Telugu Global
Sports

భారత్ కు డూ ఆర్ డై...నేడే నాలుగో టీ-20

భారత్- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో కరీబియన్ ద్వీపాల నుంచి అమెరికాలోని ఫ్లారిడాకు చేరింది. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిర్ణయాత్మక నాలుగో టీ-20కి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

భారత్ కు డూ ఆర్ డై...నేడే నాలుగో టీ-20
X

భారత్- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో కరీబియన్ ద్వీపాల నుంచి అమెరికాలోని ఫ్లారిడాకు చేరింది. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ నిర్ణయాత్మక నాలుగో టీ-20కి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది...

టీ-20 ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ లోని ఆఖరి అంచె పోటీలు అమెరికాలోని ఫ్లారిడా వేదికగా ఈ రోజు ప్రారంభంకానున్నాయి.

మొత్తం ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడు మ్యాచ్ లకు ట్రినిడాడ్ అండ్ టొబాగో, గయానా దేశాలు ఆతిథ్యమిస్తే..చివరి రెండుమ్యాచ్ లకు అమెరికాలోని ఫ్లారిడా లౌడర్ హిల్ స్టేడియం వేదికగా నిలిచింది.

భారత్ కు సిరీస్ సంకటం......

సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ లు ముగిసేసమయానికి ఆతిథ్య వెస్టిండీస్ జట్టు 2-1తో పైచేయి సాధించడంతో ఈరోజు జరిగే నాలుగోమ్యాచ్ టాప్ ర్యాంకర్ భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారత్ సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ రోజు జరిగే కీలక పోరులో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

గయానాలో ముగిసిన కీలక మూడో మ్యాచ్‌ లో 7 వికెట్ల అలవోక విజయం సాధించడం ద్వారా భారత్ సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది. మరోవైపు

రోవ్ మన్ పావెల్ నాయకత్వంలోని కరీబియన్ జట్టు సైతం నాలుగోమ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్ వెస్టిండీస్ కు చెలగాటం..భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

పరుగుల వెల్లువ ఖాయం....

సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ ల్లో 150 నుంచి 160 మధ్య స్కోర్లు మాత్రమే నమోదు కాగా.. ఫ్లారిడా వేదికగా జరుగనున్న ఆఖరి రెండుమ్యాచ్ ల్లో మాత్రం..భారీస్కోర్లు రావడం ఖాయమని క్యురేటర్ చెబుతున్నారు.

లౌడర్ హిల్ క్రికెట్ గ్రౌండ్స్ తక్కువ నిడివిగల బౌండ్రీలకు తోడు..పిచ్ సైతం బ్యాటింగ్ కు అనువుగా ఉండడంతో 180 నుంచి 200కు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. పైగా రెండుజట్లలోని స్ట్ర్రోక్ మేకర్లకు పరుగుల పండుగేకానుంది. మరోవైపు రెండుజట్ల బౌలర్ల సత్తాకు అసలు సిసలు పరీక్షకానుంది.

భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఒకటి లేదా రెండుమార్పులు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న శుభ్ మన్ గిల్ ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్ ను తిరిగి చేర్చుకొనే ఆలోచనలో టీమ్ మేనేజ్ మెంట్ ఉంది. మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు సైతం తుదిజట్టులో చోటు కల్పించనున్నారు. అర్షదీప్ సింగ్ స్థానంలో ఉమ్రాన్ ను చేర్చనున్నారు.

వెస్టిండీస్ సూపర్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, కెప్టెన్ రోవ్ మన్ పావెల్, జాన్సన్ చార్లెస్ లకు ఫ్లారిడా వేదికగా కళ్లు చెదిరే రికార్డే ఉంది.

భారత బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు 95 టీ-20 వికెట్లు తీసిన అనుభవం ఉంది. 100 వికెట్ల మైలురాయిని చేరాలంటే మిగిలిన రెండుమ్యాచ్ ల్లో మరో ఐదు వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

2016 నుంచి అజేయంగా భారత్..

టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ కు వెస్టిండీస్ ప్రత్యర్థిగా 2016 తర్వాత నుంచి సిరీస్ ఓటమి లేకపోవడం విశేషం. ప్రస్తుత నాలుగో టీ-20లో కరీబియన్ జట్టు నెగ్గగలిగితే ఏడేళ్ల విరామం తర్వాత భారత్ పై ఓ సిరీస్ నెగ్గినట్లవుతుంది.

టీ-20 ఫార్మాట్లో వెస్టిండీస్ పై భారత్ కు 18 విజయాలు, భారత్ పై వెస్టిండీస్ కు 9 విజయాల రికార్డు ఉంది.

2022లో చివరిసారిగా ఈ రెండుజట్లూ లౌడర్ హిల్ వేదికగా తలపడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ భారతజట్టే విజేతగా నిలిచింది. 191, 188 స్కోర్లను భారతజట్టు కాపాడుకోగలిగింది.

ఫ్లారిడా పిచ్ పైన ఇప్పటి వరకూ ఆడిన 13 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే 11సార్లు విజేతగా నిలిచాయి. గత రికార్డును బట్టి..

టాస్ నెగ్గినజట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని ప్రత్యర్థి ఎదుట భారీలక్ష్యం ఉంచే వ్యూహాన్ని అనుసరించడం ఖాయమనే చెప్పాలి.

భారత బ్యాటర్లలో వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో మరోసారి విరుచుకు పడితే కరీబియన్ బౌలర్లకు కష్టాలు తప్పవు.

భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

First Published:  12 Aug 2023 1:00 PM IST
Next Story