టీ-20 సిరీస్ లో నేడే ఆఖరాట!
భారత్ -శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. రాజ్ కోట వేదికగా ఈరోజు జరిగే ఆఖరిమ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి.

టీ-20 సిరీస్ లో నేడే ఆఖరాట!
భారత్ -శ్రీలంకజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. రాజ్ కోట వేదికగా ఈరోజు జరిగే ఆఖరిమ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి...
కొత్తసంవత్సరంలో తొలి టీ-20 ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతున్న టాప్ ర్యాంకర్ భారత్, 8వ ర్యాంకర్ శ్రీలంక..తొలి సిరీస్ కు గురిపెట్టాయి. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో రెండుజట్లూ చెరో మ్యాచ్ నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో ఆఖరాట డూ ఆర్ డైగా మారింది. రెండోవిజయం సాధించినజట్టుకే సిరీస్ కైవసం చేసుకొనే అవకాశం ఉండడంతో చావోరేవో అన్నట్లుగా తయారయ్యింది.
నిలకడలేమితో భారత్- ఆత్మవిశ్వాసంతో శ్రీలంక..
అంత్జాతీయ క్రికెట్లో ర్యాంకింగ్స్ తో ఏమాత్రం పనిలేదని, ప్రతిభకు ర్యాంకింగ్స్ ఏమాత్రం కొలమానం కాదని ప్రస్తుత సిరీస్ మరోసారి తెలియచెప్పింది. భారత్ పేరుకు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉన్నా పలువురు యువఆటగాళ్లతో కూడినజట్టుతో నిలకడలేమితో విలవిలలాడుతోంది.
ముంబై వేదికగా ముగిసిన తొలిపోరులో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్...పూణే వేదికగా జరిగిన హైస్కోరింగ్ రెండోపోరులో మాత్రం 16 పరుగుల ఓటమితో చల్లబడిపోయింది.
హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని భారతజట్టులో నిలకడలేమి, అసమతౌల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
ప్రధానంగా ఓపెనింగ్ జోడీ ఇషాన్ కిషన్- శుభ్ మన్ గిల్ చక్కటి ఆరంభాన్ని ఇవ్వలేకపోడం, తురుపుముక్కలాంటి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్థాయికి తగ్గట్టుగా బౌల్ చేయలేకపోడం భారత్ కు ప్రధాన సమస్యగా, బలహీనతగా మారింది.
మిడిలార్డర్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, దీపక్ హుడాల పుణ్యమా అంటూ నెట్టుకొస్తోంది. పేస్ బౌలింగ్ లో సైతం శివం మావీ మినహా నమ్మదగిన బౌలర్ ఒక్కరూ కనిపించడం లేదు.
పవర్ ప్లే ఓవర్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో చతికిలబడి పోడం ప్రధాన బలహీనతగా మారింది. పూణేపోరులో వరుస నోబాల్స్ తో సతమతమైన పేసర్ హర్షదీప్ సింగ్ ను పక్కనపెట్టి..హర్షల్ పటేల్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి. మొదటి రెండుమ్యాచ్ ల్లో విఫలమైన శుభ్ మన్ గిల్ ను పక్కన పెట్టి ఓపెనర్ గా రుతురాజ్ గయక్వాడ్ ను తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆల్ రౌండ్ పవర్ తో శ్రీలంక...
కెప్టెన్ దాసున్ షనక, వనిందు హసరంగ, కరుణరత్నే, మహేశ్ తీక్షణ లాంటి ఆల్ రౌండర్లతో ఆసియా చాంపియన్ శ్రీలంక సమతూకంతో, అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది.
ప్రస్తుత సిరీస్ లోని తొలి టీ-20లో 2 పరుగుల స్వల్పతేడాతో ఓడినా..పూణేలో ముగిసిన రెండో పోరులో 206 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా సత్తాచాటుకొంది.
భారతగడ్డపై ఆడిన గత 13 టీ-20 మ్యాచ్ ల్లో శ్రీలంక ఎట్టకేలకు తొలివిజయంతో భారత విజయపరంపరకు గండికొట్టగలిగింది.
పరుగుల గని రాజ్ కోట ....
రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇప్పటి వరకూ జరిగిన టెస్టు, వన్డే, టీ-20 మ్యాచ్ ల్లో భారీస్కోర్లు నమోదవుతూ వచ్చాయి. ఇక్కడి పిచ్ కు బ్యాటర్ల స్వర్గంగా పేరుంది. ఈరోజు జరిగే పోరులో సైతం 200కు పైగా స్కోర్లు నమోదైనా ఆశ్చర్యంలేదు.
రాజ్ కోట వేదికగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగు అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ చేసినజట్లు రెండుసార్లు, ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్నజట్లు రెండుసార్లు చొప్పున విజయాలు సాధించాయి.
ముందుగా టాస్ నెగ్గినజట్టు ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు అభిమానులు భారీసంఖ్యలో తరలి రానున్నారు.