Telugu Global
Sports

మితిమీరిన ప్రయోగాలతో చేతులు కాలిన భారత్!

వన్డే క్రికెట్ పదో ర్యాంకర్ వెస్టిండీస్ చేతిలో 3వ ర్యాంకర్ భారత్ కు ఘోరపరాజయం ఎదురయ్యింది. వికటించిన ప్రయోగాలతో రోహిత్ సేన చేతులు కాల్చుకొంది.

మితిమీరిన ప్రయోగాలతో చేతులు కాలిన భారత్!
X

మితిమీరిన ప్రయోగాలతో చేతులు కాలిన భారత్!

వన్డే క్రికెట్ పదో ర్యాంకర్ వెస్టిండీస్ చేతిలో 3వ ర్యాంకర్ భారత్ కు ఘోరపరాజయం ఎదురయ్యింది. వికటించిన ప్రయోగాలతో రోహిత్ సేన చేతులు కాల్చుకొంది.

రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్లు లేకుంటే భారత వన్డేజట్టు సాధించగలిగేది ఏదీలేదని మరోసారి తేటతెల్లమయ్యింది. త్వరలో జరిగే ఆసియాకప్, అక్టోబర్లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల ప్రారంభానికి ముందే తుదిజట్టు కూర్పుకోసం భారత టీమ్ మేనేజ్ మెంట్ చేస్తున్న ప్రయోగాలు బెడిసి కొట్టాయి.

ఓపెనింగ్ నుంచి రెండో డౌన్ వరకూ యువబ్యాటర్ల నుంచి సీనియర్ క్రికెటర్లను మార్చి చూసినా ప్రయోజనం లేకపోయింది.

9 విజయాల తర్వాత తొలి ఓటమి...

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లో భారత్ కు అనూహ్య ఓటమి ఎదురయ్యింది. వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో విఫలమై, అఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే లాంటి జట్ల చేతిలో సైతం పరాజయాలు చవిచూస్తూ పాతాళానికి పడిపోయిన కరీబియన్ జట్టు..భారత్ ప్రత్యర్థిగా తొమ్మిది వరుస పరాజయాల తర్వాత తొలివిజయాన్ని చవిచూసింది.

బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన తొలివన్డేలో 5వికెట్ల ఓటమి పొందిన విండీస్ నెగ్గితీరాల్సిన రెండోవన్డేలో భారత్ పై 6 వికెట్ల విజయంతో సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.

చతికిలబడిన స్టాండ్ బై ప్లేయర్లు....

రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ లాంటి కీలక బ్యాటర్లు గాయాలతో అందుబాటులో లేకపోడంతో..వారిస్థానాలలో ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లను ఆడిస్తూ భారత టీమ్ మేనేజ్ మెంట్ చేస్తున్న ప్రయోగాలు వికటిస్తూ వస్తున్నాయి.

వీరిలో ఇషాన్ కిషన్ మాత్రమే ఓపెనర్ గా బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగలిగాడు. మిగిలిన బ్యాటర్లంతా విఫలం కావడం భారత అవకాశాలను దెబ్బతీస్తూ వస్తోంది. దీనికితోడు దిగ్గజ బ్యాటర్ల జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలను సైతం పక్కన పెట్టడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.

181 పరుగులకే భారత్ టపటపా!

బౌలర్ల అడ్డా కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ పైనే జరిగిన కీలక రెండోవన్డేలో భారత టీమ్ మేనేజ్ మెంట్ ప్రయోగాలు పతాకస్థాయికి చేరాయి. ప్రత్యర్థిజట్టును పొరపాటుగా అంచనా వేయడం, మితిమీరిన ఆత్మవిశ్వాసం నిలువునా ముంచింది.

కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కొహ్లీలకు విశ్రాంతి నిచ్చి..హార్థిక్ పాండ్యా నాయకత్వంలో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో మ్యాచ్ లో 40.1 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనింగ్ జోడీ ఇషాన్ కిషన్- శుభ్ మన్ గిల్ 90 పరుగుల భాగస్వామ్యంతో కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చినా భారత బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ లా కూలిపోయింది.

ఓపెనర్లతో పాటు సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. చివరకు సంజు శాంసన్ సైతం రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక 9 పరుగులకే వెనుదిరిగాడు.

ఇషాన్ కిషన్ 55 బంతుల్లో 55 పరుగులతో వరుసగా రెండో హాఫ్ సెంచరీతో ఆకట్టుకొన్నాడు. శుభ్ మన్ గిల్ 49 బంతుల్లో 34 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. భారత్ తన చివరి 5 వికెట్లు కేవలం 23 పరుగుల వ్యవధిలో నష్టపోయింది.

సమాధానంగా ..182 పరుగుల విజయలక్ష్యాన్ని కరీబియన్ జట్టు 36.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే సాధించి 6 వికెట్ల విజయంతో సిరీస్ విజయం ఆశల్ని సజీవంగా నిలుపుకొంది.

కెప్టెన్ షాయ్ హోప్ ( 63), మిడిలార్డర్ బ్యాటర్ కేసీ కార్టీ 48 నాటౌట్ స్కోర్లతో తమజట్టుకు.భారత్ ప్రత్యర్థిగా తొమ్మిది పరాజయాల తర్వాత తొలివిజయాన్ని అందించారు.

హోప్ 80 బంతుల్లో 63, కార్టీ 65 బంతుల్లో 48 పరుగులు సాధించారు. మరో 80 బంతులు మిగిలి ఉండగానే కరీబియన్ జట్టు కళ్లు చెదిరే విజయం సాధించింది.

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.

కుర్రాళ్లకు అవకాశాల కోసమే- ద్రావిడ్

బెంచ్ లో ఉన్న బ్యాటర్లకు తగిన అవకాశాలు కల్పించడం కోసమే రోహిత్, విరాట్ లకు విశ్రాంతి నిచ్చామని, కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా వారి సత్తాను పరీక్షిస్తున్నట్లు రెండో వన్డే ఓటమి అనంతరం భారత చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు.

కొత్తవారికి అవకాశాలు ఇవ్వటానికి ప్రస్తుత సిరీసే తగినదని, ఆసియాకప్ ప్రారంభానికి ముందే వివిధ బ్యాటర్లు, బౌలర్లకు అవకాశమిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుత ఈ మూడుమ్యాచ్ ల సిరీస్ లోని నిర్ణయాత్మక ఆఖరి వన్డే తారుబాలోని సర్ బ్రియన్ లారా స్టేడియం వేదికగా మంగళవారం జరుగనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువనుంది.

భారత స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఆఖరివన్డేలో పాల్గొనటం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  30 July 2023 10:46 AM GMT
Next Story