ గెలుపు కోసం ఎదురుచూస్తోంది. అయితే..ప్రస్తుత రెండుజట్ల బలాబలాలను బట్టి చూస్తే అదేమంత తేలికకాదు.

ఈ రెండుజట్లూ ప్రస్తుత సిరీస్ కు ముందు వరకూ 139 వన్డేల్లో తలపడితే భారత్ 70 విజయాలు, వెస్టిండీస్ 63 విజయాల రికార్డుతో ఉన్నాయి. రెండుమ్యాచ్ ల టై కాగా..నాలుగు వన్డేలు ఫలితం తేలకుండానే ముగిశాయి.

రోహిత్, విరాట్ లను ఊరిస్తున్న రికార్డులు..

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ లో స్థాయికి తగ్గట్టుగా ఆడగలిగితే పలు సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. భారత కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఏకంగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డుకే గురి పెట్టాడు. అత్యంత వేగంగా వన్డేలలో 10వేల పరుగులు సాధించిన ఓపెనర్ గా నిలవటానికి తహతహలాడుతున్నాడు.

వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకూ 9వేల 825 పరుగులు సాధించిన రోహిత్ ప్రస్తుత సిరీస్ లో మరో 175 పరుగులు చేయగలిగితే..అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని చేరిన భారత రెండో బ్యాటర్ గా నిలువగలుగుతాడు.

రన్ మెషీన్ విరాట్ కొహ్లీ 205 ఇన్నింగ్స్ లోనే 10వేల పరుగులు సాధించడం ద్వారా ఇప్పటి కే రికార్టు నెలకొల్పాడు. మాస్టర్ సచిన్ 259,సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్ లో 10వేల పరుగులు సాధించగలిగారు.

236 ఇన్నింగ్స్ లో 9వేల 825 పరుగులు సాధించిన రోహిత్ మరో మూడు ఇన్నింగ్స్ లో 175 పరుగులు చేయగలిగితే 239 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించిన బ్యాటర్ గా నిలిచే అవకాశం ఉంది.

13వేల రికార్డుకు చేరువగా విరాట్...

భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ లోని మూడుమ్యాచ్ ల్లో మరో 102 పరుగులు చేయగలిగితే 13వేల పరుగుల మైలురాయిని చేరిన 5వ బ్యాటర్ గా, భారత రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరే అవకాశం ఉంది.

వన్డే క్రికెట్లో 13వేల పరుగులు సాధించిన నలుగురు మొనగాళ్లలో సచిన్ టెండుల్కర్ ( 18వేల 426 పరుగులు), కుమార సంగక్కర ( 14వేల 234 ), రికీ పాంటింగ్ ( 13వేల 704 ), సనత్ జయసూర్య (13వేల 430 ) ఉన్నారు. విరాట్ కొహ్లీ 12వేల 898 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. మాస్టర్ సచిన్ తర్వాత 13వేలవన్డే పరుగులు సాధించిన బ్యాటర్ ఘనతను విరాట్ సొంతం చేసుకోగలుగుతాడు.

డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు ఈ సిరీస్ తొలిపోరులో చోటు దక్కుతుందా?..అనుమానమే. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ సిరీస్ ప్రత్యక్షప్రసారాలను డీడీ స్పోర్ట్స్, జియో సినిమాల ద్వారా వీక్షించ వచ్చు.

First Published:  27 July 2023 1:00 PM IST
Next Story